సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులంతా కొత్తవారవడం, వీరు ప్రముఖుల వారసులు కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతుండగా.. టీడీపీ నుంచి మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్ బరిలో నిలిచారు. ఇద్దరు మాజీ హోంమంత్రులకు తనయుల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
వ్యూహాత్మక ప్రచారాలు..
పల్లె, పట్టణ వాతావరణం కలయిక చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. కార్తీక్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌ల బంధువర్గం సైతం ప్రచారంలో పాల్గొంటోంది. వీరేందర్‌కు అండగా దేవేందర్‌గౌడ్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరేందర్ తన మిత్రవర్గంతోనూ కలిసి ప్రచార కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణ అంతా వీరేందర్ సోదరుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పట్టణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.
చేవెళ్ల సొంత ప్రాంతం కావడంతో ఇక్కడినుంచే అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కార్తీక్‌రెడ్డికి అండగా సబితారెడ్డి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయగా.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్తీక్ సోదరులు ప్రచార కార్యక్రమాల నిర్వహణను చూసుకుంటున్నారు. మరోవైపు కార్తీక్ చిన్నమ్మ, సోదరి కూడా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
తనయుల గెలుపు కోసం
Published Fri, Apr 18 2014 12:11 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement