గాడితప్పిన ‘ట్రెజరీ’ పాలన | Horizontal goals deputation employees | Sakshi
Sakshi News home page

గాడితప్పిన ‘ట్రెజరీ’ పాలన

Published Wed, Mar 15 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

గాడితప్పిన ‘ట్రెజరీ’ పాలన

గాడితప్పిన ‘ట్రెజరీ’ పాలన

ఆర్నెళ్లుగా పత్తాలేని రెగ్యులర్‌ డీడీ
మేడ్చల్‌ ఏటీఓకు ఇన్‌చార్జీ  బాధ్యతలు
సక్రమంగా లేని ఇన్‌చార్జి డీడీ పనితీరు
అడ్డగోలుగా ఉద్యోగులకు డిప్యూటేషన్‌లు
రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జిల్లా ఉద్యోగులు


ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : ఆర్నెళ్లుగా రెగ్యులర్‌ డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) లేక జిల్లా ట్రెజరీ కార్యాలయ పాలన గాడితప్పింది. ఈ ప్రభావం బిల్లులు పాస్‌ చేయడం ఎస్‌టీఓలకు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా శాఖలో ఇద్దరు సీనియర్‌ ఏటీఓలు ఉండగా.. మేడ్చల్‌ ట్రెజరీ శాఖ ఏటీఓ మోహన్‌రావుకు ఇన్‌చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించడం శాఖలోని సీనియర్‌ ఏటీఓలతోపాటు ఎస్‌టీఓలను కూడా తీవ్ర నిరాశ పర్చింది.

ఇన్‌చార్జి డీడీగా వచ్చిన మేడ్చల్‌ ఏటీఓ పనితీరు సక్రమంగా లేకపోవడం.. అడ్డగోలుగా అక్రమ డిప్యూటేషన్‌లు, అలాగే మహిళా ఉద్యోగులను పని పేరిట వేధిస్తున్నారనే ఆరోపణలతో 25 రోజుల క్రితం జిల్లా ట్రెజరీ శాఖ ఉద్యోగులు రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్‌  కేఎస్‌ఆర్‌సీ మూర్తికి లిఖిత పూర్వకంగా   ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్‌చార్జి డీడీగా ఉన్న మోహన్‌రావు ప్రస్తుతం అనారోగ్యం పేరిట సెలవులో వెళ్లినట్లు తెలిసింది. ట్రెజరీ ఉద్యోగుల ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర డైరెక్టర్‌ విచారణకు ఆదేశించగా.. ఇంత వరకు విచారణ జరగలేదు.

ఆయన తీరే వేరు..
ట్రెజరీ శాఖకు రెగ్యులర్‌ డీడీగా గతేడాది ప్రభాకర్‌రెడ్డి పని చేశారు. ఆయన 2016 సెప్టెంబర్‌లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి నేటి వరకు జిల్లాకు ఆర్థికంగా కీలక శాఖ అయిన ట్రెజరీకి రెగ్యులర్‌     డీడీ లేరు. మధ్యలో హైదరాబాద్‌కు చెందిన               యాదగిరికి ఇన్‌చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించగా ఆయన కొద్ది రోజులు మాత్రమే పని చేశారు. తరువాత మేడ్చల్‌కు చెందిన ఏటీఓ మోహన్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే శాఖలో విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మేడ్చల్‌ నుంచి జిల్లాకు వచ్చే సరికి మధ్యాహ్నం 3 గంటలు కావడం, తిరిగి సాయంత్రమే విధులు ముగించుకుని వెళ్లడం పరిపాటిగా మారింది. ఆయన వచ్చినప్పుడే రిజిస్టర్‌లో సంతకాలు చేసేవారు. కాగా.. మహిళ ఉద్యోగినులను రాత్రి తొమ్మిది గంటల వరకు పని చేయించి ఇబ్బందులకు గురి పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. చివరికి రాత్రుల్లో పని చేసే వాచ్‌మన్‌తో పగలు కూడా పని చేయిస్తున్నట్లు తెలిసింది.

నచ్చినట్లుగా డిప్యూటేషన్‌లు
శాఖలో ఇన్‌చార్జి డీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్‌రావు తనకు నచ్చిన విధంగా ఉద్యోగులను డిప్యూటేషన్‌ల పేరిట వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. పక్షం రోజుల క్రితం కొంత మంది అటెండర్‌లను ఇష్టం లేకున్నా ఎస్‌టీఓ కార్యాలయాలకు డిప్యూటేషన్‌లతో బదిలీ చేశారు. సీనియర్‌ అకౌంటెంట్‌ రవి కిరణ్‌ను ఇష్టం లేకున్నా బోధన్‌ నుంచి నిజామాబాద్‌కు డిప్యూటేషన్‌పై వేయించారనే ఆరోపణలు ఉండగా, ఎస్‌టీఓ గంగాకిషన్‌ను కూడా జిల్లా కార్యాలయం నుంచి భీమ్‌గల్, మళ్లీ భీమ్‌గల్‌ నుంచి నిజామాబాద్‌కు డిప్యూటేషన్‌ ఆర్డర్లను తీశారు.

నెల రోజుల్లోనే 36 డిప్యూటేషన్‌లు, బదిలీలకు సంబంధించిన ఆఫీస్‌ ఆర్డర్లును తీశారు. కాగా తనపై రాష్ట్ర డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్న నాల్గవ తరగతి ఉద్యోగిని బిల్లులేవి పాస్‌ చేయవద్దని సంబంధిత అధికారులకు ఇన్‌చార్జి డీడీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. ట్రెజరీ శాఖలో ఇన్‌చార్జి డీడీగా ఉన్న మోహన్‌రావు బాటలోనే శాఖలో పని చేస్తున్న ఓ మహిళా ఇన్‌చార్జి ఏటీఓ కూడా నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు బిల్లులను పాస్‌ చేయకుండా తిరిగి పంపుతున్నారని తెలిసింది.

ఇబ్బందుల్లో ట్రెజరీ ఉద్యోగులు
రెగ్యులర్‌ డీడీ లేకపోవడం, ఉన్న ఇన్‌చార్జి డీడీ శాఖను పట్టించుకోకుండా అనారోగ్యం కారణంతో సెలవులో వెళ్లడంతో ట్రెజరీ శాఖ పాలన గాడితప్పుతోంది. ముఖ్యంగా మార్చి నెల ఆర్థిక సంవత్సరానికి ముగింపు కావడంతో జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు బిల్లులను పాస్‌ చేయించుకోవడం కోసం ట్రెజరీ కార్యాలయంలో  రోజు బారులు తీరుతున్నారు. కానీ.. డీడీ లేకపోవడంతో పెన్షన్, తదితర ముఖ్యమైన బిల్లులు నిలిచిపోతున్నాయి. సమస్యలు ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలో డీడీఓలకు పాలు పోవడం లేదు. ఇటు ఎస్టీలు కూడా డీడీ లేకుండా పని చేయడం ఇబ్బందిగా మారింది.

మార్చి నెలాఖరితో ప్రభుత్వానికి బడ్జెట్‌ను సరెండర్‌ చేయాల్సి ఉండగా ప్రస్తుతం డీడీ లేక పనులు నిలిచిపోతున్నాయి. ఈ విషయంపై ప్రస్తుతం ట్రెజరీ శాఖకు తాత్కాలికంగా అధికారిగా వ్యవహరిస్తున్న ఏటీఓ పుష్పలతను ‘సాక్షి’ వివరణ కోరగా.. డీడీ అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఫైళ్లను మేడ్చల్‌ వరకు తీసుకెళ్లి ఇన్‌చార్జి డీడీ మోహన్‌రావుతో సంతకాలు చేసుకుని వస్తున్నామని, బిల్లులు అన్నింటినీ పాస్‌ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement