సాక్షి ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మంత్రుల్లో ఆందోళన ప్రారంభమయింది. అధికారంలో ఉన్న ప్రజాసామ్య కూటమికి ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చన్న భయం కాంగ్రెస్‌లో నెలకొందని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా జరిగిన మంత్రి మండలి సమావేశాలతో ఈ విషయం బహిర్గత మయిందని చెప్పవచ్చు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు ప్రయత్నించడంతోపాటు దీర్ఘకాలంగా జాప్యమవుతున్న అనేక ప్రాజెక్టులు, పథకాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రిమండలి సమావేశంలో పలువురు కేబినెట్ సభ్యులు సూచించినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పక్షం మంత్రి మండలిలో చర్చలు జరిపినట్టు సమాచారం.
ఇలా రాబోయే ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవచ్చన్న భయం కేబినెట్ సమావేశంలో కన్పించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయమైనా తొందరగా తీసుకోవాలని దాదాపు అందరు మంత్రులూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక అంశాలపై ప్రతిపక్షాలు, ప్రజలకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడాల్సి వచ్చిందని మరికొందరు మంత్రులు వాపోయారు. అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు కూటమి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. పెండింగ్‌లో ఉన్న పనులతోపాటు నిర్ణయాలూ త్వరగా తీసుకోవాలని మంత్రులందరు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి విషయాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చోపచర్చలు నడిచినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల అమలు, ఫైళ్ల ఆమోదంపై తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కోరారు. మంత్రులు ఆర్.ఆర్.పాటిల్, ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, నసీంఖాన్, అనిల్ దేశ్‌ముఖ్ తదితరులు ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని సూచించినట్టు తెలిసింది. మరోవైపు ఓబీసీ విద్యార్థుల సమస్యను కూడా పరిష్కరించాలని, లేదంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం కన్పించే అవకాశాలున్నాయని పృథ్వీరాజ్ చవాన్ కొందరు హెచ్చరించారు. దీంతో ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
గెలుపుపై గుబులు
Published Thu, May 1 2014 11:03 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement