r.krisnaiah
-
టీచర్లు ఉద్యమానికి నాయకత్వం వహించాలి
హైదరాబాద్: చైతన్యవంతమైన బీసీ టీచర్లు బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.కృççష్ణుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులపై ఉన్న క్రీమీలేయర్ వి«ధానాన్ని ఎత్తివేయాలన్నారు. అనంతరం రాష్ట్ర బీసీ టీచర్స్ అసోసియేషన్ 2019 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎ.లక్ష్మణ్‌గౌడ్, కోశాధికారి వి.రమేశ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదగిరి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్ గౌడ్, కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అసంతృప్తులకు బుజ్జగింపులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు అధిష్టానాలు రంగంలోకి దిగాయి. తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన నేతలను సముదాయించే పనిలో పడ్డాయి. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం ఆఖరు రోజు కావడంతో బుజ్జగింపులను ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొందరు అభ్యర్థులు అధిష్టానం మంతనాలతో మెత్తబడ్డా, మరికొందరు మాత్రం పట్టుదలగా ఉన్నారు. పోటీలో కొనసాగుతామని తెగేసి చెబుతుండడం పార్టీ నేతలను కలవరపరుస్తోంది. అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేందుకు వీలైనన్ని తాయిలాలు ప్రకటిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీలకు తిరుగుబాటు సెగ ఎక్కువగా ఉంది. ఎల్బీనగర్ స్థానాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఇవ్వడంతో అలకబూనిన టీడీపీ సీనియర్లు కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కృష్ణప్రసాద్ నామినేషన్ తిరస్కరణకు గురికాగా, రంగారెడ్డి మాత్రం ఇంకా బరిలోనే ఉన్నారు. నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని అధిష్టానం పెద్దలు సూచించినా ఆయన లెక్కచేయడం లేదు. ‘వస్తున్నా.. మీకోసం’ యాత్రతోపాటు ఇతర పార్టీ కార్యక్రమాలకు విశేష సేవలందించిన తనను పార్టీ నట్టేట ముంచిందని ఆగ్రహంతో ఉన్న రంగారెడ్డి.. పోటీలో ఉంటానని కరాఖండిగా చెబుతున్నారు. మరోవైపు శేరిలింగంపల్లిలోనూ ఆ పార్టీ ఇన్చార్జి మొవ్వా సత్యనారాయణ సైతం అధిష్టానం బుజ్జగింపులకు లొంగడంలేదు. తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని తేల్చిచెప్పారు. అలాగే ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ పోటీ నుంచి తప్పుకునేది లేదని అధిష్టానానికి స్పష్టం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కార్తీక్‌రెడ్డి వారించినా కూడా జగదీశ్వ ర్ చల్లబడనట్లు తెలిసింది. ఇదిలావుండగా, మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్యయాదవ్‌కు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేతలు నందారెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్, హరివర్దన్‌రెడ్డి నామినేషన్లు వేశారు. వీరిలో హరి వర్దన్, నందారెడ్డితో ఆ పార్టీ అభ్యర్థి జంగయ్యయాదవ్ జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. వీరువురు రాజీకొచ్చినా.. నక్కా మాత్రం పంతం వీడడంలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి తన సత్తా చూపుతానని సవాల్ విసురుతున్నారు. మరోవైపు మేహ శ్వరంలో మజ్లిస్ అభ్యర్థి అహ్మద్ నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదే నియోజకవర్గంలో బలమైన ఓ అభ్యర్థిని కూడా పోటీ నుంచి తప్పుకోవాలని వివిధ రకాలుగా ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇబ్రహీంపట్నం టికెట్ దక్కకపోవడంతో బరిలో నిలిచిన మల్రెడ్డి సోదరులు కూడా నామినేషన్ ఉపసంహరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించినప్పటికీ కాంగ్రెస్ మల్రెడ్డి రంగారెడ్డి చేత నామినేషన్ వేయించింది. ఈయన ఉపసంహరణ విషయం కూడా నేడు తేలనుంది. టీడీపీ పోటీ చేస్తున్న మహేశ్వరం, మేడ్చల్, చేవెళ్ల పార్లమెంటులకు బీజేపీ కూడా అభ్యర్థులను నిలిపింది. వీరిపై కూడా శనివారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కమలం చేతిలోకి ‘దేశం’ కోట పరిగి
పరిగి, న్యూస్‌లైన్ : పరిగి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ సీటు బీజేపీకి పోవడంతో వీరిలో నైరాశ్యం అలుముకుంది. ఈ సారి ఎన్నికల్లో బ్యాలెట్లో ‘సైకిల్’ గుర్తే ఉండకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నా రు. ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసి, అనేక సమస్యలపై పోరాడి ఓటు బ్యాంకును కూడగట్టుకున్నామని, ఇప్పుడదంతా నిష్ర్పయోజనమైందని వారంతా మధన పడుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం క్యాడర్ చెల్లాచెదురవుతోంది. తమ్ముళ్లంతా తలోదారి చూసుకుంటున్నారు. గతంలోనూ అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నా పరిగి స్థానాన్ని మాత్రం వేరే పార్టీలకు ఇవ్వలేదు. దశాబ్దాలుగా టీడీపీకి ఇక్కడ స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ మధ్య ముఖ్యమైన నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో పార్టీకి పెద్దదిక్కు కరువైంది. నాయకులు పార్టీ వీడినా కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు చతకిల పడ్డారు. బీజేపీ అభ్యర్థులకు సహకరించాలంటూ అధిష్టానం చేస్తున్న విన్నపాలను స్థానిక నాయకులు ఎంతవరకు పాటిస్తారో చూడాల్సి ఉంది. కాసాని, ఆర్.కృష్ణయ్య వంటి పెద్దనాయకుల్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారని, వాళ్లొస్తే పార్టీ పరిస్థితి మెరుగవుతుందని కార్యకర్తలు భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోగా అధిస్టానం మరో పార్టీకి ఈ స్థానాన్ని అప్పగించేసింది. అయితే బీజేపీ అభ్యర్థిగా స్థానిక, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న కమతం రాంరెడ్డిని ఎంపిక చేయడం కాస్త ఊరటనిచ్చే అంశమే. టీడీపీ ట్రాక్ రికార్డుకు బ్రేక్ 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి 2009 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ రికార్డు స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంది. 2010లో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయం నుంచి పార్టీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఆ పార్టీని వీడటం పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఆ వెంటనే పార్టీ పగ్గాలు అందుకున్న ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్థం తీసుకోవడం పార్టీ మరో దెబ్బ. తెలుగుదేశం పార్టీ 1985 ఎన్నికల్లో 53,920 ఓట్లు, 1989లో 48,179 ఓట్లు, 1994లో 67,433ఓట్లు, 1999లో 60,360 ఓట్లు, 2004లో 59,809 ఓట్లు, 2009లో 53,099ఓట్లు సాధించింది. 1985 మొదలుకుని 2009 వరకు 1989లో 4,189 ఓట్లతో ఓటమి మినహా అన్ని సార్లు ఆ పార్టీయే విజయఢంకా మోగించింది. ‘కమలం’ వికసిస్తుందా? పొత్తుల్లో భాగంగా పరిగి స్థానాన్ని దక్కించుకున్న కమలనాథులు ఎంతవరకు నెట్టుకొస్తారన్న విషయంపై అనుమానాలున్నాయి. టీడీపీ ఓట్లను ఎంతవరకు తమకు వేయించుకుంటార్నదే ఇప్పుడు చర్చనీయాంశం. గతంలో పరిగిలో పోటీచేసిన కమలనాథులకు పలుసార్లు 10వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. బీజేపీ ఓ మోస్తరు నాయకుడిని నిలబెడితే టీడీపీ ఓటు బ్యాంకును హరీశ్వర్‌రెడ్డి ఎక్కువ మొత్తం లాగేసుకుంటారని అందరూ భావించారు. కానీ కమతం రంగంలోకి దిగడంతో సీను కాస్త మారినట్టు కన్పిస్తోంది. కమతం రాంరెడ్డి టీడీపీ శ్రేణులతోపాటు కాంగ్రెస్‌లో తన వర్గం నాయకులను వెంట తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. మొత్తం గా పరిగి ఎన్నికల బరిలో టీడీపీ లేకున్నా పోటీ మాత్రం రసవత్తరం కానుంది. -
తిరుగుబాటు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థి కారుపై రాళ్లతో దాడి చేశారు. టికెట్లు దక్కకపోవడంతో నిరాశకు గురైన మరికొందరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసి అధిష్టానానికి సవాల్ విసిరారు. తమ స్థానాలను బీజేపీ ఎగురేసుకుపోవడం.. సీనియర్లను కాదని ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కట్టబెట్టడంతో ఆశావహుల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. ఎల్బీనగర్ శాసనసభా స్థానానికి బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ను ఖరారు చేయడాన్ని జీర్ణించుకోలేని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు ఆయన కారుపై దాడి చేశారు. అంతేకాకుండా స్థానికేతరుడైన ఆర్.కృష్ణయ్యకు పోటీగా సీనియర్ నేతలు కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అధినాయకత్వం తీరును నిరసిస్తూ ఐదుగురు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇది టీడీపీలో కలకలం సృష్టిం చింది. పొత్తులో భాగంగా మల్కాజిగిరి సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు తెలియగానే ఎమ్మెల్యే మైనంపల్లి సహా పలువురు ముఖ్యనేతలు రాజీనా మా చేశారు. మరో ముగ్గురు బీజేపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ నామినేషన్లు వేశారు. ఈ పరిణామం మరి చిపోకముందే బుధవారం ఎల్బీనగర్లో ముఖ్యనేతల తిరుగుబాటు, శేరిలింగంపల్లి ఇన్చార్జి మొవ్వ సత్యనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ‘దేశం’ నాయకత్వం నివ్వెరపోయింది. శేరిలింగంపల్లి టికెట్‌ను గాంధీకి కేటాయించడంతో బండి రమేశ్, సత్యనారాయణ, శంకర్‌గౌడ్ అసంతృప్తికి గురయ్యారు. శంకర్‌గౌడ్ ఏకంగా పార్టీకి రాాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. రమేశ్ కూడా పార్టీ మారే అంశంపై సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్యయాదవ్‌కు ఇవ్వడంతో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఈ క్రమంలో ముగ్గురు కీలక నేతలు ధిక్కారస్వరం వినిపించారు. నియోజకవర్గ ఇన్చార్జి నక్కా ప్రభాకర్‌గౌడ్, నందారెడ్డి, సింగిరెడ్డి హరివర్దన్రెడ్డిలు పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతూ రెబల్స్‌గా బరిలో దిగారు. మరోవైపు పరిగి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రయ్య కూడా తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలిచారు. కాంగ్రెస్‌కు తిరుగుబాటు బెడద! అధికారపార్టీకీ తిరుగుబాట్ల బెడద తప్పలేదు. పలు నియోజకవర్గాల్లో ఆపార్టీ నేతలు రెబల్స్‌గా బరిలో దిగారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన సోదరుడు రాంరెడ్డి, సీనియర్ నేత లక్ష్మిపతిగౌడ్, శశిధర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. మరోవైపు పొత్తులో భాగంగా మహేశ్వరం స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న చల్ల నర్సింహారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలావుండగా, తెలుగుదేశంతో పొత్తును తప్పుబడుతున్న కమలనాథులు అనేక నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు. చేవెళ్ల పార్లమెంటరీ స్థానానికి ఏకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ నామినేషన్ వేయగా, రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సీనియర్ నేత డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఇబ్రహీంపట్నంలో పోరెడ్డి నర్సింహారెడ్డి, మహేశ్వరంలో శంకర్‌రెడ్డి, మేడ్చల్‌లో కొంపల్లి మోహన్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌లో ఎస్.మల్లారెడ్డి నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా టీడీపీని ఇరకాటంలోకి పెట్టారు. ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో జరిగిన రచ్చ మిత్రభేదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్కు తిరుగుబాట్లు బాగానే ఉన్నాయి. రాత్రికి రాత్రే కారెక్కిన ఇతర పార్టీల నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ నాలుగు చోట్ల గులాబీ ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా అసమ్మతి స్వరం వినిపించారు. టీడీపీ : 11 కాంగ్రెస్ : 12 టీఆర్ఎస్: 7 బీజేపీ: 4 -
వలస నేతలపై గురి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గెలుపు గుర్రాల జాబితాకు టీడీపీ తుది మెరుగులు దిద్దుతోంది. మారిన సమీకరణల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా మారిన సార్వత్రిక ఎన్నికల్లో సమర్థులను బరిలోకి దించేందుకు ఆశావహుల జాబితా వడపోతలో తలమునకలైంది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన తమ్ముళ్లలో ఉత్సాహం నింపేందుకు బలమైన అభ్యర్థుల రంగంలోకి దించాలని నిర్ణయించింది. భారతీయ జనతాపార్టీ పొత్తుతో సంబంధంలేకుండా అభ్యర్థులను ఖరారు చేస్తోంది. పొత్తుపై స్పష్టత వచ్చిన అనంతరమే సీట్ల సర్దుబాటు ఉంటుంది కనుక.. అప్పటివరకు ఎదురుచూడకుండా రేసు గుర్రాలను ఎంపికచేసే పనిలో నిమగ్నమైంది. జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ చోట్ల అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతోంది. పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, కేఎస్ రత్నం పార్టీని వీడడం టీడీపీని దెబ్బతీసింది. తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి కూడా కారెక్కినప్పటికీ, అనూహ్యంగా దివంగత మంత్రి, కాంగ్రెస్ నేత ఎం.చంద్రశేఖర్ కుమారులు పార్టీలో చేరడం టీడీపీకి కలిసివచ్చింది. ఇక్కడ ఈ కుటుంబానికే టికెట్ దాదాపుగా ఖరారైంది. పరిగి నుంచి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను బరిలో దించాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. మరోవైపు మాజీ జెడ్పీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్‌తో ‘దేశం’ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇక్కడి నుంచి పరిశీలించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2009లో వికారాబాద్ నుంచి పోటీచేసిన సంజీవరావు ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నందున.. ఈ స్థానానికి బలమైన అభ్యర్థిని ఖరారుచేసే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ లేదా ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి విజయ్‌కుమార్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. చేవెళ్ల నుంచి ఆర్థికంగా స్థితిమంతుడైన మేకల వెంకటేశం అభ్యర్థిత్వం దాదాపుగా ఖాయమైంది. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈయన రంగంలోకి దించడం ద్వారా రత్నంను నిలువరించవచ్చని అంచనా వేస్తోంది. కమలం కలిసివస్తే.. బీజేపీతో దోస్తీ కుదిరితే జిల్లాలో ఐదు సీట్లు వదులుకోవాల్సి రావచ్చనే సంకేతాలు ఆశావహులను ఆందోళ నకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, పరిగి, తాండూరు, ఉప్పల్ నియోజకవర్గాలను బీజేపీ ఆశిస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా వీటిని ఆ పార్టీకి కేటాయించాల్సివస్తే తమ పరిస్థితేంటనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో పార్టీలో పనిచేసిన నేతలను మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా వికారాబాద్‌కు చెందిన సీనియర్ నేత ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌తో ఆ పార్టీ నాయకత్వం టచ్‌లో ఉంది. కాంగ్రెస్ నేతలపై ఆశలు కాంగ్రెస్ జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందా అని టీడీపీ ఎదురుచూస్తోంది. ఆ పార్టీ టికెట్ దక్కని నేతలు సైకిలెక్కెందుకు సిద్ధమని సంకేతాలిచ్చిన నేపథ్యంలో జాబితా కోసం వే చిచూస్తోంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటరీ స్థానం సహా వికారాబాద్, చేవెళ్ల, పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ల టికెట్లను కాంగ్రెస్ జాబితాను పరిశీలించిన తర్వాతే తమ అభ్యర్థులను ఖరారు చేయాలని యోచిస్తోంది. టీ కాంగ్రెస్ జాబితా వెల్లడి అనంతరం సమీకరణలు మారిపోతాయని, అప్పుడు చాలా మంది నేతలు తమ గూటికి చేరుకుంటారని టీడీపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగిస్తున్న ఆ పార్టీ వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులపై కూడా వల విసురుతోంది. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నవారికి పోటీ తీవ్రంగాలేని నియోజకవర్గాలను ఆఫర్ చేయాలని నిర్ణయించింది. -
కుట్రలు చేస్తే ఖబడ్దార్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మెదక్ జిల్లాలో 66 ఏళ్లుగా అగ్రకులాలే పెత్తనం చేస్తున్నాయి, బీసీ నేతలను ఎదగనీయకుండా రెడ్డి, వెలమ నేతలు అణగదొక్కే కుట్రలు చేస్తున్నారు. ఇకపై వారి ఆటలను సాగనివ్వం’’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ కులాలను అణిచి వేసేందుకు కుట్రలు చేస్తున్న అగ్రకుల పెత్తందార్లూ..! ఖబడ్దార్ అని ఘాటుగా హెచ్చరించారు. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ సోమవారం సంగారెడ్డిలో జరిగిన సోనియా ‘అభినందన సభ’లో ఆవేదన వ్యక్తం చేయడంపై ఆర్. కృష్ణయ్య స్పందించారు. పత్రికల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆయన మంగళవారం ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకంగా పని చేస్తోందని, దీన్ని ఎంత మాత్రం సహించబోమన్నారు. జిల్లాలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉంటే దాన్ని కూడా ఓర్చుకోలేక ఉన్న ఒక్క సీటు కూడా లాక్కునే ప్రయత్నం చేయడం అగ్రకులాల ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తో పాటుగా మరో నలుగురు బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని బీసీ కులాలు, ఉప కులాలను కలుపుకుని జాయింట్ యాక్షన్ కమిటీ వేసి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు. ఆరు దశాబ్ధాలుగా అగ్రకులాలే పెత్తనం చేసినా సహించామనీ, ఇకనుంచి వారి ఆటలు సాగనివ్వమన్నారు. జిల్లా జనాభాలో 80 శాతం ఉన్న బీసీలకు వాస్తవంగా ఐదు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం చూసినా మెదక్ జిల్లాలో ప్రస్తుతం అగ్రకులాల వారు ఉన్న స్థానాల్లో బీసీలుండాలనీ, బీసీ ఉన్న ఒకే ఒక స్థానం అగ్రకులాలకు దక్కాలన్నారు. బీసీల ఓట్లతో గెలిచి బీసీల సీట్లలో కూర్చుని రాజ్యాధికారంతో పాటు వ్యాపారాలు కూడా గుప్పిట్లో పెట్టుకుని బీసీలనే అణచివేస్తున్నారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని బీసీ కులాలు ఐక్యం కావాల్సిన సమయం వచ్చిందని, రాజ్యాధికారంలో హక్కులను సాధించుకోవడం కోసం బీసీలంతా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.