రెబెల్స్
సొంత పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు చేస్తున్న వారు ఓ వైపు... పార్టీలతో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమైన అభ్యర్థులు మరో వైపు నిలబడి ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ఇరువైపుల నుంచి సుడిగాలిలా దూసుకొస్తున్న ఈ ముప్పు ప్రధాన పార్టీల గెలుపోటములపై తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకంగా రెబల్స్ బరిలో ఉండటం ఆయా పార్టీల అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. స్వతంత్రులను ఏదో విధంగా మచ్చికచేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పార్టీలోని రెబల్స్‌ను ఏవిధంగా బుజ్జగించాలో తెలియని అయోమయ పరిస్థితి అభ్యర్థుల్లో నెలకొంది.
ఓట్ల చీలికతో ఫలితాలు తారుమారు...
గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెబల్స్, స్వతంత్రులు ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. 2006 ఎన్నికల్లో 815 ఎంపీటీసీ స్థానాలకు గాను స్వతంత్రులు 513 మంది బరిలో ఉన్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో 835 స్థానాలకు 649 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆ ఎన్నికల్లో జెడ్పీటీసీ 59 స్థానాలకు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఈ ఎన్నికల్లో వారి సంఖ్య ఏకంగా 125కు పెరగడం గమనార్హం. ఈ పోటీతత్వం కాంగ్రెస్, టీడీపీలలో ఎక్కువగా కనిపిస్తోంది.
జిల్లా రాజకీయాల్లో ఈ రెండు పార్టీల్లో గ్రూపులు తారాస్థాయికి చేరడం ఎన్నికల్లో పోటీ తత్వానికి దారితీసింది. దీంతోఈ ఎన్నికల్లో రెబల్స్.. తమకు ఉన్న పలుకుబడితో ఓట్లను పొందగలిగితే..అన్ని ప్రధాన పార్టీల ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి.