'ప్రాణహిత'పై అట్టుడికిన జెడ్పీ సమావేశం | ZP meeting get improper with pranahitha project issue | Sakshi
Sakshi News home page

'ప్రాణహిత'పై అట్టుడికిన జెడ్పీ సమావేశం

Published Sat, Aug 8 2015 6:03 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

ZP meeting get improper with pranahitha project issue

సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పుపై రంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశం అట్టుడికిపోయింది. గోదావరి జలాలు జిల్లాకు రాకుండా మెదక్ వరకే పరిమితం చేయడాన్ని ప్రశ్నిస్తూ విపక్ష కాంగ్రెస్ సభ్యులు పోడియం ముందు బైఠాయించడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. పాత డిజైన్‌ను యథాతథంగా కొనసాగించేలా తీర్మానం చేయాలని పట్టుబట్టడం.. ఒకానొక దశలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత ఈ అంశాన్ని లెవనెత్తిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.. ప్రాణహిత ప్రాజెక్టు మళ్లింపు ప్రకటనపై అధికారపక్షాన్ని గట్టి నిలదీశారు. దాదాపు రూ.వేయి కోట్ల పనులు కూడా పూర్తిచేసుకున్న ప్రాజెక్టును అర్థంతరంగా రద్దు చేయాలని సీఎం నిర్ణయించినట్లు పత్రికల్లో ప్రకటనలు వస్తున్నందున.. ప్రస్తుత డిజైన్‌ను కొనసాగించేలా తీర్మానం చేయాలని పట్టుబట్టారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టితో బీడువారిన రంగారెడ్డి జిల్లా నేలలను సస్యశ్యామలం చేయాలనే ఉద్ధేశంతో గోదావరి నీటిని చేవెళ్లకు తరలించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, ప్రస్తుత ప్రభుత్వ తీరుతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులను శాంతపరిచేందుకు అధికారపక్షం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆఖరికి పోలీసులు రంగప్రవేశం చేసి సభ్యులను అరెస్టు చేశారు. మరోవైపు ప్రాణహిత ప్రాజెక్టు నుంచి జిల్లాను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు జిల్లా పరిషత్‌ను ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement