సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపు గుర్రాల జాబితాకు టీడీపీ తుది మెరుగులు దిద్దుతోంది. మారిన సమీకరణల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా మారిన సార్వత్రిక ఎన్నికల్లో సమర్థులను బరిలోకి దించేందుకు ఆశావహుల జాబితా వడపోతలో తలమునకలైంది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన తమ్ముళ్లలో ఉత్సాహం నింపేందుకు బలమైన అభ్యర్థుల రంగంలోకి దించాలని నిర్ణయించింది. భారతీయ జనతాపార్టీ పొత్తుతో సంబంధంలేకుండా అభ్యర్థులను ఖరారు చేస్తోంది. పొత్తుపై స్పష్టత వచ్చిన అనంతరమే సీట్ల సర్దుబాటు ఉంటుంది కనుక.. అప్పటివరకు ఎదురుచూడకుండా రేసు గుర్రాలను ఎంపికచేసే పనిలో నిమగ్నమైంది.
జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ చోట్ల అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతోంది. పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, కేఎస్ రత్నం పార్టీని వీడడం టీడీపీని దెబ్బతీసింది. తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి కూడా కారెక్కినప్పటికీ, అనూహ్యంగా దివంగత మంత్రి, కాంగ్రెస్ నేత ఎం.చంద్రశేఖర్ కుమారులు పార్టీలో చేరడం టీడీపీకి కలిసివచ్చింది. ఇక్కడ ఈ కుటుంబానికే టికెట్ దాదాపుగా ఖరారైంది. పరిగి నుంచి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను బరిలో దించాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. మరోవైపు మాజీ జెడ్పీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్‌తో ‘దేశం’ నేతలు మంతనాలు జరుపుతున్నారు.
ఆయన అభ్యర్థిత్వాన్ని ఇక్కడి నుంచి పరిశీలించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2009లో వికారాబాద్ నుంచి పోటీచేసిన సంజీవరావు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నందున.. ఈ స్థానానికి బలమైన అభ్యర్థిని ఖరారుచేసే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ లేదా ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి విజయ్‌కుమార్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. చేవెళ్ల నుంచి ఆర్థికంగా స్థితిమంతుడైన మేకల వెంకటేశం అభ్యర్థిత్వం దాదాపుగా ఖాయమైంది. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈయన రంగంలోకి దించడం ద్వారా రత్నంను నిలువరించవచ్చని అంచనా వేస్తోంది.
కమలం కలిసివస్తే..
బీజేపీతో దోస్తీ కుదిరితే జిల్లాలో ఐదు సీట్లు వదులుకోవాల్సి రావచ్చనే సంకేతాలు ఆశావహులను ఆందోళ నకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, పరిగి, తాండూరు, ఉప్పల్ నియోజకవర్గాలను బీజేపీ ఆశిస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా వీటిని ఆ పార్టీకి కేటాయించాల్సివస్తే తమ పరిస్థితేంటనే ఆవేదన వ్యక్తమవుతోంది.
మరోవైపు గతంలో పార్టీలో పనిచేసిన నేతలను మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా వికారాబాద్‌కు చెందిన సీనియర్ నేత ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌తో ఆ పార్టీ నాయకత్వం టచ్‌లో ఉంది.
కాంగ్రెస్ నేతలపై ఆశలు
కాంగ్రెస్ జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందా అని టీడీపీ ఎదురుచూస్తోంది. ఆ పార్టీ టికెట్ దక్కని నేతలు సైకిలెక్కెందుకు సిద్ధమని సంకేతాలిచ్చిన నేపథ్యంలో జాబితా కోసం వే చిచూస్తోంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటరీ స్థానం సహా వికారాబాద్, చేవెళ్ల, పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ల టికెట్లను కాంగ్రెస్ జాబితాను పరిశీలించిన తర్వాతే తమ అభ్యర్థులను ఖరారు చేయాలని యోచిస్తోంది. టీ కాంగ్రెస్ జాబితా వెల్లడి అనంతరం సమీకరణలు మారిపోతాయని, అప్పుడు చాలా మంది నేతలు తమ గూటికి చేరుకుంటారని టీడీపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగిస్తున్న ఆ పార్టీ వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులపై కూడా వల విసురుతోంది. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నవారికి పోటీ తీవ్రంగాలేని నియోజకవర్గాలను ఆఫర్ చేయాలని నిర్ణయించింది.
వలస నేతలపై గురి!
Published Fri, Mar 28 2014 12:08 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement