Chevella - pranahitha project
-
'ప్రాణహిత'పై అట్టుడికిన జెడ్పీ సమావేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పుపై రంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశం అట్టుడికిపోయింది. గోదావరి జలాలు జిల్లాకు రాకుండా మెదక్ వరకే పరిమితం చేయడాన్ని ప్రశ్నిస్తూ విపక్ష కాంగ్రెస్ సభ్యులు పోడియం ముందు బైఠాయించడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. పాత డిజైన్‌ను యథాతథంగా కొనసాగించేలా తీర్మానం చేయాలని పట్టుబట్టడం.. ఒకానొక దశలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత ఈ అంశాన్ని లెవనెత్తిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.. ప్రాణహిత ప్రాజెక్టు మళ్లింపు ప్రకటనపై అధికారపక్షాన్ని గట్టి నిలదీశారు. దాదాపు రూ.వేయి కోట్ల పనులు కూడా పూర్తిచేసుకున్న ప్రాజెక్టును అర్థంతరంగా రద్దు చేయాలని సీఎం నిర్ణయించినట్లు పత్రికల్లో ప్రకటనలు వస్తున్నందున.. ప్రస్తుత డిజైన్‌ను కొనసాగించేలా తీర్మానం చేయాలని పట్టుబట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టితో బీడువారిన రంగారెడ్డి జిల్లా నేలలను సస్యశ్యామలం చేయాలనే ఉద్ధేశంతో గోదావరి నీటిని చేవెళ్లకు తరలించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, ప్రస్తుత ప్రభుత్వ తీరుతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులను శాంతపరిచేందుకు అధికారపక్షం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆఖరికి పోలీసులు రంగప్రవేశం చేసి సభ్యులను అరెస్టు చేశారు. మరోవైపు ప్రాణహిత ప్రాజెక్టు నుంచి జిల్లాను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు జిల్లా పరిషత్‌ను ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
చేవెళ్ల-ప్రాణహిత కోసం పోరాటం
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామశివారులో గల గండిపేట తెలుగువిజయంలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడులో బుధవారం రాత్రి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు సాధనకు కృషిచేస్తానని పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టబోతున్న సీమాంధ్రతోపాటుగా అధికారంలోలేని తెలంగాణను కూడా అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంతోపాటుగా రంగారెడ్డి జిల్లాను కూడా తామే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పోలవరంతో పాటుగా చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి పోరాటం చేస్తానని చెప్పారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. అదే విధంగా శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి కృషిచేస్తానని, సాధించి తీరుతాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరూ బాగుండాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. -
ద్రోహులకు బుద్ధి చెప్పండి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. దోపిడీ ప్రభుత్వాలతో రాజధానిలోని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, అధికారంలోకి రాగానే అవన్నీ తిరిగి రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వసూళ్ల పార్టీకి ఓటేస్తే ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోతాయని టీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరిన మహేందర్‌రెడ్డి త్రయంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వీరికి తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని పదవులు అనుభవించి నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే పరిగి, తాండూరు, చేవె ళ్ల అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే జిల్లా పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చంద్రబాబు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ ద్వారా ఎదిగి ఇప్పుడు మోసం చేసిన మహేందర్, రత్నం, నరేందర్‌రెడ్డిలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీలేదని, కార్యకర్తల అండ ఉన్నంతకాలం టీడీపీని ఎవరేమీ చేయలేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. సారథి ఎంపికపై సందిగ్ధం మహేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి అభ్యర్థి ఎంపికపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఎంపిక ఉంటుందని అంతా భావించారు. అయితే, సామాజిక సమీకరణల నేపథ్యంలో అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీని సమన్వయపరిచేందుకు సమర్థ నాయకత్వం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవిని గతంలో నిర్వర్తించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరును ఆయన పరిశీలిస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా జిల్లా నాయకత్వాన్ని ఒకే వర్గానికి కట్టబెట్టడాన్ని తప్పుబట్టిన ఒకరిద్దరు నేతలు ఈ సారి బీసీ సామాజికవర్గానికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే వాదన తెస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్లు సుభాష్‌యాదవ్, ఎగ్గె మల్లేశం పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 3న పార్టీ ముఖ్యులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త సారథి పేరు ప్రకటించే అవకాశముంది.