కామ్రేడ్లకు ‘చెయ్యి’! | congress nomination in maheswaram after cpi | Sakshi
Sakshi News home page

కామ్రేడ్లకు ‘చెయ్యి’!

Published Thu, Apr 10 2014 12:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress nomination in maheswaram after cpi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కామ్రేడ్లకు కాంగ్రెస్ చెయ్యిచ్చింది. సీపీఐ - కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు మూడు రోజుల ముచ్చటగా మారింది. సీట్ల సర్దుబాటులో భాగంగా మహేశ్వరం అసెంబ్లీ స్థానం సీపీఐకి దక్కగా, కాంగ్రెస్ కూడా పార్టీ అభ్యర్థిని నిలపడంతో పొత్తు పరిహాసమైంది. ఇరు పార్టీల మధ్య చివరి సంప్రదింపులు ముగిశాక  మహేశ్వరం సీటును సీపీఐకి కాంగ్రెస్ వదిలేసింది. దీంతో ఆ పార్టీ తరఫున అజీజ్‌పాషా బుధవారం నామినేషన్ వేశారు. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డికి బీ ఫారం కేటాయించి నామినేషన్ వేయించడ ంతో కమ్యూనిస్టు పార్టీ నివ్వెరపోయింది. ఇది వాస్తవమా? కాదా అని నిర్ధారించుకునేందుకు పార్టీ పెద్దల ద్వారా కాంగ్రెస్ హైకమాండ్‌ను సంప్రదించింది. నిజమేనని తేలడంతో కామ్రేడ్లు కత్తులు నూరుతున్నారు.

 చక్రం తిప్పిన చెల్లెమ్మ!
 మేహ శ్వరం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీ ఫారం దక్కించుకోవడంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చక్రం తిప్పారు. తన రాజకీయ చతురతను ఉపయోగించి చివరి నిమిషంలో సీపీఐకి ఝలక్ ఇచ్చారు. చేవెళ్ల లోక్‌సభ స్థానానికి తన కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీ చేస్తుండడంతో ఆయన విజయావకాశాలు మెరుగుపరిచేందుకే మేహ శ్వరంలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండేలా సబితమ్మ అధిష్టానం పెద్దలను ఒప్పించినట్లు తెలుస్తోంది. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి మహేశ్వరం రావడంతో ఈ స్థానంలో కమ్యూనిస్టులకు మద్దతు ఇస్తే.. ఓటు బదిలీలో గందరగోళం తలెత్తుతుందని సబిత  కంగారు పడ్డారు.

మహేశ్వరం అసెంబ్లీకి ఓటు కంకి కొడవలికి.. పార్లమెంటుకు ఓటు హస్తం గుర్తుకు వేయడంలో ఓటర్లు తికమకపడతారని, అలా కాకుండా రెండు బ్యాలెట్ పేపర్లలో హస్తం గుర్తే ఉంటే బాగుంటుందని భావించారు. అసలే టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ రూపంలో బలమైన ప్రత్యర్థి బరిలో ఉండడంతో ఏ మాత్రం తేడా వచ్చినా కుమారుడి గెలుపు కష్టమని అంచనాకొచ్చిన ఆమె ఇదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు వివరించి మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి ఒప్పించగలిగారు. ఈ క్రమంలోనే ఇక్కడ బలమైన అభ్యర్థిగా మల్‌రెడ్డి రంగారెడ్డిని భావించి టికెట్ ఇప్పించారు.

గతంలో ఈయన పోటీచేసి గెలిచిన మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని సరూర్‌నగర్ మండలంలో మల్‌రెడ్డికి మంచి పట్టుంది. పునర్విభజనలో భాగంగా 2009లో ఈ మండలం మహేశ్వరం పరిధిలోకి రావడం మల్‌రెడ్డికి సానుకూల ంగా మారుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం టికెట్‌ను ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డ మల్‌రెడ్డిని ఇక్కడి నుంచి బరిలో దింపడం ద్వారా ఉభయతారకంగా ఉంటుందని పీసీసీ కూడా ఈయన అభ్యర్థిత్వానికి తలూపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement