పరిగి, తాండూరు, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాను వ్యవసాయకంగా అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించి జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పరిగి మినీ స్టేడియం, తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో 5లక్షల నుంచి 6లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఇందులో పరిగి నియోజకవర్గంలోనే 1.5లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. పరిగి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న హరీశ్వర్ రెడ్డి తన కుటుంబ సభ్యుల్లో ఒకరని పేర్కొంటూ.. ఆయన ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని, మంత్రివర్గంలోకి తప్పకుండా హరీశ్వర్‌రెడ్డిని తీసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు
తెలంగాణను మతప్రమేయంలేని సెక్యులర్ రాజ్యం చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు, గిరిజనులకు చేసిందేమీలేదని అన్నారు. కాంగ్రెస్‌తో సోపతిజేసి అన్నివిధాలుగా నష్టపోయామని, అధికారంలోకి వచ్చాక 14 నెలల్లో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు, ముస్లింలకు 12శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించి చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా జ్యుడీషియల్ పవర్ కల్పిస్తామన్నారు. రూ.1000 కోట్లతో ముస్లిం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, గిరిజన తండాలకు పంచాయతీలుగా మారుస్తామని అన్నారు. వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500ల చొప్పున పింఛన్లు ఇస్తామన్నారు. రూ.మూడు లక్షలతో 125 గజాల్లో 100శాతం రాయితీపై పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీలే ని రుణాలు అందిస్తామన్నారు.
తాండూరులో కంది పరిశోధన కేంద్రం
‘ఇండియాలోనే తాండూరు కందిపప్పు ఫేమస్. హైదరాబాద్‌లో తాండూరు తువ్వర్ అంటే ఎవరైనా అనుమానం లేకుండా తీసుకుంటరు. అంత క్వాలిటీ ఉంటది. అందుకే తాండూరులో కంది పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘కర్ణాటకలో షాబాద్ బండలకు రాయల్టీ తక్కువ. తాండూరులో నాపరాతి (షాబాద్)రాయల్టీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో షాబాద్ బండలపై రూపాయి రాయల్టీని తగ్గించే నిర్ణయం తీసుకుంటాం’ అని కేసీఆర్ ప్రకటించారు. తాండూరు సభలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్, తాండూరు డివిజన్ అధ్యక్షులు విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.
శ్రేణుల్లో అసంతృప్తి..
ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పరిగి బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే సభలో ఉన్న పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డిలను మాట్లాడనివ్వకుండా కేసీఆర్ ఒక్కరే.. అదీ పది నిమిషాల్లోపే ప్రసంగాన్ని ముగించి వెళ్లపోవడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి.
పరిగి సభలో ముస్లిం రిజర్వేషన్ సాధన ఫ్రంట్ అధ్యక్షుడు ఇఫ్తేకార్ అహ్మద్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అనీల్‌రెడ్డి, మీర్‌మహమూద్, సురేందర్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, అశోక్‌వర్ధన్ రెడ్డి, రవికుమార్, మునీర్, కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కమతం రాజేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
Published Sun, Apr 27 2014 11:42 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement