Squash player
-
విఖ్యాత ఆటగాడిగా ఎదిగిన స్క్వాష్ దిగ్గజం ఇకలేరు
భారత దిగ్గజ స్క్వాష్ క్రీడాకారుడు బ్రిగేడియర్ రాజ్‌కుమార్ మన్‌చందా కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు కాగా... అనారోగ్య కారణాలతో ఢిల్లీలో మృతి చెందినట్లు మంగళవారం కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రాజ్ మన్‌చందా మృతిపట్ల క్రీడాభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విశేషంగా రాణించి భారత్‌కు పతకాలు అందించిన ఆయన స్క్వాష్‌లో విఖ్యాత ఆటగాడిగా ఎదిగారు. 33 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఆయన 1977 నుంచి 1982 వరకు వరుసగా టైటిళ్లను నిలబెట్టుకున్నారు.రాజ్ తన కెరీర్లో ఓవరాల్‌గా 11 టైటిళ్లు సాధించారు. ఆసియా చాంపియన్‌షిప్ సహా పలు అంతర్జాతీయ టోర్నీలలో సత్తా చాటుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1983లో ‘అర్జున అవార్డు’ను అందజేసింది. 1980 దశకాన్ని శాసించిన జహంగీర్ ఖాన్‌ను 1981లో ఎదుర్కొన్న ఆయన పలు అంతర్జాతీయ టోర్నీలకు భారత స్క్వాష్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. కరాచీలో 1981లో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రజత పతకం సాధించింది. 1984 ఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలవడం ఆయన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కాగా... ఆ ఈవెంట్లో టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. ఆస్ట్రేలియాతోన్ టెన్నిస్ గ్రేట్ ఫ్రేజర్ మృతి మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టెన్నిస్ దిగ్గజం నీల్ ఫ్రేజర్ మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో 91 ఏళ్ల ఫ్రేజర్ మృతి చెందారు. తమ దేశం ఓ మేటి దిగ్గజాన్ని కోల్పోయిందని టెన్నిస్ ఆ్రస్టేలియా (టీఏ) తెలిపింది. 24 ఏళ్ల సుదీర్ఘ టెన్నిస్ కెరీర్లో ఫ్రేజర్ మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లతో పాటు ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టోర్నీలో వరుసగా నాలుగుసార్లు ఆస్ట్రేలియాను గెలిపించాడు. 1960లో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో తమ దేశానికే చెందిన దిగ్గజం రాడ్ లేవర్ను ఓడించి టైటిల్ చేజిక్కించుకున్నారు. ఆ ఏడాది ఏకంగా 11 మేజర్ టైటిల్స్ (పురుషుల డబుల్స్) సాధించారు. అంతకుముందు ఏడాది (1959) యూఎస్ ఓపెన్‌లో టైటిళ్ల క్లీన్‌స్వీప్ చేశారు. సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మూడు ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. టెన్నిస్‌లో విజయవంతమైన, విశేష కృషి చేసిన ఆయన్ని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 1984లో ‘టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చింది. 2008లో టెన్నిస్‌లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా అభివరి్ణంచే ‘ఫిలిప్ చాట్రియెర్’ అవార్డును ఫ్రేజర్‌కు ప్రదానం చేసింది. -
బ్రిటిష్ ఓపెన్ విజేత అనాహత్ సింగ్
ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో అనాహత్ 11–8, 8–11, 11–7, 11–5తో సొహైలా హజీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. 14 ఏళ్ల అనాహత్ బ్రిటిష్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. 2019లో ఆమె అండర్–11 విభాగంలో టైటిల్ సాధించింది. గతంలో భారత్ నుంచి జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ మాత్రమే బ్రిటిష్ ఓపెన్ జూనియర్ టోర్నీలో విజేతలుగా నిలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ ఓటమి
ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 14 ఏళ్ల అనాహత్ సింగ్ 7–11, 11–6, 8–11, 8–11తో ఫెరూజ్ అబూల్కెర్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అనాహత్ రెండో రౌండ్లో 11–1, 11–3, 11–4తో మేరీ వాన్ రీత్ (బెల్జియం)పై, మూడో రౌండ్లో 11–5, 11–4, 11–8తో ఎమ్మా బార్ట్లే (ఇంగ్లండ్)పై గెలిచింది. -
ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు!
అవరోధాలు, ఆటంకాలు, అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా మనలో ప్రతిభ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యమైనా చివరికి నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. అనుకున్న దానిని సాధించేందుకు పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలని నిరూపించి, ఉదాహరణగా నిలుస్తోంది పదిహేడేళ్ల ఖుషీ శర్మ. ఒక పక్క చదువు, మరోపక్క ఆటల్లో రాణిస్తూనే పాఠకులు మెచ్చే నవలను రాసి, టీన్ ఆథర్‌గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చండీగఢ్‌కు చెందిన ఖుషీ శర్మ ఇంటర్మీడియట్ విద్యార్థి. జాతీయ స్థాయి స్క్వాష్ పోటీల్లో పాల్గొని రెండుసార్లు పతకాలను సాధించింది. పియానో బాగా ప్లే చేస్తుంది. కథక్ డ్యాన్సర్. అనేక స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఏది అనిపించినా వెంటనే నోట్ చేసుకునే అలవాటు ఉన్న ఖుషీ..ఏకంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నవలను రాసింది.‘ద మిస్సింగ్ ప్రాఫెసీ– రైజ్ ఆఫ్ ద బ్లూ ఫోనిక్స్’ పేరిట నవలను విడుదల చేసింది. బుక్ విడుదలైన నెలరోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడవడమేగాక, అమేజాన్ ట్రెండింగ్ బుక్ జాబితాలో టాప్‌ప్లేస్‌లో దూసుకుపోతోంది ఖుషి నవల. ఇంత చిన్నవయసులో థ్రిల్లింగ్ నవలను రాసి పాఠకుల మనసులు దోచుకుంటోంది ఈ టీనేజర్. కరోనా సమయంలో వైరస్‌కు సంబంధించిన అనేక విషయాలపై పరిశోధిస్తూ, అందుకు సంబంధించిన సమాచారాన్ని తను నడుపుతోన్న ‘బ్లాగ్ విత్ ఖుషి’లో పోస్ట్ చేస్తుండేది. ఇలా అనేక విషయాలమీద అవగాహన ఏర్పర్చుకున్న ఖుషి తనకు వచ్చే వినూత్న ఆలోచనలను పుస్తకంలో రాసి దాన్ని నవలగా తీర్చిదిద్దింది. ఈ నవలలో అంబర్ హార్ట్ అనే హీరోయిన్ ఉంటుంది. ఈమె మూడొందల ఏళ్లకోసారి ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే దుష్టశక్తులతో పోరాడుతుంటుంది. దీనిలో అడుగడుగునా సాహసాలు, సైన్స్, పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఉత్కంఠ భరితంగా కథలో వర్ణించింది ఖుషి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలు దీనిలో ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఎంతో అనుభవం ఉన్న రచయితలా ఖుషి నవలను రాయడం విశేషం. ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు! ‘‘చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టమేగానీ, నా నవల పాఠకులకు నచ్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా రాకముందు పదోతరగతి పరీక్షలు, మరోపక్క స్క్వాష్‌లో బిజీగా ఉండేదాన్ని. కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. ఇలా రాస్తుండగా... ‘వన్ కంట్రోల్స్ ఫైర్, ద అదర్ కంట్రోల్స్ సోల్, టు సేవ్ ది వరల్డ్, ఈచ్ మస్ట్ ప్లే దెయిర్ రోల్’ కవిత తట్టింది. దీని ఆధారంగా పదిహేడు చాప్టర్ల వరకు రాశాను. అయితే మధ్యలో నా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో అక్కను విసిగిస్తున్నానని చెప్పి ‘నువ్వు రాస్తున్న బుక్‌ను రెండురోజుల్లో’ పూర్తిచేయగలవా? అని ఇంట్లో వాళ్లు డెడ్‌లైన్ పెట్టారు. దీంతో కొన్ని రోజుల్లో తొమ్మిదివేల పదాలు రాశాను. అలా రాస్తూ 75000 పదాలతో ఏకంగా ఈ నవలను రాయగలిగాను’’ అని ఖుషి చెప్పింది. -
క్వార్టర్స్‌లో సౌరవ్ ఓటమి
షికాగో (అమెరికా): ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ బరిలో మిగిలిన సౌరవ్ ఘోషాల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ సౌరవ్ 8–11, 6–11, 7–11తో మూడో సీడ్ సైమన్ రోస్నర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో 6–2తో ఆధిక్యంలో నిలిచిన సౌరవ్ ఆ తర్వాత తడబడి తేరుకోలేకపోయాడు. ఈ గెలుపుతో ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా రోస్నర్ నిలిచాడు. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
బాక్సింగ్: పురుషుల 49 కేజీల ఫైనల్ (అమిత్ గీహసన్బాయ్; మ.గం.12.30 నుంచి). బ్రిడ్జ్: పురుషుల పెయిర్ ఫైనల్–2; మహిళల పెయిర్ ఫైనల్–2; మిక్స్డ్ పెయిర్ ఫైనల్–2 ఉ.గం.8.30 నుంచి). పురుషుల హాకీ: భారత్గీపాకిస్తాన్ కాంస్య పతక పోరు (సా.గం.4 నుంచి). స్క్వాష్: మహిళల టీమ్ ఫైనల్ (భారత్గీహాంకాంగ్; మ.గం.1.30 నుంచి). సోనీ టెన్–2, టెన్–3, సోనీ ఈఎస్పీఎన్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఇండియా ఓపెన్ విజేత సౌరవ్
ముంబై: భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 5–11, 6–11, 11–7, 12–10తో నికోలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. నిర్ణాయక ఐదో గేమ్‌లో సౌరవ్ 3–7తో, 5–8 తో, 8–10తో వెనుకబడి... ఆ తర్వాత పుంజుకొని వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 12–10తో ఐదో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. -
కెరీర్ కోసం కిడ్నీని వేలానికి పెట్టాడు..
బిజ్నూరు: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాడు. అంతర్జాతీయ వేదికలపై గెలిచి దేశానికి పలు పతకాలు అందించాడు. అయినా ఈ యువ క్రీడాకారుడిని ప్రోత్సహించేవారే కరువయ్యారు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కెరీర్ కొనసాగించడానికి కిడ్నీని వేలానికి పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్క్వాష్ క్రీడాకారుడు 20 ఏళ్ల రవి దీక్షిత్ దయనీయ పరిస్థితి ఇది. జూనియర్ స్థాయి నుంచే గత పదేళ్లుగా రవి దీక్షిత్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010 ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ఇంకా ఎన్నో పతకాలు సాధించాడు. అయినా అతణ్ని ఎవరూ ప్రోత్సహించలేదు. శిక్షణ కోసం, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అయ్యే ఖర్చులు భరించలేని పరిస్థితి. వచ్చే నెలలో జరిగే దక్షిణాసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు తగినంత డబ్బు అందుబాటులో లేదు. స్క్వాష్ క్రీడపై మక్కువతో, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదలతో, కెరీర్ కొనసాగించిందుకు కిడ్నీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. ఆసక్తి గల వారు సంప్రదించాలని కోరాడు. 'దమ్పూర్ సుగర్ మిల్ నాకు సాయం చేస్తోంది. అయితే వాళ్లు ఎంతకాలమని సాయం చేస్తారు? గువహటిలో జరిగే దక్షిణాసియా గేమ్స్‌లో భారత్ తరపున ఆడాలి. ఈ టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు చెన్నైలో శిక్షణ పొందాలి. ఇందుకు తగినంత డబ్బు నా దగ్గర లేదు. ఇందుకోసం కిడ్నీ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా. కావాల్సినవారు సంప్రదించండి. కిడ్నీ ధర 8 లక్షల రూపాయలు' అని ఫేస్బుక్లో రవి దీక్షిత్ పోస్ట్ చేశాడు. ఈ వార్త తెలియగానే అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రవి తండ్రి రామకైలాస్ దీక్షిత్ నాలుగో తరగతి ఉద్యోగి. ఆయన జీతంలో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. రవి సంపాదించిన డబ్బుతో తన కుమార్తెకు పెళ్లి చేశానని, అతనికి ఆర్థిక సాయం చేయలేని స్థితిలో ఉన్నానని, కిడ్నీ అమ్మాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా చెప్పానని రామకైలాస్ దీక్షిత్ చెప్పాడు. రవి కిడ్నీ అమ్మకం వార్త విని పలువురు స్పందించారు. అతనికి ఎప్పుడూ అండగా ఉంటామని, తమను సంప్రదించాలని సుగర్ మిల్ యాజమాన్యం సూచించింది. యూపీ మంత్రి మూల్‌చంద్ చౌహాన్ స్పందిస్తూ.. ఈ విషయం విని షాకయ్యానని, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో చర్చించి రవికి సాయం చేస్తామని, త్వరలో అతని కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. యూపీ ప్రభుత్వం ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడం లేదని, రవి లాంటి క్రీడాకారులకు సాయం చేయడం బాధ్యతని దమ్పూర్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ రాణా వ్యాఖ్యానించారు. -
'అందుకే మూడేళ్లుగా దూరంగా ఉంటున్నా'
న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా తమకు ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంట్ లో పాల్గొంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ స్పష్టం చేసింది. కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నిలో ఆమె ఆడడం లేదు. మహిళా ప్లేయర్లను చిన్నచూపు చూస్తున్న కారణంగానే గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడింది. కేరళ మూలాలు ఉన్న 23 ఏళ్ల పల్లికల్ 2011లో నేషనల్ టైటిల్ గెలిచింది. అప్పటి నుంచి ఆమె జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంది. పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆమె సూటిగా ప్రశ్నించింది. కేరళలో ఆడడాన్ని ఇష్టపడతానని, జాతీయ టోర్నిల్లో ఆడకపోవడం బాధగా ఉందని 18వ ర్యాంకులో కొనసాగుతున్న పల్లికల్ వాపోయింది. -
రన్నరప్ హరీందర్
క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్) : భారత అగ్రశ్రేణి స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ క్రైస్ట్‌చర్చ్ అంతర్జాతీయ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో హరీందర్ 11-8, 10-12, 9-11, 6-11తో డెక్లన్ జేమ్స్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హరీందర్ తొలి గేమ్‌ను గెల్చుకున్నప్పటికీ ఆ తర్వాత అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. -
సౌరవ్ ఘోషాల్ కు సిల్వర్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ మేటి ఆటగాడు సౌరవ్ ఘోషాల్ వెండి పతకం గెల్చుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కువైట్ ఆటగాడు అబ్దుల్లా ఆల్మీజయేన్ చేతిలో 3-2 (12-10 11-2, 12-14, 8-1, 9-11) తో ఓడిపోయి వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ సౌరవ్ 11-9, 11-4, 11-5తో ప్రపంచ 35వ ర్యాంకర్ బెంగ్ హీ (మలేసియా)పై గెలిచి రికార్డు సృష్టించాడు. -
‘టెక్సాస్’ రన్నరప్ దీపిక
హోస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్టు టీనేజ్ సంచలనం, 18 ఏళ్ల నూర్ ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక 7-11, 11-5, 7-11, 8-11 తేడాతో ఓటమిపాలైంది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ, టాప్ సీడ్ లో వీ వర్న్తో సహా ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణుల్ని ఇంటిబాట పట్టించిన షెర్బిని.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. దీపిక పోరాడినా షెర్బిని దూకుడు ముందు నిలవలేకపోయింది. అయితే 12వ ర్యాంకర్ దీపిక టైటిల్ సాధించలేకపోయినా.. ఫైనల్‌కు చేరడం ద్వారా భారీగా పాయింట్లు సాధించి తిరిగి టాప్-10లో స్థానం సంపాదించుకునే అవకాశాలను సుగమం చేసుకుంది. -
మకావు ఓపెన్ విజేత దీపిక ఫైనల్లో ప్రపంచ
మకావు: భారత టాప్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికాల్... మకావు ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ దీపిక 12-10, 5-11, 11-7, 11-9తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ రాచెల్ గ్రిన్హామ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. దీంతో తన కెరీర్లో ఏడో డబ్ల్యూస్ఏ (మహిళల స్క్వాష్ అసోసియేషన్) టైటిల్‌ను కైవసం చేసుకుంది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. కీలక సమయంలో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ‘సెమీస్‌లో నటాలీపై గెలవడం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. సమ్మర్లో నేను తీసుకున్న శిక్షణ ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. మైదానం వెలుపల చాలా కష్టపడ్డా. క్రమం తప్పకుండా టాప్-10 ప్లేయర్లపై విజయాలు సాధిస్తున్నా. మానసిక నైపుణ్యంతో మ్యాచ్‌లు ఆడుతున్నాను’ అని పల్లికాల్ విశ్లేషించింది.