టీడీపీ పరేషన్
- ఓటమి భయంతో ఓటర్లకు ప్రలోభాలు
- ప్రతీ ఇంటికి బియ్యం, సరకులు పంపిణీ
- పోటాపోటీగా కాంగ్రెస్
- కోట్లు కుమ్మరిస్తున్న అభ్యర్థులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజా వ్యతిరేకత, రెబెల్స్ పోకడ, అసంతృప్తుల సెగలు తెలుగుదేశం అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధినాయకులొచ్చి ప్రచారం చేపట్టినా స్పందన కానరాకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంటోంది. ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టిపీడిస్తోంది. దీంతో ప్రలోభాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.
చావో.. రేవోలా మారిన ఈ ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. విశ్వాసపాత్రులను రంగంలోకి దించి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక అవసరాలు, పరిస్థితులను బట్టి ఓటర్లకు రేషన్ బియ్యం, నిత్యావసరాలు విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ ఆకుట్టుకోవడానికి యత్నిస్తున్నారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి యథేచ్ఛగా సాగిపోతోంది. అభ్యర్థుల అనుయాయులు ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.
ప్రధానంగా విశాఖ-దక్షిణం, విశాఖ-ఉత్తరం, విశాఖ-తూర్పు, భీమిలి, పెందుర్తి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ఈ విధానం జోరుగా సాగుతోంది. విశాఖ వన్‌టౌన్, భీమిలి, పాయకరావుపేట ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న సరుకులను అధికారులు ఇటీవల పట్టుకోవడం ఇందుకు తార్కాణం. అయితే స్కీములు, చిట్టీలు వేసుకొని కొనుగోలు చేసుకుంటున్నామంటూ అభ్యర్థుల అనుచరగణం చెప్పడంతో అధికారులు ఏమీ చేయలేక వాటిని విడిచిపెట్టారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో వన్‌టౌన్, అల్లిపురం ప్రాంతాల్లో వాసు బ్రాండ్ బియ్యాన్ని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో జనాభా ఆధారంగా గ్రామాల్లో యథేచ్ఛగా డబ్బు వెదజల్లుతున్నారు. ఒక్కో గ్రామానికి ఒక రేటును నిర్ణయించి ముట్టుచెపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడి టీడీపీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నామినేషన్ వేసిన వెంటనే ఉచిత మీల్స్ పేరుతో మెస్ పుట్టుకొచ్చింది. రోజూ వందలు, వేల మందికి ఉచితంగా భోజనాన్ని అందిస్తూ వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆ మెస్‌ను మూయించడంతో పాటు నిర్వాహకునిపై కేసు నమోదు చేశారు. విశాఖ-తూర్పు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. ఇతర ప్రాంతాల నుంచి చీప్ లిక్కరును దిగుమతి చేయించి అనుచరుల ద్వారా మందుబాబులకు పీకలదాకా తాగిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల విశాఖలోని సీతమ్మధార చెక్‌పోస్టు వద్ద ఒక మాజీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో భారీగా మద్యం కేసులు బయటపడ్డాయి.
వాటికి సంబంధించిన బిల్లులు ఉన్నాయంటూ అధికారులు వాటిని విడిచిపెట్టారు. వీరికి దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు పంపకాలు చేపడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. టీడీపీ తరహాలోనే ఇంటికో బియ్యం బస్తాతో పాట అదనంగా ఒక బిందె కూడా ఇస్తున్నారు. డబ్బు, మద్యం, సరుకులు...ఇలా ఎన్ని పంపిణీ చేసినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే పార్టీకే ప్రజలు పట్టం కడతారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.