కారుకు దారేది! | No the strong leaders in TRS | Sakshi
Sakshi News home page

కారుకు దారేది!

Published Sun, Dec 15 2013 12:08 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

కారుకు దారేది! - Sakshi

కారుకు దారేది!

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  జిల్లాలో ‘కారు’ స్పీడు అందుకోలేకపోతోంది. వాయువేగంతో ‘తెలంగాణ’ వస్తుండగా... టీఆర్‌ఎస్ ఆ స్థాయిలో ఊపందుకోలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనని గాంభీర్యాలు పలుకుతున్న గులాబీ నాయకత్వం.. సర్కారు ఏర్పాటులో కీలకపాత్ర పోషించే జిల్లాపై పట్టు సాధించలేకపోతోంది. హైదరాబాద్ మినహా అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి నామమాత్రమే. కేవలం ఒకట్రెండు నియోజకవర్గాలు తప్ప.. ఇత ర సెగ్మెంట్లలో పెద్దగా బలం లేదనే చెప్పుకోవచ్చు. మొదట్నుంచి ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఆ పార్టీకి పస్తుతానికి పెద్దదిక్కు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాత్రమే. సెంటిమెంట్‌ను నమ్ముకున్న టీఆర్‌ఎస్‌కు జిల్లాలో బలమైన నాయకుల్లేరు.

గతంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ తెలంగాణ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే పార్టీకి గుడ్‌బై చెప్పారు. వికారాబాద్‌లో కాస్తోకూస్తో ఈయనకు పట్టు ఉండేది. ఈయన కాస్తా కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌కు నాయకత్వ కొరత ఏర్పడింది. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు ఆదరణ లభించడంలేదు. శివారు ప్రాంతాల్లో సెటిలర్లు అధికంగా ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ వేళ్లూనుకోలేకపోతోంది. మరోవైపు గ్రామీణ నియోజకవర్గాల్లోను గులాబీ దళానికి ఆశించిన స్థాయిలో కేడర్ లేదు. హరీశ్వర్‌రెడ్డి చేరికతో పరిగిలో టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా అవతరించినప్పటికీ, చంద్రశేఖర్ నిష్ర్కమణతో వికారాబాద్‌లో ‘కారు’ను సమన్వయపరిచే నాయకుల్లేకుండా పోయారు.
 ఆకర్షణ తక్కువ!
 2009 డిసెంబర్ 9 ప్రకటన  టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఊపు తెచ్చింది. అప్పటివరకు పరిమిత స్థాయిలో ఉన్న పార్టీ కాస్తా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎదిగింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని అత్యధిక జిల్లాలో ‘కారు’ వేగాన్ని పెంచింది. అదే ఊపును కొనసాగిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ కాంగ్రెస్, టీడీపీలకు దీటుగా సత్తా చాటింది. ఉద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు ఉద్యమంలోకి రావడం, వాటిలో మెజార్టీ సంఘాలు తమ కనుసన్నల్లో నడుస్తుండడంతో టీఆర్‌ఎస్ పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర విభజన ప్రక్రియకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో గులాబీ దళానికి కలిసొచ్చింది. ఈ పరిణామం కార్యకర్తల్లో టానిక్‌లా పనిచేస్తుందని అంతా భావించినా...జోష్‌ను కొనసాగించలేకపోతోంది.

అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో జిల్లా నాయకత్వం విఫలమవుతోంది.  రాష్ర్టం ఏర్పడినా కాంగ్రెస్‌లో విలీనమయ్యే అవకాశంలేదని అధినేత కేసీఆర్ ప్రకటిస్తున్న తరుణంలో... టీఆర్‌ఎస్ నాయకులు ఆ దిశగా పనిచేయలేకపోతున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లోను ప్రధాన పోటీ టీడీపీ - కాంగ్రెస్‌ల మధ్యే కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని ఇరు పార్టీల్లోని అసంతుష్టులను చేరదీయాల్సిన టీఆర్‌ఎస్ నాయకత్వం... కేవలం సానుభూతిపైనే గంపెడాశలు పెట్టుకుంది. మరోవైపు వికారాబాద్‌లో చంద్రశేఖర్ పార్టీని వీడిన అనంతరం పలువురు సొసైటీ చైర్మన్లు, సర్పంచ్‌లు అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న నేతలకు ప్రజాబలం లేకపోవడం, ఇతర పార్టీల నేతలను ఆకర్షించే సమర్థత లేకపోవడం కూడా పార్టీ ఎదుగుదలను ప్రభావితం చేస్తోంది.

 టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ  క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించలేకపోతున్నారు. కేవలం పార్టీ పిలుపునకు స్పందించి కార్యక్రమాలు నిర్వహించడం మినహా.. స్వతహాగా పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. దీనికి తోడు ఆయనకు భాష సమస్య ప్రతిబంధకంగా మారింది. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడంలేదు. సర్కారు ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించే రంగారెడ్డి జిల్లాలో కారు స్పీడ్‌ను పెంచేందుకు గేర్‌లు వేసే నాయకులు లేకపోవడంపై కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలకు గాలం వేసినప్పటికీ, జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇది టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ఒంటరిగా బరిలో దిగితే దక్షిణ తెలంగాణలో కొద్దోగొప్పో సీట్లు గెలుచుకుంటే తప్ప.. మేజిక్ ఫిగర్‌ను చేరుకోమని భావిస్తున్న నేతలకు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి కలవరపరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement