బుజ్జగింపులు
- నామినేషన్ల ఉపసంహరణకు బేరసారాలు
- రెబల్స్‌ను బుజ్జగిస్తున్న పార్టీ నాయకులు
- ‘పరిషత్’పోరులో అభ్యర్థుల హైరానా
- బీఫారం కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుజ్జగింపులు,బేరసారాల పర్వం జోరందుకుంది. ఈ నెల 24వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈలోగా రెబల్స్‌ను పోటీ నుంచి వైదొలిగేలా అన్ని పార్టీలవారు ప్రయత్నాలు చేపట్టారు. ఇది తలకుమించినదైనప్పటికీ ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు.
అలకబూనినవారు, వేరే పార్టీలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నవారి ఇళ్లకు నాయకులు వెళ్లి బుజ్జగిస్తున్నారు. అవసరమైతే నజరానాలను ఆశచూపుతున్నారు. నామినేషన్లు వేసినవారంతా పార్టీ అభ్యర్థిగా బీఫారాల కోసం అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా ‘పరిషత్’పోరులో అభ్యర్థులు, రాజకీయపార్టీల హైరానా అం తటా కనిపిస్తోంది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు 39 జెడ్పీటీసీ స్థానాలకు 387, 656 ఎంపీటీసీలకు 4264 నామినేషన్లు వచ్చాయి.
ఒక స్థానానికి ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నుంచి ఏడుగురు వరకు బీఫారాలు లేకుండా నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి 123 మంది, టీడీపీ నుంచి 150, కాంగ్రెస్ 39, సీపీఎం 22, సీపీఐ 11, బీజేపీ 16, బీఎస్‌పీ 3, లోక్‌సత్తా నుంచి ఇద్దరితో పా టు 21 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థులను మినహా మిగిలిన వారిని బుజ్జగించడం కొన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది.
ప్రాదేశికం ప్రతిష్టాత్మకం : సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉంటుందని పార్టీలన్నీ జెడ్పీటీసీ,ఎంపీటీసీ సా ్థనాల్లో విజయానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ స్థానాలకు అభ్యర్థుల ఎంపికే పార్టీలకు ఇబ్బందిగా మారింది.
ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో వారిలో ఎవరికి బి-ఫారం ఇవ్వాలన్న విషయంపై నాయకులు మల్లగుల్లాలుపడుతున్నాయి. బలమైన అభ్యర్థులను గుర్తించి మిగిలిన వారితో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడం పార్టీలకు సవాలుగా మారింది.
టీడీపీకి తొలనొప్పులు : ప్రాదేశిక స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ కిందామీదా పడుతోంది. గ్రామాల్లో ఆ పార్టీకి పట్టులేకపోయినా... మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలన్న అధిష్టానం ఆదేశాల మేరకు ఒక్కో సెగ్మెంటుకు ముగ్గురు నుంచి పది మంది వరకు నామినేషన్లు వేశారు. 39 జెడ్పీటీసీలకు 150 నామినేషన్లు వేయడం ఇందుకు తార్కాణం.
తీరా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశాక ఎవరిని బరిలో నిలపాలన్న విషయంపై ఇప్పటికీ ఆ పార్టీ నాయకుల్లో స్పష్టత లేకపోవడం గమనార్హం. దీంతో ఎవరికి బి-ఫారం వస్తుందన్నది చెప్పలేకపోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు కేవలం రెండు రోజులే ఉంది. ఇప్పటికీ ఆ పార్టీ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థులెవరో తేలలేదు. ఇదే ఆ పార్టీ కొంపముంచేట్టు ఉంది.