సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక ఆపరేషన్ ఆకర్ష్ అమలును ముమ్మరం చేసింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బలీయశక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్‌ను బలహీనపరిచే దిశగా పావులు కదుపుతోంది. జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌ను ఆకర్షించిన అధికార పార్టీ ఇప్పుడు మరో నేతపై వల విసిరింది. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డిపై తాజాగా ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా మెలుగుతున్న ఒక ఎమ్మెల్సీ ఈ వ్యవహారంలో రాయబారం నెరిపినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్సీ ఆహ్వానాన్ని హరీశ్వర్‌రెడ్డి సున్నితంగా తిరస్కరించినప్పటికీ, ఈ పరిణామం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని ఆ పార్టీ అధినేత కే సీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలోనే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన కాంగ్రెస్.. టీఆర్‌ఎస్ విలీనమయ్యే అంశాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తొలి వికెట్ ఏసీఆర్..!
కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేసిందే తడవుగా.. జిల్లాలో ఆ పార్టీకి మూల స్తంభంగా వ్యవహరించిన పొలిట్‌బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలసి.. కాంగ్రెస్‌లో చేరే అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం కిరణ్‌ను కలుసుకున్న అనంతరం టీఆర్‌ఎస్ ప్రాథమి క సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే గులా బీ దండును తమ వైపు తిప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. తద్వారా ఆ పార్టీని నిర్వీర్యం చేసి కేసీఆర్ తనంతటతానే టీఆర్‌ఎస్‌ను విలీనం చేసేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ సహా పలువురు నేతలకు తలుపులు తెరిచిన కాంగ్రెస్.. తాజాగా ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిపై గురిపెట్టినట్లు సమాచారం. గతంలో టీఆర్‌ఎస్‌లో కొనసాగి వేరుకుంపటి పెట్టుకున్న ఎమ్మెల్సీ తరఫున న్యాయవాది ఒకరు.. హరీశ్వర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై సంప్రదింపులు జరిపారు. ‘తెలంగాణ రావడంతో లక్ష్యం నెరవేరింది,
ఇక టీఆర్‌ఎస్‌లో కొనసాగడంలో అర్థంలేదు.. మీరు ఓకే అంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడతా’నని అన్నట్లు సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఎమ్మెల్సీ ఆఫర్‌ను ఆయన తిర స్కరించినట్లు సమాచారం. తెలంగాణ కోసం కేసీఆర్‌తో కలిసి పోరాడామని, ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. పార్లమెంటులో ‘టీ’ బిల్లు ఆమోదం పొందాక పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటించినందున.. తొందరెందుకని అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
హరీశ్వర్‌రెడ్డి పై కాంగ్రెస్ గురి!
Published Wed, Aug 14 2013 3:42 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement