సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పేలా లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు ఆశించగా, అందులో టికెట్లు రాని అసంతృప్తులు రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 24 మందిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం 10 చోట్ల ఆ పార్టీకి రె‘బెల్స్’మోగక తప్పదని గాందీభవన్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, బాన్సువాడ, వరంగల్ వెస్ట్, డోర్నకల్, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్‌కు రండి..
ఈసారి కాంగ్రెస్ రెబెల్స్‌గా జంగా రాఘవరెడ్డి (వరంగల్ వెస్ట్), నరేశ్ జాదవ్ (బోథ్), గాలి అనిల్‌కుమార్ (నర్సాపూర్), ఎస్.గంగారాం (జుక్కల్), కాసుల బాలరాజు (బాన్సువాడ), నాగి శేఖర్ (చొప్పదండి), దైద రవీందర్ (నకిరేకల్), రామ్మూర్తి నాయక్ (వైరా), ప్రవీణ్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు (ఇల్లందు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్), లక్ష్మీనారాయణ నాయక్ (పాలకుర్తి), సున్నం వసంత (చేవెళ్ల), నెహ్రూ నాయక్ (డోర్నకల్), భూక్యా మంగీలాల్ (మహబూబాబాద్), పటేల్ రమేశ్‌రెడ్డి (సూర్యాపేట), చిమ్మని దేవరాజు (పరకాల), సిరిసిల్ల రాజయ్య (వర్ధన్నపేట)తోపాటు మరికొంత మంది రంగంలోకి దిగారు.
వీరిలో ఒకరిద్దరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) టికెట్లు తెచ్చుకుని సింహం గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారితో మంతనాలు జరిపి వారి నామినేషన్లను ఉపసంహరింపజేసే బాధ్యతలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు పార్టీ అప్పగించింది. దీంతో వీరందరినీ హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు.
వీరిలో నలుగురైదుగురు మాత్రమే అందుబాటులోకి రాగా, మిగిలిన వారితో ఠాక్రే, మహేశ్‌గౌడ్ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. దీనిపై మహేశ్‌కుమార్‌గౌడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రెబెల్స్‌గా బరిలోకి దిగిన పార్టీ నాయకులందరితో మాట్లాడామని, అందరూ సర్దుకుంటారని చెప్పారు. బుధవారం సాయంత్రానికి మెజార్టీ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎంత ప్రయత్నించినా...
టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ నెల రోజులుగా బుజ్జగింపు యత్నాలు చేస్తూనే ఉంది. టికెట్లు రాని వారితో సంప్రదింపులు జరిపేందుకు సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీతోపాటు ఏఐసీసీ నుంచి సమన్వయకర్తలుగా వచ్చిన దీపాదాస్ మున్షీ, జ్యోతిమణి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలు టికెట్లు దక్కవని తెలిసిన వారితో మంతనాలు జరిపి వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇక, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు 15 మంది నేతలతో సమావేశమై బుజ్జగించారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా 20 మందికి పైగా రెబెల్స్ నామినేషన్లు వేశారు. వీరిలో ఓ 10 మంది వెనక్కు తగ్గినా, మరో 10 మంది బరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. వీరిలో ఎంతమంది బరిలో ఉంటారు? ఎంత మంది ఉపసంహరించుకుంటారనే దానిపై బుధవారం సాయంత్రానికి స్పష్టత రానుంది.
పార్టీలు మారిన చాలా మంది
రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన వారితోపాటు చివరి క్షణంలో పార్టీలు మారిన వారి నుంచి ఎలాంటి ముప్పు వస్తుందోననే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. మునుగోడు నుంచి ముషీరాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి నకిరేకల్ వరకు 20కి పైగా నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఇటీవలే పార్టీ నుంచి వెళ్లిపోయారు.
వీరిలో చాలా తక్కువ మంది బీజేపీలోకి వెళ్లగా, మెజార్టీ నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. చివరి క్షణం వరకు టికెట్ రేసులో ఉండి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు కాంగ్రెస్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. వీరికితోడు మరో 10 మంది వరకు రెబెల్స్ బరిలో ఉండే అవకాశాలుండటంతో టికెట్ల ‘అసంతృప్తి’పార్టీ పుట్టి ముంచుతుందేమోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్‌లో రె‘బెల్స్’
Published Wed, Nov 15 2023 5:14 AM | Last Updated on Wed, Nov 15 2023 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment