Dr a.chandrasekhar
-
‘దేశం’ డీలా!
చుక్కానిలేని నావలా.. వికారాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2004లో ఆయన టీడీపీకి రాజీనామా చేసి అనంతరం టీఆర్ఎస్లో చేరారు. చంద్రశేఖర్ రాజీనామా టీడీపీపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పార్టీని సంజీవరావు (నియోజకవర్గ ఇన్చార్జి) సమర్థంగా నడిపించలేకపోయారు. ఆయన కూడా 2012లో వైఎస్సార్ సీపీలో చేరడంతో ‘దేశం’ పరిస్థితి చుక్కానిలేని నావలా తయారైంది. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్‌ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినా పార్టీకి పూర్వవైభవం దక్కలేదు. ఈ తరుణంలో కొత్త నేతను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఢీకొనేందుకు సమర్థ అభ్యర్థి వెతుకులాటలో తలమునకలవుతోంది. అందులో భాగంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ పేరును తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆర్థికంగా స్థితిమంతుడు కూడా కావడంతో ప్రసాద్‌కు చెక్‌పెట్టవచ్చని అంచనా వేస్తోంది. చంద్రశేఖర్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో టీ ఆర్ఎస్ బలహీనంగా తయారుకావడం తమకు కలిసివస్తుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. వలస నేతలపైనే ఆశలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి రాజీనామాతో తాండూరులో ఆ పార్టీ పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది. నియోజకవర్గంలో గతంలో ఒక వెలుగువెలిగిన పార్టీ ప్రస్తుతం కొత్త నాయకుల కోసం ఎదురుచూస్తోంది. మహేందర్‌రెడ్డి బలమైన నాయకుడు కావడం, దిగువ శ్రేణి నాయకులు కూడా ఆయన బాటలోనే గులాబీ గూటికి చేరిన నేపథ్యంలో టీడీపీ ఇక వలస నేతలపైనే గంపెడాశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి స్వర్గీయ ఎం. చంద్రశేఖర్ కుమారుల్లో ఒకరికి టికెట్ ఖరారు చేయాలని ‘దేశం’ భావిస్తోంది. ఇక్క డ బలంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి వీరి చేరిక లాభిస్తుందని అంచనా వేస్తోంది. బలమైన నేతలు దొరక్కపోతే ఈ సీటును సర్దుబాటులో భాగంగా బీజేపీ కేటాయించి చేతులు దులుపుకోవాలని అనుకుం టోంది. మాజీ మంత్రి సబిత సోదరుడు నరసింహారెడ్డి బీజేపీ పంచన చేరనున్న నేపథ్యం లో కాంగ్రెస్‌ను దెబ్బతీయవచ్చని, అదేసమయంలో సమీప బంధువైన మహేందర్‌రెడ్డి వర్గంలోనూ చీలిక ఏర్పడుతుందని టీడీపీ ఆశి స్తోంది. బీజేపీతో పొత్తు కుదిరితే తాండూరు లో విజయావకాశాలు మెరుగవుతాయని అం చనా వేస్తోంది. ఈ క్రమంలో కమలానికి ఈ సీటును వదిలేందుకు సైతం ‘సై’ అంటోంది. ఆకర్ష్ ఫలిస్తే.. చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం గుడ్‌బై చెప్పడం తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఎన్నికల వేళ ఆయన అనూహ్యంగా టీఆర్ఎస్లోకి జంప్ చేయడంతో కంగుతున్న తమ్ముళ్లు.. అభ్యర్థి అన్వేషణలో తలమున కలయ్యారు. రిజర్వ్డ్ సీటు కావడం, నిర్దేశిత సామాజికవర్గం నాయకులు ఆర్థికంగా స్థితిమంతులు కాకపోవడంతో కొత్త వారిపైనే పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి స్థానిక నేతలకు ఛాన్స్ ఇచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. సొంత పార్టీలో సమర్థ అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామిపై కన్నేసింది. కాంగ్రెస్ టికెట్ లభించకపోతే తమ గూటికి చేరేలా వారితో సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ టికెట్లు ఖరారయితే తప్ప.. ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున ఎవరు బరిలో ఉంటారనేది స్పష్టం కాని పరిస్థితి. బీసీ నేతలపై గురి! 2009లో పార్టీ తరఫున ఇక్కడి నుంచి గెలుపొందిన హరీశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, ఎన్నికల వేళ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి అన్నబాటనే అనుసరించడంతో పరిగిలో ‘దేశం’ పరిస్థితి దిగజారింది. ఇద్దరు ముఖ్యనేతలు కారెక్కడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులు కూడా పక్కచూపులు చూస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీకి నాయకుల కొరత ఏర్పడింది. దీంతో వలస నేతలపైనే ఆశలు పెట్టుకుంది. బలమైన సామాజికవర్గానికి చెందిన ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు.. బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతోపాటు, జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్లకు వల విసురుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న జ్ఞానేశ్వర్ సైకిలెక్కెందుకు అంగీకరిస్తే పరిగి పగ్గాలను అప్పగిస్తామని హామీ ఇస్తోంది. నియోజకవర్గ అభ్యర్థుల గెలుపోటములను నిర్ధేశించేస్థాయిలో కాసాని ఉండడంతో ఎలాగైనా ఆయన్ని పార్టీలోకి తేవాలని అధినాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. -
కారుకు దారేది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో ‘కారు’ స్పీడు అందుకోలేకపోతోంది. వాయువేగంతో ‘తెలంగాణ’ వస్తుండగా... టీఆర్ఎస్ ఆ స్థాయిలో ఊపందుకోలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనని గాంభీర్యాలు పలుకుతున్న గులాబీ నాయకత్వం.. సర్కారు ఏర్పాటులో కీలకపాత్ర పోషించే జిల్లాపై పట్టు సాధించలేకపోతోంది. హైదరాబాద్ మినహా అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి నామమాత్రమే. కేవలం ఒకట్రెండు నియోజకవర్గాలు తప్ప.. ఇత ర సెగ్మెంట్లలో పెద్దగా బలం లేదనే చెప్పుకోవచ్చు. మొదట్నుంచి ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఆ పార్టీకి పస్తుతానికి పెద్దదిక్కు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాత్రమే. సెంటిమెంట్‌ను నమ్ముకున్న టీఆర్ఎస్కు జిల్లాలో బలమైన నాయకుల్లేరు. గతంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ తెలంగాణ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే పార్టీకి గుడ్‌బై చెప్పారు. వికారాబాద్‌లో కాస్తోకూస్తో ఈయనకు పట్టు ఉండేది. ఈయన కాస్తా కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇక్కడ కూడా టీఆర్ఎస్కు నాయకత్వ కొరత ఏర్పడింది. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్కు ఆదరణ లభించడంలేదు. శివారు ప్రాంతాల్లో సెటిలర్లు అధికంగా ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ వేళ్లూనుకోలేకపోతోంది. మరోవైపు గ్రామీణ నియోజకవర్గాల్లోను గులాబీ దళానికి ఆశించిన స్థాయిలో కేడర్ లేదు. హరీశ్వర్‌రెడ్డి చేరికతో పరిగిలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరించినప్పటికీ, చంద్రశేఖర్ నిష్ర్కమణతో వికారాబాద్‌లో ‘కారు’ను సమన్వయపరిచే నాయకుల్లేకుండా పోయారు. ఆకర్షణ తక్కువ! 2009 డిసెంబర్ 9 ప్రకటన టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఊపు తెచ్చింది. అప్పటివరకు పరిమిత స్థాయిలో ఉన్న పార్టీ కాస్తా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎదిగింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని అత్యధిక జిల్లాలో ‘కారు’ వేగాన్ని పెంచింది. అదే ఊపును కొనసాగిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ కాంగ్రెస్, టీడీపీలకు దీటుగా సత్తా చాటింది. ఉద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు ఉద్యమంలోకి రావడం, వాటిలో మెజార్టీ సంఘాలు తమ కనుసన్నల్లో నడుస్తుండడంతో టీఆర్ఎస్ పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర విభజన ప్రక్రియకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో గులాబీ దళానికి కలిసొచ్చింది. ఈ పరిణామం కార్యకర్తల్లో టానిక్‌లా పనిచేస్తుందని అంతా భావించినా...జోష్‌ను కొనసాగించలేకపోతోంది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో జిల్లా నాయకత్వం విఫలమవుతోంది. రాష్ర్టం ఏర్పడినా కాంగ్రెస్‌లో విలీనమయ్యే అవకాశంలేదని అధినేత కేసీఆర్ ప్రకటిస్తున్న తరుణంలో... టీఆర్ఎస్ నాయకులు ఆ దిశగా పనిచేయలేకపోతున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లోను ప్రధాన పోటీ టీడీపీ - కాంగ్రెస్‌ల మధ్యే కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని ఇరు పార్టీల్లోని అసంతుష్టులను చేరదీయాల్సిన టీఆర్ఎస్ నాయకత్వం... కేవలం సానుభూతిపైనే గంపెడాశలు పెట్టుకుంది. మరోవైపు వికారాబాద్‌లో చంద్రశేఖర్ పార్టీని వీడిన అనంతరం పలువురు సొసైటీ చైర్మన్లు, సర్పంచ్‌లు అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న నేతలకు ప్రజాబలం లేకపోవడం, ఇతర పార్టీల నేతలను ఆకర్షించే సమర్థత లేకపోవడం కూడా పార్టీ ఎదుగుదలను ప్రభావితం చేస్తోంది. టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించలేకపోతున్నారు. కేవలం పార్టీ పిలుపునకు స్పందించి కార్యక్రమాలు నిర్వహించడం మినహా.. స్వతహాగా పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. దీనికి తోడు ఆయనకు భాష సమస్య ప్రతిబంధకంగా మారింది. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడంలేదు. సర్కారు ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించే రంగారెడ్డి జిల్లాలో కారు స్పీడ్‌ను పెంచేందుకు గేర్లు వేసే నాయకులు లేకపోవడంపై కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలకు గాలం వేసినప్పటికీ, జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇది టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ఒంటరిగా బరిలో దిగితే దక్షిణ తెలంగాణలో కొద్దోగొప్పో సీట్లు గెలుచుకుంటే తప్ప.. మేజిక్ ఫిగర్‌ను చేరుకోమని భావిస్తున్న నేతలకు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి కలవరపరుస్తోంది.