క్రాస్ ఓటింగ్‌పై కోటి ఆశలు..! | Delivery of cross-voting ..! | Sakshi
Sakshi News home page

క్రాస్ ఓటింగ్‌పై కోటి ఆశలు..!

Published Tue, May 27 2014 1:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

క్రాస్ ఓటింగ్‌పై కోటి ఆశలు..! - Sakshi

క్రాస్ ఓటింగ్‌పై కోటి ఆశలు..!

  •       ఆ ఆశతోనే రంగంలోకి టీడీపీ, బీజేపీ
  •       కాంగ్రెస్ రెబల్స్ సైతం..
  •       స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు పూర్తి
  •       15 సీట్లకు 19 నామినేషన్లు దాఖలు
  •  సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యత్వాల కోసం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. వచ్చేనెల 6న జరుగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 15 సీట్లకుగాను 19 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ నుంచి ఎనిమిదిమంది, ఎంఐఎం నుంచి ఏడుగురు ఎన్నిక కావాల్సి ఉండగా, కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు అదనంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంఐఎం నుంచి ఏడుగురు బరిలో ఉన్నారు.

    కాంగ్రెస్ అనధికారిక (రెబల్స్) అభ్యర్థులు ఇద్దరితోపాటు టీడీపీ, బీజేపీల నుంచి చెరొకరు నామినేషన్లు దాఖలు చేశారు. బయటి పరిస్థితులెలా ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీలో మాత్రం  కాంగ్రెస్ - ఎంఐఎంల మధ్య ఒప్పందానికి ఇంతవరకు ఎలాంటి భంగం వాటిల్లలేదు. ఒప్పందానికి అనుగుణంగానే  ఎంఐఎం నుంచి ఏడుగురు మాత్రమే నామినేషన్లు వేశారు.

    కాంగ్రెస్ సైతం అధికారికంగా ఎనిమిదిమంది పేర్లు ప్రకటించినప్పటికీ, అదనంగా మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. దీంతోపాటు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి దూకిన వారు ఈసారి గణనీయంగానే ఉండటంతో క్రాస్‌ఓటింగ్ ఆశతో టీడీపీ, బీజేపీలు చెరో అభ్యర్థిని రంగంలో దింపాయి. అంతే కాకుండా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- బీజేపీల మధ్య కుదిరిన పొత్తు జీహెచ్‌ఎంసీలో కూడా ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి.

    పలువురు కార్పొరేటర్లు  పార్టీలు మారడం.. టీడీపీ- బీజేపీ పొత్తు తదితరమైనవి ఈసారి స్టాండింగ్ ఎన్నికల్లో ఆసక్తిగొలుపుతున్నాయి. గత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సైతం క్రాస్‌ఓటింగ్ జరిగినట్లు వెల్లడైంది. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీలకు సభ్యుల పరంగా ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రావడంతో ఆ విషయ వెల్లడైంది. బీజేపీ బలం సైతం గతం కంటే ఈసారి కొంత పెరిగింది. వీటన్నింటి నేపథ్యంలో క్రాస్‌ఓటింగ్ జీహెచ్‌ఎంసీలో ఆసక్తికర అంశంగా మారింది.
     
    ఆరునెలలే కొనసాగే అవకాశం!

    కొత్తగా ఎన్నికయ్యే స్టాండింగ్ కమిటీ దాదాపు ఆరునెలలు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు డిసెంబర్ మూడు వరకే ఉండటంతో.. పాలకమండలి రద్దయితే స్టాండింగ్ కమిటీ కూడా రద్దవుతుంది. దీంతో కొత్తగా ఎన్నికయ్యే స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏడాదికి బదులు ఆరేడు నెలల వరకు మాత్రమే తమ పదవుల్లో కొనసాగుతారు. కొత్తగా ఏర్పాటయ్యే స్టాండింగ్ కమిటీయే ప్రస్తుత పాలకమండలిలో చివరి కమిటీ కావడంతో స్వల్పకాలానికైనా ఎంతో డిమాండ్ నెలకొంది. స్టాండింగ్ కమిటీకి రూ. 50 లక్షల వరకు నిధులు మంజూరు చేసే అధికారం ఉంది.
     
    జీహెచ్‌ఎంసీకి సంబంధించినంతవరకు పార్టీ ఫిరాయింపులు..ఇతరత్రా అంశాలు లేవు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన పలువురు కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు పార్టీలు మారినప్పటికీ అవేవీ  అధికారికం  కాదు.   దీంతో ఎవరెటు మొగ్గుచూపుతారో తెలియని పరిస్థితి. వివిధ పార్టీల సభ్యుల మధ్య పార్టీల కతీతంగా స్నేహసంబంధాలు.. వివిధ అంశాల్లో  పరస్పర  ‘ఒప్పందాలు’ ఉన్నా యి.  ఈ నేపథ్యంలో.. క్రాస్ ఓటింగ్ ఆశలతోనే టీడీపీ-బీజేపీలు తమ అభ్యర్థులను రంగంలో దింపాయి.
     
    అందరి దృష్టి దానిపైనే...

    వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు కార్పొరేటర్లు ఇటీవల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే టీడీపీ, వైఎస్సార్‌సీపీల నుంచి కాంగ్రెస్‌లో కలిసిన వారున్నారు.  ఒకరిద్దరు కాంగ్రెస్ నుంచి ఎంఐఎం వైపు మళ్లారు. ఇవిలా ఉండగా.. ఈసారి ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారు స్టాండింగ్ కమిటీలో ఓటు వేసే అవకాశం లేదు. దీంతో స్టాండింగ్ కమిటీ ఓటర్లు 150 మంది నుంచి 148కి తగ్గనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి క్రాస్‌ఓటింగ్ ప్రభావం గణనీయంగా ఉంటుందనే అంచనాలున్నాయి.

    ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అదనంగా నామినేషన్లు దాఖలు చేయడం సమాచార లోపంతో జరిగింది తప్ప వారు రెబెల్స్ కాదని జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఉపసంహరణ గడువులోగా వారు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగలరనే ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ సభ్యుల బలం 52గా ఉందన్నారు. కాంగ్రెస్- ఎంఐఎం పొత్తు యథావిధిగా కొనసాగుతుందని, ఎప్పటిలాగే తమ రెండు పార్టీల వారే ఎన్నికవుతారనే ధీమా వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement