'ఖర్చు' పై రచ్చ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (టీఆర్‌ఆర్) ఎన్నికల ఖర్చు వ్యవహారంపై నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల సమయంలో టీఆర్‌ఆర్ చేసిన ఖర్చును తక్కువ చేసి చూపించారనే అభియోగంతో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి వాదనకు దిగారు. ఇందుకు సంబంధించి ఆయన సేకరించిన ఆధారాలతో ఏకంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివరాల ఆధారంగా పరిశీలనకు దిగిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వివరాలు సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
నివేదికపై తాత్సారం..
ఎన్నికల వేళ టీఆర్‌ఆర్ ఖర్చుపై ఇదివరకు జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో యంత్రాంగం పరిశీలన చేసి నివేదిక సమర్పించింది. అయితే ఇందులో లెక్కలు తారుమారు చేశారని హరీశ్వర్ పేర్కొంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా టీఆర్‌ఆర్ ఖర్చు వివరాలకోసం సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీఐ ద్వారా అధికారులిచ్చిన వివరాలు, ఎన్నికల సంఘం వివరాలకు పొంతన లేకపోవడాన్ని పసిగట్టిన హరీశ్వర్‌రెడ్డి.. వాదనను తీవ్రతరం చేశారు.
అధికారులను నిలదీయంతో సదరు అధికారులు డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో తాను సేకరించిన ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే నివేదిక ఇప్పటికే ఇవ్వాల్సి ఉండగా.. జిల్లా యంత్రాంగం మాత్రం నివేదిక సమర్పణపై తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.