పరిగి, న్యూస్‌లైన్ : పరిగి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ సీటు బీజేపీకి పోవడంతో వీరిలో నైరాశ్యం అలుముకుంది. ఈ సారి ఎన్నికల్లో బ్యాలెట్‌లో ‘సైకిల్’ గుర్తే ఉండకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నా రు. ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసి, అనేక సమస్యలపై పోరాడి ఓటు బ్యాంకును కూడగట్టుకున్నామని, ఇప్పుడదంతా నిష్ర్పయోజనమైందని వారంతా మధన పడుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం క్యాడర్ చెల్లాచెదురవుతోంది. తమ్ముళ్లంతా తలోదారి చూసుకుంటున్నారు. గతంలోనూ అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నా పరిగి స్థానాన్ని మాత్రం వేరే పార్టీలకు ఇవ్వలేదు.
దశాబ్దాలుగా టీడీపీకి ఇక్కడ స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ మధ్య ముఖ్యమైన నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో పార్టీకి పెద్దదిక్కు కరువైంది. నాయకులు పార్టీ వీడినా కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు చతకిల పడ్డారు. బీజేపీ అభ్యర్థులకు సహకరించాలంటూ అధిష్టానం చేస్తున్న విన్నపాలను స్థానిక నాయకులు ఎంతవరకు పాటిస్తారో చూడాల్సి ఉంది. కాసాని, ఆర్.కృష్ణయ్య వంటి పెద్దనాయకుల్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారని, వాళ్లొస్తే పార్టీ పరిస్థితి మెరుగవుతుందని కార్యకర్తలు భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోగా అధిస్టానం మరో పార్టీకి ఈ స్థానాన్ని అప్పగించేసింది. అయితే బీజేపీ అభ్యర్థిగా స్థానిక, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న కమతం రాంరెడ్డిని ఎంపిక చేయడం కాస్త ఊరటనిచ్చే అంశమే.
టీడీపీ ట్రాక్ రికార్డుకు బ్రేక్
1983లో పార్టీ ఆవిర్భావం నుంచి 2009 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ రికార్డు స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంది. 2010లో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయం నుంచి పార్టీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఆ పార్టీని వీడటం పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఆ వెంటనే పార్టీ పగ్గాలు అందుకున్న ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్ తీర్థం తీసుకోవడం పార్టీ మరో దెబ్బ. తెలుగుదేశం పార్టీ 1985 ఎన్నికల్లో 53,920 ఓట్లు, 1989లో 48,179 ఓట్లు, 1994లో 67,433ఓట్లు, 1999లో 60,360 ఓట్లు, 2004లో 59,809 ఓట్లు, 2009లో 53,099ఓట్లు సాధించింది. 1985 మొదలుకుని 2009 వరకు 1989లో 4,189 ఓట్లతో ఓటమి మినహా అన్ని సార్లు ఆ పార్టీయే విజయఢంకా మోగించింది.
‘కమలం’ వికసిస్తుందా?
పొత్తుల్లో భాగంగా పరిగి స్థానాన్ని దక్కించుకున్న కమలనాథులు ఎంతవరకు నెట్టుకొస్తారన్న విషయంపై అనుమానాలున్నాయి. టీడీపీ ఓట్లను ఎంతవరకు తమకు వేయించుకుంటార్నదే ఇప్పుడు చర్చనీయాంశం. గతంలో పరిగిలో పోటీచేసిన కమలనాథులకు పలుసార్లు 10వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. బీజేపీ ఓ మోస్తరు నాయకుడిని నిలబెడితే టీడీపీ ఓటు బ్యాంకును హరీశ్వర్‌రెడ్డి ఎక్కువ మొత్తం లాగేసుకుంటారని అందరూ భావించారు. కానీ కమతం రంగంలోకి దిగడంతో సీను కాస్త మారినట్టు కన్పిస్తోంది. కమతం రాంరెడ్డి టీడీపీ శ్రేణులతోపాటు కాంగ్రెస్‌లో తన వర్గం నాయకులను వెంట తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. మొత్తం గా పరిగి ఎన్నికల బరిలో టీడీపీ లేకున్నా పోటీ మాత్రం రసవత్తరం కానుంది.
కమలం చేతిలోకి ‘దేశం’ కోట పరిగి
Published Fri, Apr 11 2014 12:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement