మండపేట, న్యూస్‌లైన్ :త్వరలో మరో ఎన్నికల సమరానికి తెర లేవనుంది. శాసనమండలిలో స్థానిక సంస్థలకు సంబంధించి పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించినట్టు సమాచారం. ఇటీవల స్థానిక ఎన్నికలు ముగియడంతో జిల్లాలోని స్థానిక సంస్థల సభ్యుల ఓటింగ్ వివరాలు పంపాల్సిందిగా కమిషన్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.శాసనమండలి పునరుద్ధరణ అనంతరం 2006లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లాలో రెండు స్థానాలకు అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఒక స్థానానికి కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, మరో స్థానానికి టీడీపీ నుంచి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికయ్యారు. వారి పదవీకాలంపై నిర్వహించిన డ్రాలో రుద్రరాజుకు నాలుగు సంవత్సరాల పదవీకాలం దక్కగా, చినరాజప్పకు ఆరు సంవత్సరాల పదవీకాలం లభించింది. 2010లో రుద్రరాజు పదవీకాలం ముగియడంతో ఆ ఏడాది నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొడ్డు భాస్కరరామారావు విజయం సాధించారు. 2012లో చినరాజప్ప పదవీకాలం ముగియడంతో ఎన్నిక జరపాల్సి ఉంది. అయితే నగర, పురపాలక సంస్థల సభ్యుల పదవీకాలం 2010 సెప్టెంబరుతో ముగియగా, 2011 జూలైలో పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో స్థానిక సంస్థల సభ్యులు లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్సీకి ఎన్నిక జరిపే వీలులేకపోయింది. దాంతో దాదాపు రెండేళ్లుగా జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది.
జిల్లాలో 1,434 మంది ‘స్థానిక’ ఓటర్లు
ఇటీవల నగర, పురపాలక సంస్థలతో పాటు, జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. దాంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, కంటోన్మెంట్ బోర్డులలోని సభ్యుల (వీరే స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు) వివరాలను పంపాల్సిందిగా ఇటీవల ఆదేశించింది. ఆయా సంస్థల అధికారులు తమ పరిధిలోని స్థానిక సంస్థల సభ్యుల సంఖ్యను, వారి వివరాలను జిల్లా యంత్రాంగానికి నివేదించారు. జిల్లాలో కంటోన్మెంట్ బోర్డు లేనందున దాన్ని మినహాయిస్తే మిగిలిన వాటిలో ఎన్నికలు జరిగిన రాజమండ్రి కార్పొరేషన్ నుంచి 50 మంది కార్పొరేటర్లు, ఏడు పురపాలక సంస్థల నుంచి 204 మంది కౌన్సిలర్లు, మూడు నగర పంచాయతీల నుంచి 60 మంది సభ్యులు, 57 మంది జెడ్పీటీసీ, 1,063 మంది ఎంపీటీసీ సభ్యులతో మొత్తం 1,434 మంది స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తుతో త్వరలో స్థానిక ఎమ్మెల్సీకి ఎన్నికల నగారా మోగా సూచనలు కనిపిస్తున్నాయి.
త్వరలో ‘మండలి’ పోరు!
Published Fri, Jun 6 2014 12:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement