సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు అధిష్టానాలు రంగంలోకి దిగాయి. తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన నేతలను సముదాయించే పనిలో పడ్డాయి. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం ఆఖరు రోజు కావడంతో బుజ్జగింపులను ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొందరు అభ్యర్థులు అధిష్టానం మంతనాలతో మెత్తబడ్డా, మరికొందరు మాత్రం పట్టుదలగా ఉన్నారు. పోటీలో కొనసాగుతామని తెగేసి చెబుతుండడం పార్టీ నేతలను కలవరపరుస్తోంది. అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేందుకు వీలైనన్ని తాయిలాలు ప్రకటిస్తున్నారు.
ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీలకు తిరుగుబాటు సెగ ఎక్కువగా ఉంది. ఎల్‌బీనగర్ స్థానాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఇవ్వడంతో అలకబూనిన టీడీపీ సీనియర్లు కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కృష్ణప్రసాద్ నామినేషన్ తిరస్కరణకు గురికాగా, రంగారెడ్డి మాత్రం ఇంకా బరిలోనే ఉన్నారు. నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని అధిష్టానం పెద్దలు సూచించినా ఆయన లెక్కచేయడం లేదు. ‘వస్తున్నా.. మీకోసం’ యాత్రతోపాటు ఇతర పార్టీ కార్యక్రమాలకు విశేష సేవలందించిన తనను పార్టీ నట్టేట ముంచిందని ఆగ్రహంతో ఉన్న రంగారెడ్డి.. పోటీలో ఉంటానని కరాఖండిగా చెబుతున్నారు.
మరోవైపు శేరిలింగంపల్లిలోనూ ఆ పార్టీ ఇన్‌చార్జి మొవ్వా సత్యనారాయణ సైతం అధిష్టానం బుజ్జగింపులకు లొంగడంలేదు. తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని తేల్చిచెప్పారు. అలాగే ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ పోటీ నుంచి తప్పుకునేది లేదని అధిష్టానానికి స్పష్టం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కార్తీక్‌రెడ్డి వారించినా కూడా జగదీశ్వ ర్ చల్లబడనట్లు తెలిసింది. ఇదిలావుండగా, మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్యయాదవ్‌కు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేతలు నందారెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్, హరివర్దన్‌రెడ్డి నామినేషన్లు వేశారు. వీరిలో హరి వర్దన్, నందారెడ్డితో ఆ పార్టీ అభ్యర్థి జంగయ్యయాదవ్ జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది.
వీరువురు రాజీకొచ్చినా.. నక్కా మాత్రం పంతం వీడడంలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి తన సత్తా చూపుతానని సవాల్ విసురుతున్నారు. మరోవైపు మేహ శ్వరంలో మజ్లిస్ అభ్యర్థి అహ్మద్ నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదే నియోజకవర్గంలో బలమైన ఓ అభ్యర్థిని కూడా పోటీ నుంచి తప్పుకోవాలని వివిధ రకాలుగా ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇబ్రహీంపట్నం టికెట్ దక్కకపోవడంతో బరిలో నిలిచిన మల్‌రెడ్డి సోదరులు కూడా నామినేషన్ ఉపసంహరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించినప్పటికీ కాంగ్రెస్ మల్‌రెడ్డి రంగారెడ్డి చేత నామినేషన్ వేయించింది. ఈయన ఉపసంహరణ విషయం కూడా నేడు తేలనుంది. టీడీపీ పోటీ చేస్తున్న మహేశ్వరం, మేడ్చల్, చేవెళ్ల పార్లమెంటులకు బీజేపీ కూడా అభ్యర్థులను నిలిపింది. వీరిపై కూడా శనివారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అసంతృప్తులకు బుజ్జగింపులు
Published Fri, Apr 11 2014 11:27 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement