రాయబేరాలు! | bumper offers to get Zilla Parishad chairman | Sakshi
Sakshi News home page

రాయబేరాలు!

Published Mon, May 19 2014 4:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాయబేరాలు! - Sakshi

రాయబేరాలు!

  • సంఖ్యాబలం సమీకరణకు ప్రలోభాలు
  • రూ.కోటి నగదు, ఫార్చ్యూనర్ కారు ఎర
  • టీఆర్‌ఎస్ గూటికి కాంగ్రెస్ సభ్యుడు?
  • ఆసక్తికరంగా జెడ్పీ రాజకీయం
  •   సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వ్యూహాలకు పదునుపెట్టాయి. మేజిక్ ఫిగర్‌ను చేరేందుకు, అవసరమైన సంఖ్యకు చేరుకునేందుకు జెడ్పీటీసీలతో రాయబేరాలు సాగిస్తున్నాయి. నజరానాలు, ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 17 మంది సభ్యులు అవసరం.

    మొత్తం 33 మంది జెడ్పీటీసీలకుగాను ప్రస్తుతం కాంగ్రెస్‌కు 14, టీఆర్‌ఎస్‌కు 12, టీడీపీకి ఏడుగురు సభ్యులున్నారు. దీంతో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ దక్కలేదు. ఈ క్రమంలోనే మేజిక్ నంబర్ కోసం ఇరుపార్టీలూ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌లు టీడీపీపై మద్దతుపై గట్టి ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఇరుపార్టీలు తమకు ఉమ్మడి శత్రువు కనుక.. ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది. ఒకవేళ అనివార్యమై తే కాంగ్రెస్‌కు అండగా నిలుస్తాం తప్ప టీఆర్‌ఎస్‌తో జతకట్టేదిలేదని టీడీపీ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా టీడీపీ మద్దతుపైనే ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు మంతనాలు కూడా సాగిస్తున్నారు.

     నజరానాల ఎర
     జిల్లా పరిషత్ చైర్మన్‌పై కన్నేసిన ఓ ప్రధాన పార్టీ.. ప్రత్యర్థి పార్టీల సభ్యులపై వల విసురుతోంది. సరిపడా సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తూర్పు డివిజన్‌లోని ఓ కాంగ్రెస్ సభ్యుడితో టీఆర్‌ఎస్ నాయకత్వం సంప్రదింపులు జరిపినట్లు ప్రచారమవుతోంది. కోటి రూపాయల నగదు, ఫార్చునర్ కారును ఎరవేయడం ద్వారా సదరు జెడ్పీటీసీని ఆకర్షించడంలో సక్సెస్ అయినట్లు తెలిసింది. ఇదే తరహాలో మిగతా సభ్యులను కూడా చేరదీయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు క్యాంపు రాజకీయాలు నెరపుతున్నప్పటికీ, మరోవైపు ఆయా పార్టీల జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం, విప్ ఉల్లంఘించినా ఏమీ కాదనే ధీమాతో కొందరు సభ్యులు గోడ దూకేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

     ఇదే అదనుగా ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున సస్పెన్షన్  వేటు పడ్డ కాంగ్రెస్ జెడ్పీటీసీ, గులాబీ గూటికి చేరే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌లో నైరాశ్యం అలుముకోవడం, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి కూడా సొంత పార్టీ సభ్యుల గొంతెమ్మ కోరికలను తీర్చే విషయంలో వెనుకడుగు వేస్తుండడాన్ని అనువుగా మలుచుకున్న టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అసంతుష్టులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. వారిని సంతృప్తి పరచడం ద్వారా మేజిక్ ఫిగర్‌ను సులువుగా చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్ వ్యూహాలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ కూడా ప్రతి వ్యూహాలను రూపొందిస్తోంది. క్యాంపుల్లో ఉన్న జెడ్పీటీసీలపై వల విసరకుండా అప్రమత్తమైంది. సభ్యుల కదలికలపై నిఘాను విస్తృతంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement