
ఐపీఎస్ అభిలాష బిస్త్‌కు స్పష్టం చేసిన క్యాట్
కేంద్రం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ
తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో విధుల్లో చేరాలని సీనియర్ ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్‌కు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) బుధవారం సూచించింది. అక్కడ కూడా సీనియర్ అధికారుల అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ, విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను నిలుపుదల చేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
అభిలాష.. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆమెను మొదట పశ్చిమ బెంగాల్ కేడర్‌కు కేటాయించారు. అయితే ఆమె ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారిని వివాహం చేసుకుని 1997లో తన కేడర్‌ను ఏపీకి మార్చుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను ఏపీకి కేటాయించారు. కేటాయింపుల అంశంపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా ఆమె 11 సంవత్సరాలుగా తెలంగాణలో కొనసాగుతున్నారు. ఇలా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినా.. కొందరు ఐపీఎస్‌లు తెలంగాణలోనే కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి వెంటనే ఏపీకి వెళ్లేలా రిలీవ్ చేయాలని ఫిబ్రవరి 21న కేంద్రం.. తెలంగాణను ఆదేశించింది. దీంతో 22న తెలంగాణ సర్కార్ అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ అభిలాష క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జ్యుడీషియల్ సభ్యురాలు డాక్టర్ లతా బస్వరాజ్ పట్నే, పరిపాలన సభ్యురాలు శాలిని మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది.
సీనియారిటీ వివాదం ఉంది..
పిటిషనర్ తరఫు న్యాయవాది జె.సుధీర్ వాదనలు వినిపి స్తూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు నిలుపుదల చేయాలని కోరారు. ఐపీఎస్ అధికారుల సీనియారిటీకి సంబంధించిన వివాదం ఉందన్నారు. ఈ విషయంలో అభిలాష వాదనను గతంలో క్యాట్, హైకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న బెంచ్.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై వెంటనే స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్రం వాదనలు కూడా విని తీర్పు వెలువరిస్తామని, అప్పటివరకు ఏపీలో చేరాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment