సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థి కారుపై రాళ్లతో దాడి చేశారు. టికెట్లు దక్కకపోవడంతో నిరాశకు గురైన మరికొందరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసి అధిష్టానానికి సవాల్ విసిరారు. తమ స్థానాలను బీజేపీ ఎగురేసుకుపోవడం.. సీనియర్లను కాదని ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కట్టబెట్టడంతో ఆశావహుల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది.
ఎల్‌బీనగర్ శాసనసభా స్థానానికి బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ను ఖరారు చేయడాన్ని జీర్ణించుకోలేని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు ఆయన కారుపై దాడి చేశారు. అంతేకాకుండా స్థానికేతరుడైన ఆర్.కృష్ణయ్యకు పోటీగా సీనియర్ నేతలు కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అధినాయకత్వం తీరును నిరసిస్తూ ఐదుగురు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇది టీడీపీలో కలకలం సృష్టిం చింది. పొత్తులో భాగంగా మల్కాజిగిరి సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు తెలియగానే ఎమ్మెల్యే మైనంపల్లి సహా పలువురు ముఖ్యనేతలు రాజీనా మా చేశారు. మరో ముగ్గురు బీజేపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ నామినేషన్లు వేశారు. ఈ పరిణామం మరి చిపోకముందే బుధవారం ఎల్‌బీనగర్‌లో ముఖ్యనేతల తిరుగుబాటు, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి మొవ్వ సత్యనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ‘దేశం’ నాయకత్వం నివ్వెరపోయింది.
శేరిలింగంపల్లి టికెట్‌ను గాంధీకి కేటాయించడంతో బండి రమేశ్, సత్యనారాయణ, శంకర్‌గౌడ్ అసంతృప్తికి గురయ్యారు. శంకర్‌గౌడ్ ఏకంగా పార్టీకి రాాజీనామా చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. రమేశ్ కూడా పార్టీ మారే అంశంపై సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్యయాదవ్‌కు ఇవ్వడంతో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఈ క్రమంలో ముగ్గురు కీలక నేతలు ధిక్కారస్వరం వినిపించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నక్కా ప్రభాకర్‌గౌడ్, నందారెడ్డి, సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డిలు పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతూ రెబల్స్‌గా బరిలో దిగారు. మరోవైపు పరిగి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రయ్య కూడా తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలిచారు.
కాంగ్రెస్‌కు తిరుగుబాటు బెడద!
అధికారపార్టీకీ తిరుగుబాట్ల బెడద తప్పలేదు. పలు నియోజకవర్గాల్లో ఆపార్టీ నేతలు రెబల్స్‌గా బరిలో దిగారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆయన సోదరుడు రాంరెడ్డి, సీనియర్ నేత లక్ష్మిపతిగౌడ్, శశిధర్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు.
మరోవైపు పొత్తులో భాగంగా మహేశ్వరం స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న చల్ల నర్సింహారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలావుండగా, తెలుగుదేశంతో పొత్తును తప్పుబడుతున్న కమలనాథులు అనేక నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు.
చేవెళ్ల పార్లమెంటరీ స్థానానికి ఏకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ నామినేషన్ వేయగా, రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సీనియర్ నేత డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఇబ్రహీంపట్నంలో పోరెడ్డి నర్సింహారెడ్డి, మహేశ్వరంలో శంకర్‌రెడ్డి, మేడ్చల్‌లో కొంపల్లి మోహన్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌లో ఎస్.మల్లారెడ్డి నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా టీడీపీని ఇరకాటంలోకి పెట్టారు. ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో జరిగిన రచ్చ మిత్రభేదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌కు తిరుగుబాట్లు బాగానే ఉన్నాయి. రాత్రికి రాత్రే కారెక్కిన ఇతర పార్టీల నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ నాలుగు చోట్ల గులాబీ ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా అసమ్మతి స్వరం వినిపించారు.
టీడీపీ : 11
కాంగ్రెస్ : 12
టీఆర్‌ఎస్: 7
బీజేపీ: 4
తిరుగుబాటు!
Published Thu, Apr 10 2014 12:08 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement