ఐపీఎస్‌లను వెంటనే డెప్యుటేషన్‌పై పంపండి | Send IPSs on deputation immediately | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌లను వెంటనే డెప్యుటేషన్‌పై పంపండి

Published Fri, Jun 14 2024 5:12 AM | Last Updated on Fri, Jun 14 2024 5:12 AM

Send IPSs on deputation immediately

రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ లేఖ

కోటా ప్రకారం ఐపీఎస్‌లను కేంద్రానికి పంపని రాష్ట్రాలు

కేంద్ర దర్యాప్తు, భద్రతా సంస్థల్లో 250 వరకు పోస్టుల ఖాళీలు

కొద్ది నెలల క్రితం ఓసారి లేఖ.. స్పందించని రాష్ట్రాలు

వెంటనే పంపాలంటూ మరోసారి లేఖ

ఐపీఎస్‌ అధికారులు లేక కేసుల దర్యాప్తులో ఆలస్యం

దేశ భద్రత విధుల్లోనూ ఇబ్బందులు

సాక్షి, అమరావతి: కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రత విభాగాల్లో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రాలు డెప్యు­టేషన్‌పై ఐపీఎస్‌ అధికారులను పంపకపోవడంపై కేంద్ర హోం శాఖ అసహనం వ్యక్తం చేసింది. ‘ఐపీఎస్‌ అధికారులను డెప్యుటేషన్‌పై పంపండి. ఇప్పటికే ఓసారి చెప్పాం. అయినా పంపడంలేదు. ఇ­ది సరైన పద్ధతి కాదు. 

కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నా­యి. వెంటనే కోటా మేరకు ఐపీఎస్‌ అధికారులను పంపించడి’ అని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు స్ప­ష్టం చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శు (సీఎస్‌)లకు లేఖలు రాసింది. కేంద్ర హోం శాఖ ఈ విధంగా రా­ష్ట్రాలకు లేఖ రాయడం ఈ ఏడాది ఇది రెండోసారి. 

కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర భద్రతా విభాగాల్లో రాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ అధికారులనే డెప్యుటేషన్‌పై నియమిస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి నిర్దేశించిన కోటా ప్రకారం ఐపీఎస్‌ అధికారులను డెప్యుటేషన్‌పై కొంతకాలం కేంద్ర సర్వీసులకు పంపాల్సి ఉంటుంది. డెప్యుటేషన్‌ ముగిసి తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరిన అధికారుల స్థానంలో మరికొందరిని పంపాలి. 

కానీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోటా మేరకు ఐపీఎస్‌లను కేంద్ర సర్వీసులకు పంపడంలేదు. దీనిపై కొన్ని నెలల క్రితం కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. అయినా హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఐపీఎస్‌ అధికారులను పంపించలేదు. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. ఐపీఎస్‌ అధికారులను కేంద్రానికి పంపాలని ఇటీవల మరో లేఖ రాసింది.

దాదాపు 250 పోస్టులు ఖాళీ
రాష్ట్రాల నుంచి ఐపీఎస్‌ అధికారులను డెప్యుటేషన్‌పై పంపించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 3 నాటికి ఎస్పీ, ఆ పైస్థాయి అధికారుల పోస్టులు  250 వరకు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక డీజీ, అదనపు డీజీ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎస్పీస్థాయిలో 129 పోస్టులు, డీఐజీ స్థాయిలో 81 పోస్టులు, ఐజీ స్థాయిలో 25  పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

దర్యాప్తులో జాప్యం.. దేశ భద్రత విధుల్లో ఇబ్బందులు
కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో ఇంత భారీగా అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. సీబీఐ, ఎన్‌ఐఏలపై ఇప్పటికే పనిభారం విపరీతంగా పెరిగింది. కీలక కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. 

బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ విభాగాల్లో అధికారుల కొరతతో సరిహద్దుల్లో భద్రత విధుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో అధికారుల కొరత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపింది. 

విభాగాల వారీగా ఖాళీలు
»  కేంద్ర దర్యాప్తు సంస్థలో 63 డీఐజీ పోస్టుల్లో 30 పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కావడంలేదు. రెండు ప్రత్యేక డైరెక్టర్‌ జనరల్, 8 అదనపు డైరెక్టర్‌ జనరల్‌ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.
» కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో 73 ఎస్పీ స్థాయి పోస్టులకుగాను 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి
»  ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)లో  36 ఎస్పీ స్థాయి పోస్టులలో 13 భర్తీ చేయాల్సి ఉంది.
»  కేంద్ర నిఘా విభాగం (ఐబీ)లో 83 ఎస్పీ పోస్టుల్లో 50 ఖాళీగా ఉన్నాయి.
»  భారత్‌–చైనా సరిహద్దుల్లో భద్రత విధులు నిర్వర్తించే ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) విభాగంలో 11 డీఐజీ పోస్టుల్లో 5 ఖాళీగా ఉన్నాయి. 
»  సరిహద్దు భద్రతా విభాగం (బీఎస్‌­ఎఫ్‌) లో ఒక అదనపు డీజీ పోస్టు, 26 డీఐజీ పోస్టుల్లో 10 పోస్టులు, 21 ఐజీ పోస్టులకుగాను ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
»  కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ బలగాలు (సీఆర్‌పీఎఫ్‌)లో 7 డీఐజీ పోస్టులు, 5 ఐజీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement