టీఆర్‌ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డి ఖర్చు విషయంలో జిల్లా యంత్రాంగం లెక్కలు తారుమారు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, దీనిపై సీబీఐతో విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఆర్ నిబంధనలకు మించి డబ్బులు ఖర్చు చేశారని, కానీ ఖర్చును అంచనావేసే అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో వాహనాలకు సంబంధించి అద్దె వివరాలు పేర్కొన్న అధికారులు.. డ్రైవరు భత్యం, డీజిల్ ఖర్చు తదితర వివరాలు పేర్కొనలేదన్నారు. అదేవిధంగా ప్రచార క్రమంలో పెద్దఎత్తున టీషర్టులు పంచారని, నియోజకవర్గ అభివృద్ధిపై వేలసంఖ్యలో రెండు రకాల పుస్తకాలు అత్యంత ఖర్చుతో అచ్చు వేయించారని, కానీ ఈ వివరాలు అభ్యర్థి ఖర్చుల జాబితాలో చేరలేదన్నారు.
జిల్లా ఎన్నికల అధికారికి సమాచార హక్కు చట్టం ద్వారా రామ్మోహన్‌రెడ్డి ఎన్నికల ఖర్చుపై అర్జీ పెడితే.. ఇరవై రోజుల తర్వాత తనకు వివరాలిచ్చారని, అయితే ఎన్నికల ఖర్చులో పరిశీలకుడు సమర్పించిన వివరాలు.. ఆర్టీఐ ద్వారా అందిన వివరాలకు పొంతన లేకుండా ఉందన్నారు. ఈ వివరాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, నిశితంగా పరిశీలించిన వారు పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారన్నారు. అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించేందుకే కాలయాపన చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అధికారుల్లో మార్పురాకుంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదు చేస్తానని, ఇప్పటికే సీవీసీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు హరీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.
సీబీఐకి ఫిర్యాదు చేస్తా
Published Wed, Oct 29 2014 3:41 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement