Hariswar reddy
-
మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు
పరిగి(రంగారెడ్డి): టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పరిగి ఎస్ఐ నగేష్‌కుమార్ ధ్రువీకరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున హరీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున టి.రామ్మోహన్‌రెడ్డి పరిగి స్థానానికి పోటీ చేశారు. అయితే గెలుపొందిన రామ్మోహన్‌రెడ్డి నిర్దేశిత వ్యయంకంటే ఎక్కువ ఖర్చు చేశారంటూ హరీశ్వర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రామ్మోహన్‌రెడ్డి ఎక్కువ వ్యయం చేశారంటూ హరీశ్వర్‌రెడ్డి సమర్పించిన పత్రాల్లో ఉన్న సంతకం రామ్మోహన్‌రెడ్డి సంతకాలతో సరిపోలలేదని తేల్చారు. ఆ నివేదికను కలెక్టర్ ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ నివేదికను ఆర్టీఐ ద్వారా పొందిన రామ్మోహన్‌రెడ్డి.. హరీశ్వర్‌రెడ్డిపై ఫిర్యాదుచేశారు. ఫోర్జరీ, చీటింగ్‌కు పాల్పడ్డారంటూ సోమవారం పరిగి కోర్టును ఆశ్రయించారు. స్పందించిన పరిగి కోర్టు న్యాయమూర్తి హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో హరీశ్వర్‌రెడ్డిపై ఎస్ఐ నగేష్‌కుమార్ ఫోర్జరీ, చీటింగ్ 417, 419, 420 తదితర ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా.. తాను ఎన్నికల్లో ఎక్కువ వ్యయం చేశానంటూ ఎలక్షన్ క మిషన్‌కు తప్పుడు పత్రాలు సమర్పించి ఫోర్జరీ, చీటింగ్‌కు పాల్పడిన హరీశ్వర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి పరిగిలో విలేకరులతో మాట్లాడారు. -
సీఎంను కలిసిన హరీశ్వర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధిష్టానంపై అలక వహించిన టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని గుర్రుమీద ఉన్న హరీశ్వర్... సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, నియోజకవర్గానికి నిధులు, కొన్ని పోస్టింగ్‌ల విషయంలో ముఖ్యమంత్రిని కలిశానే తప్ప... నామినేటెడ్ పదవుల ప్రస్తావనేది తమ మధ్య చర్చకు రాలేదని హరీశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలావుండగా, రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని, టీఐఐసీ లేదా తెలంగాణ ప్రాంతీయ బోర్డు పదవిని ఇస్తానని హరీశ్వర్‌కు సీఎం భరోసా ఇచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
అనవసర రాద్ధాంతం: ఎమ్మెల్యే టీఆర్ఆర్
పరిగి: నియోజకవర్గం అభివృద్ధి చెందింది కాంగ్రెస్ హయాంలోనేనని ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి పరిగిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తనపై మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పరిగికి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని రప్పించి రూ. 5కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. ఆ నిధులతోనే పరిగి పట్టణంలో సీసీ రోడ్లు వేశారన్నారు. కోయిల్‌సాగర్ నీళ్లు తేవటం జీవితాశయమని ‘చిగురుటాకు’ పుస్తకంలో రాయించుకున్న హరీశ్వర్‌రెడ్డి ఇప్పుడు మాటమార్చి ఆ ప్రాజెక్టు 10 సంవత్సరాలకోసారి కూడా నిండదని చెప్పటం విడ్డూరమన్నారు. ఎన్నికల వ్యయంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తనపై మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా మోడల్ స్కూళ్లు, ఇందిరమ్మ, ఐఏవై ఇళ్లు పరిగి నియోజకవర్గానికి మంజూరు చేయించానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దాంతి పార్థసారథి, డీసీసీ ఉపాధ్యక్షుడు సుభాష్‌చందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బద్రిగారి నారాయణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బండలింటి మైపాల్, పట్టణ అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీ సభ్యులు సమద్, సీనియర్ నాయకులు నస్కల్ అశోక్, దస్తగిరిపటేల్, సర్దార్‌మొల్‌సాబ్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఆంజనేయులు, సర్వర్, ఎదిరెకృష్ణ, రవీంద్ర, రామకృష్ణారెడ్డి, షాహెద్, నయీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐకి ఫిర్యాదు చేస్తా
టీఆర్ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డి ఖర్చు విషయంలో జిల్లా యంత్రాంగం లెక్కలు తారుమారు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, దీనిపై సీబీఐతో విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఆర్ నిబంధనలకు మించి డబ్బులు ఖర్చు చేశారని, కానీ ఖర్చును అంచనావేసే అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో వాహనాలకు సంబంధించి అద్దె వివరాలు పేర్కొన్న అధికారులు.. డ్రైవరు భత్యం, డీజిల్ ఖర్చు తదితర వివరాలు పేర్కొనలేదన్నారు. అదేవిధంగా ప్రచార క్రమంలో పెద్దఎత్తున టీషర్టులు పంచారని, నియోజకవర్గ అభివృద్ధిపై వేలసంఖ్యలో రెండు రకాల పుస్తకాలు అత్యంత ఖర్చుతో అచ్చు వేయించారని, కానీ ఈ వివరాలు అభ్యర్థి ఖర్చుల జాబితాలో చేరలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారికి సమాచార హక్కు చట్టం ద్వారా రామ్మోహన్‌రెడ్డి ఎన్నికల ఖర్చుపై అర్జీ పెడితే.. ఇరవై రోజుల తర్వాత తనకు వివరాలిచ్చారని, అయితే ఎన్నికల ఖర్చులో పరిశీలకుడు సమర్పించిన వివరాలు.. ఆర్టీఐ ద్వారా అందిన వివరాలకు పొంతన లేకుండా ఉందన్నారు. ఈ వివరాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, నిశితంగా పరిశీలించిన వారు పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారన్నారు. అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించేందుకే కాలయాపన చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అధికారుల్లో మార్పురాకుంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదు చేస్తానని, ఇప్పటికే సీవీసీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు హరీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'ఖర్చు' పై రచ్చ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (టీఆర్ఆర్) ఎన్నికల ఖర్చు వ్యవహారంపై నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల సమయంలో టీఆర్ఆర్ చేసిన ఖర్చును తక్కువ చేసి చూపించారనే అభియోగంతో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి వాదనకు దిగారు. ఇందుకు సంబంధించి ఆయన సేకరించిన ఆధారాలతో ఏకంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివరాల ఆధారంగా పరిశీలనకు దిగిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వివరాలు సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. నివేదికపై తాత్సారం.. ఎన్నికల వేళ టీఆర్ఆర్ ఖర్చుపై ఇదివరకు జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో యంత్రాంగం పరిశీలన చేసి నివేదిక సమర్పించింది. అయితే ఇందులో లెక్కలు తారుమారు చేశారని హరీశ్వర్ పేర్కొంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా టీఆర్ఆర్ ఖర్చు వివరాలకోసం సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీఐ ద్వారా అధికారులిచ్చిన వివరాలు, ఎన్నికల సంఘం వివరాలకు పొంతన లేకపోవడాన్ని పసిగట్టిన హరీశ్వర్‌రెడ్డి.. వాదనను తీవ్రతరం చేశారు. అధికారులను నిలదీయంతో సదరు అధికారులు డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో తాను సేకరించిన ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే నివేదిక ఇప్పటికే ఇవ్వాల్సి ఉండగా.. జిల్లా యంత్రాంగం మాత్రం నివేదిక సమర్పణపై తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. -
‘బంగారుతల్లి’ని కొనసాగిస్తాం
పరిగి: బంగారుతల్లి పథకాన్ని కొనసాగిస్తామని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయున విలేకర్లతో వూట్లాడారు. గత ప్రభుత్వ పథకాలైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే కొనసాగిస్తామని చెప్పారు. బంగారుతల్లి పథకం విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లాలో కోట్‌పల్లి, లక్నాపూర్, సాలార్‌నగర్ ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.75 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. 1.20 లక్షల మంది రైతులకు జిల్లాలో రుణమాఫీ వర్తించిందని చెప్పారు. ఇప్పటికే 25శాతం నిధులు ప్రభుత్వం విడుదల చేయగా మిగతా నిధులకు ప్రభుత్వం బ్యాంకులకు బాండ్లు ఇస్తుందన్నారు. ఎస్టీలకు, మైనార్టీలకు కల్యాణలక్ష్మి పథకం నవంబర్ 1వ తేదీ నుంచి అమలుచేస్తామని తెలిపారు. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన 500 జనాభా పైబడిన తండాలన్నీ పంచాయుతీలుగా మారనున్నాయన్నారు. కొత్తగా 200 బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు. కళ్యాణలక్ష్మి బీసీలకు, ఎస్సీలకు, నిరుపేద ఓసీలకు కూడా వర్తింపజేయాలని పరిగి మాజీ జెడ్పీటీసీ ఎస్పీ బాబయ్య కోరగా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల మహేష్‌రెడ్డి, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్‌మహేమూద్, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మమ్మ, పరిగి సర్పంచ్ విజయమాల, నార్మాక్స్ డెరైక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్, మాజీ జెడ్పీటీసీ ఎస్పీ బాబయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భాస్కర్, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి అశోక్‌రెడ్డి నాయుకులు పాల్గొన్నారు. -
చదువు సాగేదెట్టా..?
ఖమ్మం : సర్కార్ బళ్లలో సార్లు లేకపోవడంతో చదువుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లలకు చదువు చెప్పేదెవరంటూ వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, రవాణా సౌకర్యాలు ఉన్న గ్రామాల్లోని పాఠశాలల్లో పరిమితికి మించి ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ మారుమూల గ్రామాల్లో పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులే కరువయ్యారు. ఆయా గ్రామాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు వారు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. జిల్లాలోని 45 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. దీంతో ఆ పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి నుంచి తెరిచిన నాధుడే కరువయ్యాడు. ఈ క్రమంలో తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలా..? అంటూ ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంత కాలం విద్యా వలంటీర్లు, డిప్యుటేషన్‌పై వచ్చిన టీచర్లతో నిర్వహించిన ఈ పాఠశాలను ఈ ఏడాది ఏ విధంగా కొనసాగించాలా..? అంటూ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. డిప్యుటేషన్లపైనే ఆశలు... జిల్లాలో 1620 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పట్లో నూతన ఉపాధ్యాయుల నియామకాలు లేవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హరీశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మరోపక్క విద్యావలంటీర్లను నియమించేది లేదని ఆర్వీఎం అధికారులు తేల్చి చెప్పారు. దీంతో జిల్లాలో ఉపాధ్యాయులే లేని 45 పాఠశాలలను ఏ విధంగా తెరవాలా..? అంటూ విద్యాశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గత ఏడాది ఏదో విధంగా సమీపంలో ఉన్న పాఠశాలల నుంచి ఒకో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై ఆయా పాఠశాలలకు పంపించారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు కాదనలేక వారు సైతం తప్పనిపరిస్థితుల్లో అక్కడికి వెళ్లారు. గత విద్యాసంవత్సరం వరకు ఉన్న డిప్యుటేషన్ రద్దు కావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సంవత్సరం తిరిగి డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. గత సంవత్సరం డిప్యుటేషన్‌పై వెళ్లి ఉపాధ్యాయుల్లో కొంత మంది తిరిగి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మరికొందరు మాత్రం అసలే ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు వెళ్లి ఇబ్బంది పడడం ఎందుకని వెనుకడుగు వేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలో 686 పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు(ఏకోపాధ్యాయ) మాత్రమే ఉన్నారు. ఏ కారణంతోనైనా ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోతే ఆ రోజు ఇక తాళం వేయాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం: డీఈఓ జిల్లాలో 45 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని, కానీ ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సమీప పాఠశాలల్లోని ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపిస్తామని, అందుకోసం కలెక్టర్ అనుమతి కోరుతున్నామని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో డిప్యుటేషన్ ఆర్డర్ ఇస్తామని డీఈఓ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిప్యుటేషన్ వేసిన ఉపాధ్యాయులు తప్పకుండా ఆయా పాఠశాలలకు వెళ్లాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, ఇతర ఉపాధ్యా పోస్టుల అవసరంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని అన్నారు. నూతన డీఎస్సీ ద్వారా జిల్లాలోని ఖాళీలు భర్తీ చేస్తామని డీఈఓ అన్నారు. -
టీఆర్ఎస్ను గెలిపిస్తే రైతు రుణాలు మాఫీ
అనంతగిరి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ను గెలిపిస్తే రూ. లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆ పార్టీ పరిగి అసెంబ్లీ అభ్యర్థి హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలో ఆదివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వికారాబాద్ గర్జన’కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీంతో చేసేది లేక సభను ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో వికారాబాద్ పేరు ఫస్ట్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రులు పొన్నాల, సబితారెడ్డి, గీతారెడ్డి తదితరులు సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయారని, అలాంటి పార్టీకి ఓటేస్తారా అని ప్రజల్ని ఆయన ప్రశ్నించారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించవద్దని సూచించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎంపీడీఓ ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజాసేవకు సిద్ధమైన సంజీవరావును వికారాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్‌లో మంజీరా నీటి కోసం రూ.5 కోట్లు ఇవ్వని కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరుకు మాత్రం రూ. 2 వేల కోట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వికారాబాద్‌లో శాటిలైట్ పనులు ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా అవి పూర్తి కాకపోవడం దారుణమన్నారు. ఎమ్యెల్యే అభ్యర్థి సంజీవరావు మాట్లాడుతూ.. తమకు ఓటు వేయకుంటే పింఛన్, రేషన్ కట్ చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. వారి బెదిరింపులకు ప్రజలు భయపడవద్దని, వారికి టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, నాయకులు శుభప్రద్ పటేల్, స్వప్న, ఎన్నికల ఇన్చార్జి రోహిత్‌రెడ్డి, రాష్ట్ర కార్యద ర్శులు కృష్ణయ్య, విజయ్‌కుమార్, బంట్వారం పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, యాదగిరి యాదవ్, రాంచంద్రారెడ్డి, కొండల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటయ్య, బల్వంత్‌రెడ్డి, సమద్, వేణుగోపాల్‌రెడ్డి, రాంచందర్‌రావు, హన్మంత్‌రెడ్డి తదితరులున్నారు. -
జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
పరిగి, తాండూరు, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాను వ్యవసాయకంగా అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించి జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పరిగి మినీ స్టేడియం, తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో 5లక్షల నుంచి 6లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఇందులో పరిగి నియోజకవర్గంలోనే 1.5లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. పరిగి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న హరీశ్వర్ రెడ్డి తన కుటుంబ సభ్యుల్లో ఒకరని పేర్కొంటూ.. ఆయన ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని, మంత్రివర్గంలోకి తప్పకుండా హరీశ్వర్‌రెడ్డిని తీసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు తెలంగాణను మతప్రమేయంలేని సెక్యులర్ రాజ్యం చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు, గిరిజనులకు చేసిందేమీలేదని అన్నారు. కాంగ్రెస్‌తో సోపతిజేసి అన్నివిధాలుగా నష్టపోయామని, అధికారంలోకి వచ్చాక 14 నెలల్లో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు, ముస్లింలకు 12శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించి చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా జ్యుడీషియల్ పవర్ కల్పిస్తామన్నారు. రూ.1000 కోట్లతో ముస్లిం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, గిరిజన తండాలకు పంచాయతీలుగా మారుస్తామని అన్నారు. వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500ల చొప్పున పింఛన్లు ఇస్తామన్నారు. రూ.మూడు లక్షలతో 125 గజాల్లో 100శాతం రాయితీపై పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీలే ని రుణాలు అందిస్తామన్నారు. తాండూరులో కంది పరిశోధన కేంద్రం ‘ఇండియాలోనే తాండూరు కందిపప్పు ఫేమస్. హైదరాబాద్‌లో తాండూరు తువ్వర్ అంటే ఎవరైనా అనుమానం లేకుండా తీసుకుంటరు. అంత క్వాలిటీ ఉంటది. అందుకే తాండూరులో కంది పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘కర్ణాటకలో షాబాద్ బండలకు రాయల్టీ తక్కువ. తాండూరులో నాపరాతి (షాబాద్)రాయల్టీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో షాబాద్ బండలపై రూపాయి రాయల్టీని తగ్గించే నిర్ణయం తీసుకుంటాం’ అని కేసీఆర్ ప్రకటించారు. తాండూరు సభలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్, తాండూరు డివిజన్ అధ్యక్షులు విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. శ్రేణుల్లో అసంతృప్తి.. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పరిగి బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే సభలో ఉన్న పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్రెడ్డిలను మాట్లాడనివ్వకుండా కేసీఆర్ ఒక్కరే.. అదీ పది నిమిషాల్లోపే ప్రసంగాన్ని ముగించి వెళ్లపోవడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి. పరిగి సభలో ముస్లిం రిజర్వేషన్ సాధన ఫ్రంట్ అధ్యక్షుడు ఇఫ్తేకార్ అహ్మద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనీల్‌రెడ్డి, మీర్‌మహమూద్, సురేందర్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, అశోక్‌వర్ధన్ రెడ్డి, రవికుమార్, మునీర్, కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కమతం రాజేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వలస నేతలపై గురి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపు గుర్రాల జాబితాకు టీడీపీ తుది మెరుగులు దిద్దుతోంది. మారిన సమీకరణల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా మారిన సార్వత్రిక ఎన్నికల్లో సమర్థులను బరిలోకి దించేందుకు ఆశావహుల జాబితా వడపోతలో తలమునకలైంది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన తమ్ముళ్లలో ఉత్సాహం నింపేందుకు బలమైన అభ్యర్థుల రంగంలోకి దించాలని నిర్ణయించింది. భారతీయ జనతాపార్టీ పొత్తుతో సంబంధంలేకుండా అభ్యర్థులను ఖరారు చేస్తోంది. పొత్తుపై స్పష్టత వచ్చిన అనంతరమే సీట్ల సర్దుబాటు ఉంటుంది కనుక.. అప్పటివరకు ఎదురుచూడకుండా రేసు గుర్రాలను ఎంపికచేసే పనిలో నిమగ్నమైంది. జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ చోట్ల అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతోంది. పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, కేఎస్ రత్నం పార్టీని వీడడం టీడీపీని దెబ్బతీసింది. తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి కూడా కారెక్కినప్పటికీ, అనూహ్యంగా దివంగత మంత్రి, కాంగ్రెస్ నేత ఎం.చంద్రశేఖర్ కుమారులు పార్టీలో చేరడం టీడీపీకి కలిసివచ్చింది. ఇక్కడ ఈ కుటుంబానికే టికెట్ దాదాపుగా ఖరారైంది. పరిగి నుంచి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను బరిలో దించాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. మరోవైపు మాజీ జెడ్పీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్‌తో ‘దేశం’ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇక్కడి నుంచి పరిశీలించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2009లో వికారాబాద్ నుంచి పోటీచేసిన సంజీవరావు ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నందున.. ఈ స్థానానికి బలమైన అభ్యర్థిని ఖరారుచేసే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ లేదా ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి విజయ్‌కుమార్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. చేవెళ్ల నుంచి ఆర్థికంగా స్థితిమంతుడైన మేకల వెంకటేశం అభ్యర్థిత్వం దాదాపుగా ఖాయమైంది. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈయన రంగంలోకి దించడం ద్వారా రత్నంను నిలువరించవచ్చని అంచనా వేస్తోంది. కమలం కలిసివస్తే.. బీజేపీతో దోస్తీ కుదిరితే జిల్లాలో ఐదు సీట్లు వదులుకోవాల్సి రావచ్చనే సంకేతాలు ఆశావహులను ఆందోళ నకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, పరిగి, తాండూరు, ఉప్పల్ నియోజకవర్గాలను బీజేపీ ఆశిస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా వీటిని ఆ పార్టీకి కేటాయించాల్సివస్తే తమ పరిస్థితేంటనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో పార్టీలో పనిచేసిన నేతలను మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా వికారాబాద్‌కు చెందిన సీనియర్ నేత ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌తో ఆ పార్టీ నాయకత్వం టచ్‌లో ఉంది. కాంగ్రెస్ నేతలపై ఆశలు కాంగ్రెస్ జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందా అని టీడీపీ ఎదురుచూస్తోంది. ఆ పార్టీ టికెట్ దక్కని నేతలు సైకిలెక్కెందుకు సిద్ధమని సంకేతాలిచ్చిన నేపథ్యంలో జాబితా కోసం వే చిచూస్తోంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటరీ స్థానం సహా వికారాబాద్, చేవెళ్ల, పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ల టికెట్లను కాంగ్రెస్ జాబితాను పరిశీలించిన తర్వాతే తమ అభ్యర్థులను ఖరారు చేయాలని యోచిస్తోంది. టీ కాంగ్రెస్ జాబితా వెల్లడి అనంతరం సమీకరణలు మారిపోతాయని, అప్పుడు చాలా మంది నేతలు తమ గూటికి చేరుకుంటారని టీడీపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగిస్తున్న ఆ పార్టీ వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులపై కూడా వల విసురుతోంది. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నవారికి పోటీ తీవ్రంగాలేని నియోజకవర్గాలను ఆఫర్ చేయాలని నిర్ణయించింది. -
సారథి లేని సైకిల్..!
పరిగి, న్యూస్‌లైన్: పరిగి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగవ్యుగోచరంగా తయూరైంది. గత రెండేళ్లుగా పార్టీ పరిగి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. నరేందర్‌రెడ్డి పార్టీని వీడాక రెండుసార్లు పరిగి టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమైనప్పటికీ నియోజకవర్గానికి ఇన్చార్జిని కూడా నియుమించలేదు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అదునుగా భావించిన ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి వర్గం టీడీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయా మండలాలకు చెందిన పలువురు నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా చేసిన దోమ మండలానికి చెం దిన పలువురు కీలక నేతలు సైకిల్‌దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఒకటిరెండు రోజుల్లో కారులో వారికి బెర్తులు ఖాయువువనున్నట్లు తెలుస్తోంది. నానాటికి తీసికట్టుగా.. గత 20 సంవత్సరాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పార్టీ వీడటంతో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత నరేందర్‌రెడ్డికి పార్టీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. దీంతో ఆయున పార్టీకి కొత్త ఊపిరి పోస్తారని కార్యకర్తలు ఆశించారు. కాని ఆయన ఆ దిశగా పార్టీని నడిపించలేక పోయారు. నియోజకవర్గంలో నానాటికి టీడీపీ పరిస్థితి ఘోరంగా తయూరవుతుండటంతో ఆయనే పార్టీని వీడారు. దీంతో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అయోమయంలో పార్టీ శ్రేణులు ఎన్నికల ముంగిట పార్టీ ఇన్చార్జి నరేందర్‌రెడ్డి టీడీపీని వీడటం.. 15 రోజులు దాటినా పార్టీకి ఇన్చార్జిని నియమించకపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. స్థానిక సమరం సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీకి ఇన్చార్జి లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు తమతోనే ఉన్నారని ఆ పార్టీ అధినాయకత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులకు కూడా ఎవరిని సంప్రదించాలో అర్థంకావడంలేదు. పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు చేపట్టేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. -
పాడిరైతులకు అండగా మదర్ డెయిరీ
పరిగి, న్యూస్‌లైన్: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ చేపట్టిన రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తూ, మంచి ధర చెల్లిస్తూ మదర్ డెయిరీ అండగా నిలుస్తోందని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (నార్మాక్స్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పాల శీతలీకరణ కేంద్రం అతిథి గృహంలో నార్మాక్స్ డెరైక్టర్ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పాడి రైతుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పాల విక్రయ మార్కెట్లో మదర్ డెయిరీ లేకుంటే ప్రైవేట్ డెయిరీల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని పేర్కొన్నారు. మూసివేయించేందుకు ప్రైవేట్ డెయిరీల కుట్ర: నార్మాక్స్ చైర్మన్ జితేందర్ రెడ్డి మదర్ డెయిరీకి నష్టాలు కల్గించి మూసివేయించాలని ప్రైవేటు డెయిరీలు కుట్రలు చేస్తున్నాయని నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఆరోపించారు. పాడి రైతులకు అధిక ధర ఆశ చూపించి తమవైపు తిప్పుకుంటున్న ప్రైవేట్ డెయిరీలు చివరకు వారిని మోసం చేస్తున్నాయన్నారు. గతంలో మదర్ డెయిరీ ద్వారా 2.25లక్షల లీటర్ల పాలు సేకరించేవారమని, ప్రైవేటు డెయిరీల కుట్రలతో ఇప్పుడు అది సగానికి పడిపోయిందన్నారు. ఏదేమైనా రైతుకు మంచి ధర, వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించే లక్ష్యంతోనే మదర్ డెయిరీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఆవు పాలపై లీటర్‌కు రూ.1.50పైసలు, గేదె పాలపై లీటర్‌కు రూ.2అదనంగా ఇన్సెంటివ్ చెల్లిస్తున్నామన్నారు. గత సీజన్లో లీటర్‌కు రూ.1 చొప్పున రైతుల నుంచి కట్ చేసిన డబ్బులు రూ.2.16 కోట్లు ఇప్పుడు తిరిగి వారికి చెల్లిస్తున్నామని తెలిపారు. అదే ప్రైవేట్ డెయిరీలు లీటర్‌కు రూ.5చొప్పున కట్ చేసి, వాటిని రైతులకు తిరిగి ఇవ్వకుండా తమవద్దే ఉంచుకున్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోందని, అలాగే మన రాష్ట్రంలోనూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆవుపాలపై ప్రచారం జరగాలి: ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఎన్నో పోషక విలువలున్న ఆవుపాలను వ్యాపార దృక్కోణంలో చిన్నచూపు చూడటం తగదని ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు. ఎంతో ఔషధగుణాలు ఆవు పాలలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే... డెయిరీలు మాత్రం ఫ్యాట్ తక్కువగా వస్తుందనే కారణంతో తక్కువ ధర చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు పాల ప్రాముఖ్యతపై ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని, మదర్ డెయిరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. సమావేశంలో భాగంగా గత పాల ఉత్పత్తి సీజన్లో రైతుల నుంచి మదర్ డెయిరీ కట్ చేసిన డబ్బులను తిరిగి రైతులకు అందజేశారు. అనంతరం సహకార సంఘంలో సభ్యులైన రైతుల పిల్లల్లో పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఒక్కొక్కరికి రూ.5వేలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయమాల, నార్మాక్స్ డెరైక్టర్లు రాంరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ డెరైక్టర్ మేడిద రాజేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.పి.బాబయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేందర్‌కుమార్, నార్మాక్స్ ఎండీ సురేష్‌బాబు, డీజీఎంలు విజేందర్‌రెడ్డి, రమేష్, పరిగి కేంద్రం మేనేజర్ రవీందర్ పాల్గొన్నారు. -
సర్దుకుపోదాం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పాత సంఘటనలు మనసులో పెట్టుకోవద్దు. కలిసికట్టుగా పార్టీని విజయతీరాలకు చేరుద్దాం. మీ నాయకత్వంలో పనిచేస్తాం’ అని టీడీపీని వీడి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు పి.మహేందర్‌రెడ్డి, కె.ఎస్.రత్నంలు హరీశ్వర్‌రెడ్డితో అన్నారు. గురువారం ఉదయం వీరువురు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో టీఆర్ఎస్లో చేరుతున్నామని, దీనికి రావాలని ఆయనను ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీని బలీయంగా మార్చేందుకు సమష్టిగా పనిచేశామని, అదే ఉత్సాహంతో టీఆర్ఎస్ను తీర్చుదిద్దుతామని అన్నారు. టీడీపీలో కొనసాగిన సమయంలో తలెత్తిన అపోహలు మనసులో పెట్టుకోవద్దని, మీ మార్గదర్శకంలో పనిచేస్తామని ఈ ఇద్దరు నేతలు హరీశ్వర్‌రెడ్డితో అన్నట్లు తెలిసింది. తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబునాయుడు చివరి వరకు ప్రయత్నించారని, సీమాంధ్ర పార్టీలో కొనసాగడం ఇష్టలేకనే టీడీపీని వీడినట్లు చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్వర్ మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సమన్వయంతో గతంలో మాదిరిగా పాటుపడదామని అన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని సైతం త్యజించి వచ్చానని, అంతిమంగా ప్రజలే న్యాయనిర్ణేతలని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణద్రోహులకు వారే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
కారుకు దారేది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో ‘కారు’ స్పీడు అందుకోలేకపోతోంది. వాయువేగంతో ‘తెలంగాణ’ వస్తుండగా... టీఆర్ఎస్ ఆ స్థాయిలో ఊపందుకోలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనని గాంభీర్యాలు పలుకుతున్న గులాబీ నాయకత్వం.. సర్కారు ఏర్పాటులో కీలకపాత్ర పోషించే జిల్లాపై పట్టు సాధించలేకపోతోంది. హైదరాబాద్ మినహా అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి నామమాత్రమే. కేవలం ఒకట్రెండు నియోజకవర్గాలు తప్ప.. ఇత ర సెగ్మెంట్లలో పెద్దగా బలం లేదనే చెప్పుకోవచ్చు. మొదట్నుంచి ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఆ పార్టీకి పస్తుతానికి పెద్దదిక్కు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాత్రమే. సెంటిమెంట్‌ను నమ్ముకున్న టీఆర్ఎస్కు జిల్లాలో బలమైన నాయకుల్లేరు. గతంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ తెలంగాణ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే పార్టీకి గుడ్‌బై చెప్పారు. వికారాబాద్‌లో కాస్తోకూస్తో ఈయనకు పట్టు ఉండేది. ఈయన కాస్తా కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇక్కడ కూడా టీఆర్ఎస్కు నాయకత్వ కొరత ఏర్పడింది. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్కు ఆదరణ లభించడంలేదు. శివారు ప్రాంతాల్లో సెటిలర్లు అధికంగా ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ వేళ్లూనుకోలేకపోతోంది. మరోవైపు గ్రామీణ నియోజకవర్గాల్లోను గులాబీ దళానికి ఆశించిన స్థాయిలో కేడర్ లేదు. హరీశ్వర్‌రెడ్డి చేరికతో పరిగిలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరించినప్పటికీ, చంద్రశేఖర్ నిష్ర్కమణతో వికారాబాద్‌లో ‘కారు’ను సమన్వయపరిచే నాయకుల్లేకుండా పోయారు. ఆకర్షణ తక్కువ! 2009 డిసెంబర్ 9 ప్రకటన టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఊపు తెచ్చింది. అప్పటివరకు పరిమిత స్థాయిలో ఉన్న పార్టీ కాస్తా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎదిగింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని అత్యధిక జిల్లాలో ‘కారు’ వేగాన్ని పెంచింది. అదే ఊపును కొనసాగిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ కాంగ్రెస్, టీడీపీలకు దీటుగా సత్తా చాటింది. ఉద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు ఉద్యమంలోకి రావడం, వాటిలో మెజార్టీ సంఘాలు తమ కనుసన్నల్లో నడుస్తుండడంతో టీఆర్ఎస్ పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర విభజన ప్రక్రియకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో గులాబీ దళానికి కలిసొచ్చింది. ఈ పరిణామం కార్యకర్తల్లో టానిక్‌లా పనిచేస్తుందని అంతా భావించినా...జోష్‌ను కొనసాగించలేకపోతోంది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో జిల్లా నాయకత్వం విఫలమవుతోంది. రాష్ర్టం ఏర్పడినా కాంగ్రెస్‌లో విలీనమయ్యే అవకాశంలేదని అధినేత కేసీఆర్ ప్రకటిస్తున్న తరుణంలో... టీఆర్ఎస్ నాయకులు ఆ దిశగా పనిచేయలేకపోతున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లోను ప్రధాన పోటీ టీడీపీ - కాంగ్రెస్‌ల మధ్యే కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని ఇరు పార్టీల్లోని అసంతుష్టులను చేరదీయాల్సిన టీఆర్ఎస్ నాయకత్వం... కేవలం సానుభూతిపైనే గంపెడాశలు పెట్టుకుంది. మరోవైపు వికారాబాద్‌లో చంద్రశేఖర్ పార్టీని వీడిన అనంతరం పలువురు సొసైటీ చైర్మన్లు, సర్పంచ్‌లు అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న నేతలకు ప్రజాబలం లేకపోవడం, ఇతర పార్టీల నేతలను ఆకర్షించే సమర్థత లేకపోవడం కూడా పార్టీ ఎదుగుదలను ప్రభావితం చేస్తోంది. టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించలేకపోతున్నారు. కేవలం పార్టీ పిలుపునకు స్పందించి కార్యక్రమాలు నిర్వహించడం మినహా.. స్వతహాగా పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. దీనికి తోడు ఆయనకు భాష సమస్య ప్రతిబంధకంగా మారింది. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడంలేదు. సర్కారు ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించే రంగారెడ్డి జిల్లాలో కారు స్పీడ్‌ను పెంచేందుకు గేర్లు వేసే నాయకులు లేకపోవడంపై కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలకు గాలం వేసినప్పటికీ, జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇది టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ఒంటరిగా బరిలో దిగితే దక్షిణ తెలంగాణలో కొద్దోగొప్పో సీట్లు గెలుచుకుంటే తప్ప.. మేజిక్ ఫిగర్‌ను చేరుకోమని భావిస్తున్న నేతలకు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి కలవరపరుస్తోంది. -
హరీశ్వర్‌రెడ్డి పై కాంగ్రెస్ గురి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక ఆపరేషన్ ఆకర్ష్ అమలును ముమ్మరం చేసింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బలీయశక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ను బలహీనపరిచే దిశగా పావులు కదుపుతోంది. జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌ను ఆకర్షించిన అధికార పార్టీ ఇప్పుడు మరో నేతపై వల విసిరింది. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డిపై తాజాగా ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా మెలుగుతున్న ఒక ఎమ్మెల్సీ ఈ వ్యవహారంలో రాయబారం నెరిపినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్సీ ఆహ్వానాన్ని హరీశ్వర్‌రెడ్డి సున్నితంగా తిరస్కరించినప్పటికీ, ఈ పరిణామం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేస్తామని ఆ పార్టీ అధినేత కే సీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలోనే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన కాంగ్రెస్.. టీఆర్ఎస్ విలీనమయ్యే అంశాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తొలి వికెట్ ఏసీఆర్..! కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేసిందే తడవుగా.. జిల్లాలో ఆ పార్టీకి మూల స్తంభంగా వ్యవహరించిన పొలిట్‌బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్ టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలసి.. కాంగ్రెస్‌లో చేరే అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం కిరణ్‌ను కలుసుకున్న అనంతరం టీఆర్ఎస్ ప్రాథమి క సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే గులా బీ దండును తమ వైపు తిప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. తద్వారా ఆ పార్టీని నిర్వీర్యం చేసి కేసీఆర్ తనంతటతానే టీఆర్ఎస్ను విలీనం చేసేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ సహా పలువురు నేతలకు తలుపులు తెరిచిన కాంగ్రెస్.. తాజాగా ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిపై గురిపెట్టినట్లు సమాచారం. గతంలో టీఆర్ఎస్లో కొనసాగి వేరుకుంపటి పెట్టుకున్న ఎమ్మెల్సీ తరఫున న్యాయవాది ఒకరు.. హరీశ్వర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై సంప్రదింపులు జరిపారు. ‘తెలంగాణ రావడంతో లక్ష్యం నెరవేరింది, ఇక టీఆర్ఎస్లో కొనసాగడంలో అర్థంలేదు.. మీరు ఓకే అంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడతా’నని అన్నట్లు సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఎమ్మెల్సీ ఆఫర్‌ను ఆయన తిర స్కరించినట్లు సమాచారం. తెలంగాణ కోసం కేసీఆర్‌తో కలిసి పోరాడామని, ఈ సమయంలో టీఆర్ఎస్ను వీడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. పార్లమెంటులో ‘టీ’ బిల్లు ఆమోదం పొందాక పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటించినందున.. తొందరెందుకని అన్నట్లు ప్రచారం జరుగుతోంది.