లబ్.. డబ్..
- నేడే ప్రజా తీర్పు..
- జనం పట్టం కట్టేదెవరికో..?!
- అభ్యర్థుల గుండెల్లో గుబులు
- క్షణక్షణం పెరుగుతున్న ఉత్కంఠ
సాక్షి, సిటీబ్యూరో: ఉదయం 6.30: స్ట్రాంగ్‌రూమ్ తాళాలు తెరుస్తారు
ఉదయం 8.00: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
ఉదయం 8 .30: ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు షురూ
మధ్యాహ్నం 3.00: మొత్తం ఫలితాల వెల్లడి
క్షణక్షణం ఉత్కంఠ.. అభ్యర్థుల్లో టెన్షన్.. మరికొద్ది గంటల్లో నే‘తల’రాతలు మారనున్నాయి. వివిధ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఫలితాల సరళిపై ఇప్పటికే చర్చలు.. పందేలు నడుస్తుండగా, శుక్రవారం వెల్లడయ్యే తుది ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, వామపక్షాల వంటి ప్రధాన పార్టీలతో పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ బరిలో నిలవగా, గ్రేటర్‌లోని 81,42,027 మంది ఓటర్లు ఏ పార్టీ నుంచి ఎవరిని గెలిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ పరిధిలో 511 మంది అసెంబ్లీ అభ్యర్థుల, 91 మంది లోక్‌సభ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.
కౌంటింగ్‌కు సర్వ సన్నాహాలు
ఓట్ల లె క్కింపునకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. హైదరాబాద్ పార్లమెంట్ ఫలితాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, సికింద్రాబాద్ పార్లమెంట్ ఫలితం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో వెల్లడిస్తారు. హైదరాబాద్ జిల్లాలోని సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల పార్లమెంట్ ఓట్లను మాత్రం వేరే గదిలో లెక్కిస్తారు. మిగతా 12 నియోజకవర్గాల్లో అసెంబ్లీ.. పార్లమెంట్ ఓట్లను ఒకే హాల్‌లో టేబుల్‌కు చెరో వైపు లెక్కిస్తారు.
ఈసారి ప్రజాతీర్పు కోరనున్న ప్రముఖుల్లో వి.హనుమంతరావు, దానం నాగేందర్, ఎం.ముఖేశ్‌గౌడ్, అక్బరుద్దీన్ ఒవైసీ, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, ముఠా గోపాల్, డి.సుధీర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బిక్షపతియాదవ్, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, జయసుధ, బద్దం బాల్‌రెడ్డి, విజయారెడ్డి, జాఫర్‌హుస్సేన్, మల్‌రెడ్డి రంగారెడ్డి, జి.సాయన్న, అహ్మద్ పాషాఖాద్రి, మోజంఖాన్, అహ్మద్ బ లాల తదితరులున్నారు.
పార్లమెంట్ బరిలో తలపడ్డ వారిలో బండారు దత్తాత్రేయ, అసదుద్దీన్ ఒవైసీ, భగవంతరావు పవార్, అంజన్‌కుమార్‌యాదవ్, భీంసేన్, సయ్యద్ సాజిద్‌అలీ, ఛాయారతన్, సర్వే సత్యనారాయణ, దినేశ్‌రెడ్డి, జయప్రకాశ్‌నారాయణ, డా.నాగేశ్వర్, మల్లారెడ్డి, లుబ్నా సర్వత్ తదితరులున్నారు.
ఓట్ల లెక్కింపు విశేషాలు..
అధికారులు, మీడియా ప్రతినిధులు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా 15 నియోజకవర్గాల కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు
కౌంటింగ్ కేంద్రంలోకి సంబంధిత అధికారుల వాహనాలను మాత్రమే.. అదీ పరిమితంగా అనుమతిస్తారు
పోలింగ్‌స్టేషన్లు, కౌంటింగ్ టేబుళ్లు, లెక్కించాల్సిన రౌండ్ల సంఖ్యను బట్టి ఫలితానికి దాదాపు 4 నుంచి 7 గంటలు పడుతుందని అంచనా
చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం తొలుత వెల్లడవుతుందని భావిస్తున్నారు. ఇక్కడ 179 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 13 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఒక్కో రౌండ్‌కు 20 నిమిషాల వంతున మధ్యాహ్నం 12.30 కల్లా కౌంటింగ్ పూర్తికాగలదని అంచనా
యాకుత్‌పురా ఫలితానికి ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, టేబుళ్ల ఆధారంగా 21 రౌండ్ల కౌంటింగ్‌కు ఏడు గంటల సమయం పడుతుందని అంచనా
ప్రతి రౌండ్‌లో వచ్చిన ఓట్ల వివరాలను సదరు టేబుల్ వద్ద ప్రదర్శించడంతో పాటు లెక్కింపు కేంద్రం ఆవరణలోని వారికి వినిపించేలా మైకు ద్వారా తెలియజేస్తారు. హాలు ఆవరణలోనూ ప్రొజెక్టర్ లేదా బోర్డుపై వివరాలు వెల్లడిస్తారు
అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాక ఎన్నికల కోడ్ ముగుస్తుంది
పింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్‌ప్లే యూనిట్ (పాడు) ద్వారా ఈవీఎంలలోని ఓట్ల వివరాల ప్రింట్‌ను పొందవచ్చు. అవసరమనుకుంటే ప్రింట్‌తీస్తారు. ఈవీఎంల్లో సాంకేతిక సమస్య తలెత్తినా ‘పాడు’ ద్వారా ఓట్లను తెలుసుకోవచ్చు
ఉదయం 8.30లోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాని పక్షంలో వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్దకు పంపిస్తారు. వాటినలా ఉంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు.
విధి.. విధానాలిలా...
ఒక్కో కౌంటింగ్ టేబుల్ వద్ద ముగ్గురు వంతున (గెజిటెడ్ అధికారి అయిన కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, కేంద్రం నుంచి వచ్చిన మైకో అబ్జర్వర్) 1266 మంది, ఇతరత్రా అధికారులు, సిబ్బంది వెరసి మరో 600 మంది, రిజ ర్వులో 200 మంది.. మొత్తం 2 వేల మందికి పైగా కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు
ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక అబ్జర్వర్ ఉంటారు. ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించడంతో పాటు ప్రతి రౌండ్ ఫలితంపై ఆయన సంతకం చేస్తారు. ఆపై రిటర్నింగ్‌అధికారి సంతకం చేస్తారు.
ఫలితాల అనంతరం రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, ఊరేగింపులు నిషేధం
కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ముస్లిం సిబ్బం దికి నమాజ్‌కు కొంతసేపు అవకాశమిస్తారు
రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించాక.. ఒక్కసారి బయటకు వెళ్తే కనుక తిరిగి రానివ్వరు
అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఉంటాయి. అధికారులు, పార్టీల ఏజెంట్లు వేర్వేరు మార్గాల ద్వారా కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లాలి
కౌంటింగ్ కేంద్రాల్లోకి ఆహార పదార్థాలను అనుమతించరు. లెక్కింపు కేంద్రాల హాల్‌ల ఆవరణలో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తారు.