tulla devendar goud
-
తనయుల గెలుపు కోసం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులంతా కొత్తవారవడం, వీరు ప్రముఖుల వారసులు కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతుండగా.. టీడీపీ నుంచి మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్ బరిలో నిలిచారు. ఇద్దరు మాజీ హోంమంత్రులకు తనయుల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూహాత్మక ప్రచారాలు.. పల్లె, పట్టణ వాతావరణం కలయిక చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. కార్తీక్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌ల బంధువర్గం సైతం ప్రచారంలో పాల్గొంటోంది. వీరేందర్‌కు అండగా దేవేందర్‌గౌడ్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరేందర్ తన మిత్రవర్గంతోనూ కలిసి ప్రచార కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణ అంతా వీరేందర్ సోదరుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పట్టణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. చేవెళ్ల సొంత ప్రాంతం కావడంతో ఇక్కడినుంచే అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కార్తీక్‌రెడ్డికి అండగా సబితారెడ్డి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయగా.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్తీక్ సోదరులు ప్రచార కార్యక్రమాల నిర్వహణను చూసుకుంటున్నారు. మరోవైపు కార్తీక్ చిన్నమ్మ, సోదరి కూడా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. -
పొత్తులుంటాయ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండు, మూడు రోజుల్లో పొత్తులపై స్పష్టత వస్తుందని తెలుగుదేశం సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్ తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య సీట్లసర్దుబాటు కుదిరే అవకాశముందని, అదేసమయంలో మనం కూడా పొత్తులకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల్లో చోటుచేసుకునే మార్పుల అనంతరం.. రాజకీయ సమీకరణలు మారిపోతాయని ఆయన అన్నారు. గురువారం జిల్లాలోని మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవేందర్ మాట్లాడారు. రాష్ట్రం ఇంకా సమైక్యంగా ఉందనే భ్రమల నుంచి బయటకు రావాలని, వ చ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులొడ్డాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున... ఎన్నికలు ఉంటాయా? లేదా అనే అంశంపై శుక్రవారం స్పష్టత వస్తుందని, ఎన్నికలు జరగకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1985 నుంచి జిల్లా పరిషత్‌ను టీడీపీ గెలుస్తోందని, ఈ సారి కూడా స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేసేలా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్టీని వదిలివెళ్లినవారిని ప్రజలు పట్టించుకోరని, నాయకులు వెళ్లిన కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారని అన్నారు. ఇబ్రీహ ంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇతర పార్టీల ప్రలోభాలకు కేడర్ లొంగకుండా పార్టీ నేతలు చూడాలన్నారు. కొంతమంది నేతల నిష్ర్కమణ కారణంగా పార్టీ నుంచి వెళ్లే ఆలోచన ఉన్న దిగువశ్రేణి నాయకులతో మాట్లాడి మనోధైర్యం చెప్పాలని సూచించారు.ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి స్వాగతం పలకాలని పేర్కొన్నారు. అతిత్వరలోనే నియోజకవర్గాల ఇన్చార్జిలను ప్రకటిస్తామని చెప్పారు. చివరి నిమిషంలో కొన్ని సెగ్మెంట్లకు కొత్త అభ్యర్థులు బరిలో దిగినా సహకరించాలని సూచించారు. గ్రూపు రాజకీయాలకు తావివ్వవద్దని, అభిప్రాయబేధాలను విడనాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు కేఎం వివేక్, నక్కా ప్రభాకర్‌గౌడ్, నందారెడ్డి, సుభాష్‌యాదవ్, చంద్రయ్య, ఉదయ్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ద్రోహులకు బుద్ధి చెప్పండి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. దోపిడీ ప్రభుత్వాలతో రాజధానిలోని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, అధికారంలోకి రాగానే అవన్నీ తిరిగి రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వసూళ్ల పార్టీకి ఓటేస్తే ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోతాయని టీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరిన మహేందర్‌రెడ్డి త్రయంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వీరికి తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని పదవులు అనుభవించి నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే పరిగి, తాండూరు, చేవె ళ్ల అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే జిల్లా పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చంద్రబాబు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ ద్వారా ఎదిగి ఇప్పుడు మోసం చేసిన మహేందర్, రత్నం, నరేందర్‌రెడ్డిలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీలేదని, కార్యకర్తల అండ ఉన్నంతకాలం టీడీపీని ఎవరేమీ చేయలేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. సారథి ఎంపికపై సందిగ్ధం మహేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి అభ్యర్థి ఎంపికపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఎంపిక ఉంటుందని అంతా భావించారు. అయితే, సామాజిక సమీకరణల నేపథ్యంలో అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీని సమన్వయపరిచేందుకు సమర్థ నాయకత్వం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవిని గతంలో నిర్వర్తించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరును ఆయన పరిశీలిస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా జిల్లా నాయకత్వాన్ని ఒకే వర్గానికి కట్టబెట్టడాన్ని తప్పుబట్టిన ఒకరిద్దరు నేతలు ఈ సారి బీసీ సామాజికవర్గానికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే వాదన తెస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్లు సుభాష్‌యాదవ్, ఎగ్గె మల్లేశం పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 3న పార్టీ ముఖ్యులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త సారథి పేరు ప్రకటించే అవకాశముంది.