'అందుకే మూడేళ్లుగా దూరంగా ఉంటున్నా'
న్యూఢిల్లీ: పురుషులతో సమానంగా తమకు ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంట్ లో పాల్గొంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ స్పష్టం చేసింది. కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నిలో ఆమె ఆడడం లేదు. మహిళా ప్లేయర్లను చిన్నచూపు చూస్తున్న కారణంగానే గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడింది.
కేరళ మూలాలు ఉన్న 23 ఏళ్ల పల్లికల్ 2011లో నేషనల్ టైటిల్ గెలిచింది. అప్పటి నుంచి ఆమె జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంది. పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆమె సూటిగా ప్రశ్నించింది. కేరళలో ఆడడాన్ని ఇష్టపడతానని, జాతీయ టోర్నిల్లో ఆడకపోవడం బాధగా ఉందని 18వ ర్యాంకులో కొనసాగుతున్న పల్లికల్ వాపోయింది.