ప్రచార హోరు
తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ
జీవకోనలో కాంగ్రెస్ పార్టీ
బహిరంగ సభ తెర వెనుక {పయత్నాలు మొదలు
తిరుపతి: ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో బుధవారం చివరి రోజు నగరంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని చేశాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఎన్‌టీఆర్ విగ్రహం నుంచి లీలామహల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలను సమీకరించి బలప్రదర్శన చేశారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగిసిన నేపధ్యంలో తెరవెనుక రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అసంతృప్త నేతలతో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు నేరుగా మాట్లాడి అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సిందిగా దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ స్వయంగా ఉపఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్య అనుచరులను రంగంలోకి దించి క్షేత్ర స్థాయిలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు ముఖ్య నేతలకు తెలియజేసి పరిస్థితులను చక్కదిద్దే యత్నం చేస్తున్నారు. వార్డుల్లో మెజారిటీ తెచ్చిన నాయకులకే భవిష్యత్ ఉంటుందని, వారికి పార్టీ పదవులను కట్టబెడతామని ఆశ చూపినట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం భారీగా తగ్గవచ్చునని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో వీలైనంత వరకు పోలింగ్ శాతం పెంచుకుని, భారీ మెజారిటీ సాధించాలనే పట్టుదలతో అధిష్టానం ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటర్లను వాయిస్ మెసేజ్ ద్వారా సుగుణమ్మకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఓటర్లు నిర్లిప్తంగా ఉన్నారని, పరిస్థితిని చక్కదిద్దాలని పార్టీ ముఖ్య నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పోలింగ్ శాతాన్ని పెంచి భారీ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలని అధినాయకత్వం సర్వ శక్తులు ఒడ్డుతోంది.
తెరవెనుక యత్నాలు
రాజకీయ పార్టీలు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఓటర్లను పోలింగ్‌కేంద్రాలకు చేరుకునేలా చేసేందుకు దేశం పార్టీ కార్యకర్తలు పలు రకాల యత్నాలు చేస్తున్నారు. డబ్బు, మద్యం ఎరగా చూపి ప్రలోభ పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఏజెంట్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఏకపక్షంగా పోలింగ్ జరిపేలా వ్యూహరచన చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచారం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి ప్రచారాన్ని ముమ్మరం చే శారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బుధవారం నగరంలో మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు. జీవకోనలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొని ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పార్టీలో అసమ్మతి జ్వాలాలు చల్లారకపోయినా గత ఎన్నికల కంటే ఎక్కువశాతం ఓట్లు సాధించి పరువు నిలువుకోవాలని కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఇండిపెండెట్ అభ్యర్థులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, మనోహరరెడ్డి, గురుగోవిందయాదవ్, లోక్‌సత్తా అభ్యర్థి కల్లూరు బాల సుబ్రమణ్యంతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు తమకూ ఓ అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.