డిప్యుటేషన్ 4 రోజుల్లో పూర్తవుతుందనగా సస్పెన్షనా?
కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు
ఐఆర్‌ఏఎస్ అధికారి ఎం.మధుసూధన్‌రెడ్డి అప్పీల్‌పై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్–ఏ అధికారుల డిప్యుటేషన్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత పొడిగింపునకు డీవోపీటీ అనుమతి కావాలి. దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించినట్టు గాని, క్రమశిక్షణ చర్యలపై చర్చించినట్టు గాని లేదు. నిజంగా అప్పీలెంట్ రికార్డులను తారుమారు చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారనే భయాలుంటే జూన్ 7నే సస్పెండ్ చేసి ఉండాలి.
కానీ.. రెండు నెలల సమయం తీసుకుని ఆగస్టు 19న చేయడం సరికాదు. అలాగే నాలుగు రోజులైతే డిప్యుటేషన్ ముగుస్తుందనగా సస్పెండ్ చేయడం సమర్థనీయం కాదు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఆదేశాలను నిలుపుదల చేస్తున్నాం’ అని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.
కేసు నేపథ్యమిదీ
ఐఆర్‌ఏఎస్ అధికారి ఎం.మధుసూధన్‌రెడ్డి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లోకి 2019లో వచ్చారు. మూడేళ్లు (2022 ఆగస్టు వరకు) పనిచేసేందుకు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు డిప్యుటేషన్‌ను కేంద్రం మరో రెండేళ్లు (2024 ఆగస్టు వరకు) పొడిగించింది.
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీగా పనిచేస్తున్న మధుసూధన్‌రెడ్డి సేవలను ఉపసంహరించుకుంటూ.. జీఏడీలో రిపోర్టు చేయాలని జూన్ 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేసిన మధుసూదన్‌రెడ్డికి ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన డిప్యుటేషన్ ఈ నెల 22తో పూర్తవుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అయన ఉండాలని, రిలీవ్ చేసుకోవద్దని 18న ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది.
ఒక్క రోజులోనే సస్పెన్షన్ ఉత్తర్వులు
ఆగస్టు 19న క్రమశిక్షణ చర్యల పేరిట సస్పెన్షన్ ఆదేశాలు చేసింది. ఏపీ ప్రభుత్వం తనకు సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌లోని క్యాట్‌లో ఎం.మధుసూధన్‌రెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్య తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని, సస్పెన్షన్ ఆదేశాలను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఈ అప్పీల్‌పై లతా బస్వరాజ్ పాట్నే, శాలిని మిశ్రా ధర్మాసనం గురువారం విచారించింది. సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని మధుసూధన్‌రెడ్డి తరఫున కె.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. డిప్యుటేషన్ పూర్తయిన తర్వాత అధికారిని కొనసాగించడానికి వీల్లేదని మార్చిలో డీవోపీటీ మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. సస్పెన్షన్ నివేదిక ఇంతవరకు ఇవ్వలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment