ఖమ్మం : సర్కార్ బళ్లలో సార్లు లేకపోవడంతో చదువుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లలకు చదువు చెప్పేదెవరంటూ వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, రవాణా సౌకర్యాలు ఉన్న గ్రామాల్లోని పాఠశాలల్లో పరిమితికి మించి ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ మారుమూల గ్రామాల్లో పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులే కరువయ్యారు. ఆయా గ్రామాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు వారు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
జిల్లాలోని 45 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. దీంతో ఆ పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి నుంచి తెరిచిన నాధుడే కరువయ్యాడు. ఈ క్రమంలో తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలా..? అంటూ ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంత కాలం విద్యా వలంటీర్లు, డిప్యుటేషన్‌పై వచ్చిన టీచర్లతో నిర్వహించిన ఈ పాఠశాలను ఈ ఏడాది ఏ విధంగా కొనసాగించాలా..? అంటూ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
డిప్యుటేషన్‌లపైనే ఆశలు...
జిల్లాలో 1620 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పట్లో నూతన ఉపాధ్యాయుల నియామకాలు లేవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హరీశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మరోపక్క విద్యావలంటీర్లను నియమించేది లేదని ఆర్వీఎం అధికారులు తేల్చి చెప్పారు. దీంతో జిల్లాలో ఉపాధ్యాయులే లేని 45 పాఠశాలలను ఏ విధంగా తెరవాలా..? అంటూ విద్యాశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
గత ఏడాది ఏదో విధంగా సమీపంలో ఉన్న పాఠశాలల నుంచి ఒకో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై ఆయా పాఠశాలలకు పంపించారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు కాదనలేక వారు సైతం తప్పనిపరిస్థితుల్లో అక్కడికి వెళ్లారు. గత విద్యాసంవత్సరం వరకు ఉన్న డిప్యుటేషన్ రద్దు కావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సంవత్సరం తిరిగి డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. గత సంవత్సరం డిప్యుటేషన్‌పై వెళ్లి ఉపాధ్యాయుల్లో కొంత మంది తిరిగి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మరికొందరు మాత్రం అసలే ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు వెళ్లి ఇబ్బంది పడడం ఎందుకని వెనుకడుగు వేస్తున్నారు.
దీనికి తోడు జిల్లాలో 686 పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు(ఏకోపాధ్యాయ) మాత్రమే ఉన్నారు. ఏ కారణంతోనైనా ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోతే ఆ రోజు ఇక తాళం వేయాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం: డీఈఓ
జిల్లాలో 45 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని, కానీ ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సమీప పాఠశాలల్లోని ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపిస్తామని, అందుకోసం కలెక్టర్ అనుమతి కోరుతున్నామని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో డిప్యుటేషన్ ఆర్డర్ ఇస్తామని డీఈఓ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిప్యుటేషన్ వేసిన ఉపాధ్యాయులు తప్పకుండా ఆయా పాఠశాలలకు వెళ్లాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, ఇతర ఉపాధ్యా పోస్టుల అవసరంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని అన్నారు. నూతన డీఎస్సీ ద్వారా జిల్లాలోని ఖాళీలు భర్తీ చేస్తామని డీఈఓ అన్నారు.
చదువు సాగేదెట్టా..?
Published Sat, Jul 5 2014 5:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement
Advertisement