సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. దోపిడీ ప్రభుత్వాలతో రాజధానిలోని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, అధికారంలోకి రాగానే అవన్నీ తిరిగి రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వసూళ్ల పార్టీకి ఓటేస్తే ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోతాయని టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్‌ఎస్ గూటికి చేరిన మహేందర్‌రెడ్డి త్రయంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వీరికి తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని పదవులు అనుభవించి నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే పరిగి, తాండూరు, చేవె ళ్ల అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే జిల్లా పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చంద్రబాబు చెప్పారు.
రాజ్యసభ సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ ద్వారా ఎదిగి ఇప్పుడు మోసం చేసిన మహేందర్, రత్నం, నరేందర్‌రెడ్డిలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీలేదని, కార్యకర్తల అండ ఉన్నంతకాలం టీడీపీని ఎవరేమీ చేయలేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
సారథి ఎంపికపై సందిగ్ధం
మహేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి అభ్యర్థి ఎంపికపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఎంపిక ఉంటుందని అంతా భావించారు. అయితే, సామాజిక సమీకరణల నేపథ్యంలో అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీని సమన్వయపరిచేందుకు సమర్థ నాయకత్వం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవిని గతంలో నిర్వర్తించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరును ఆయన పరిశీలిస్తున్నారు.
అయితే, కొన్నేళ్లుగా జిల్లా నాయకత్వాన్ని ఒకే వర్గానికి కట్టబెట్టడాన్ని తప్పుబట్టిన ఒకరిద్దరు నేతలు ఈ సారి బీసీ సామాజికవర్గానికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే వాదన తెస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్లు సుభాష్‌యాదవ్, ఎగ్గె మల్లేశం పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 3న పార్టీ ముఖ్యులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త సారథి పేరు ప్రకటించే అవకాశముంది.
ద్రోహులకు బుద్ధి చెప్పండి!
Published Sat, Mar 1 2014 11:28 PM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM
Advertisement
Advertisement