ససేమిరా | You know? | Sakshi
Sakshi News home page

ససేమిరా

Published Fri, Apr 11 2014 4:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ససేమిరా - Sakshi

ససేమిరా

  •     టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల్లో మోగుతున్న రె‘బెల్స్’
  •      పోటీ నుంచి తప్పుకునేందుకు ‘నో’
  •      అమీతుమీకే సిద్ధమంటున్న తిరుగుబాటుదార్లు
  •      బరి నుంచి తప్పించేందుకు ముఖ్య నేతల యత్నాలు
  •      బుజ్జగింపులు.. బేరసారాలు
  •      పార్టీ పదవులు ఎరగా మంతనాలు
  •  సాక్షి, సిటీబ్యూరో: ప్రధాన పార్టీలను రెబల్స్ బెడద దడదడలాడిస్తోంది. పలు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన నేతలు పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియగానే.. ఆయా పార్టీల నుంచి స్వతంత్రులుగా పోటీకి దిగిన వారిని బరి నుంచి తప్పించేందుకు బుజ్జగింపులు, బేరసారాలు మొదలయ్యాయి. కొందరు రెబల్స్ దారిలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుండగా, మరికొందరు మాత్రం అధిష్ఠానంతో అమీతుమీకే సిద్ధమవుతున్నారు.

    వీరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రధానంగా ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి వంటి చోట్ల దడ పుట్టిస్తున్నారు. ఇప్పటి దాకా టికెట్ల కోసం అవస్థలు పడ్డ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల్లోని అభ్యర్థులు ఇప్పుడు సొంత పార్టీల నుంచే స్వతంత్రులుగా సవాల్ విసురుతున్న వారిని నయానో భయానో పోటీ నుంచి తప్పించే పనిలో పడ్డారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా రెండ్రోజుల సమయం ఉన్నందున వారిని బుజ్జగించి తమ వైపు తిప్పుకునేందుకు యోచిస్తున్నారు.

    ఇది కాని పక్షంలో బేరసారాలకూ సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని, తమ గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే. రెబల్స్ దారిలోకి వస్తారా? లేక బరిలోనే నిలుస్తారా అనేది శనివారం నాటికి కానీ తెలిసేలా లేదు. మాట వినని వారిని అంతిమంగా సస్పెండ్ చేయడమో.. లేదంటే పార్టీ నుంచి బహిష్కరించడమో చేస్తారని అంచనా వేస్తున్నారు. అంతకుముందు సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగించనున్నారు.
     
    ‘కమలం’లో కలకలం
     
    భారతీయ జనతా పార్టీ.. సొంత పార్టీ నుంచే స్వతంత్రులుగా పోటీకి దిగిన వారితో ఇబ్బందులు పడుతోంది. ఓవైపు నామినేషన్ల ఉపసంహరణకు ముంచుకొస్తున్న గడువు.. మరోపక్క వెనక్కి తగ్గనంటున్న రెబల్స్.. ఈ క్రమంలో తిరుగుబాటు అభ్యర్థులను ఏదోలా దారిలోకి తెచ్చుకొనేందుకు ముఖ్య నేతలు నేరుగా రంగంలోకి దిగారు. రెబల్స్‌ను శుక్రవారం పార్టీ కార్యాలయానికి పిలిపించి చర్చించాలని నిర్ణయించారు. అగ్రనేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, బి.వెంకటరెడ్డి ఇప్పటికే పలువురికిఫోన్లు చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ పదవులిస్తామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొందరికి సీట్లిస్తామని గట్టి హామీలిస్తున్నారు.
         
    గోషామహల్ టికెట్ ఆశించి భంగపడిన నలుగురు నేతలు రెబల్స్‌గా రంగంలోకి దిగారు. వీరిలో నందకిషోర్ వ్యాస్ తన నామినేషన్ ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు. ఫోన్ ద్వారా బుజ్జగించేందుకు యత్నించిన పార్టీ నాయకులను ఆయన ‘ఇంతకాలం నేను చేసిన సేవలన్నీ వృథాయేనా?’ అని నిలదీశారు. స్వతంత్రుడిగా బరిలో నిలిచి తన బలమేంటో చూపిస్తానని అంటున్నారు. రఘునందన్ యాదవ్, రామస్వామి, గోవింద్‌రాఠి కూడా బరిలోనే ఉంటామంటున్నారు. పార్టీ పదవులు, ఇతరత్రా తాయిలాలు ఆశ చూపుతున్నా వీరెవరూ దారికొచ్చే పరిస్థితి కనిపించట్లేదు.
     
    రె‘బెల్స్’ మోత ఎక్కడెక్కడంటే..

    ఎల్‌బీనగర్ అసెంబ్లీ టీడీపీ టికెట్‌ను ఆర్.కృష్ణయ్యకు ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు సామ రంగారెడ్డి, ఎస్వీ కృష్ణప్రసాద్ పోటాపోటీగా నామినేషన్లు వేశారు. వీరిలో కృష్ణప్రసాద్ నామినేషన్ స్క్రూటినీలో చెల్లలేదు. సామ రంగారెడ్డి.. బరిలోనే ఉంటానని చెబుతున్నారు. ఎంతోకాలంగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా, హఠాత్తుగా దింపిన అభ్యర్థికి సహకరించేది లేదని, రంగంలోనే నిలిచి ఏదో ఒకటి తేల్చుకుంటానని రంగారెడ్డి అంటున్నారు.
     
    సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ప్రత్యర్థిగా పోటీకి దిగిన పీఎల్ శ్రీనివాస్ పార్టీకి రాజీనామాచేసి ఇండిపెండెంట్‌గా సవాల్ విసురుతున్నారు. బాబు మోసగాడని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

    ముషీరాబాద్‌లో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన ఆ పార్టీకి చెందిన బీసీ సెల్ నాయకుడు నగేష్ ముదిరాజ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీతాప్రకాశ్‌గౌడ్.. ఇద్దరిలో ఒకరు పోటీ నుంచి తప్పుకుని ఒక్కరే బలమైన ప్రత్యర్థిగా నిలిచి పార్టీకి సవాల్ విసరాలని యోచిస్తున్నారు.
     
    శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్‌గా జగదీశ్వర్‌గౌడ్, టీడీపీ రెబల్‌గా మొవ్వా సత్యనారాయణ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
     
    సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన మరో ఇద్దరు టీడీపీ రెబెల్స్ ఏడుకొండలు, బద్రినాథ్‌యాదవ్.. దారికొచ్చేది లేదని తెలుస్తోంది. వీరిలో ఏడుకొండలు టీడీపీ నమ్మించి వంచించిందని దుమ్మెత్తి పోస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement