
పార్వతీపురం: ప్రముఖ వైద్యుడు ద్వారపురెడ్డి రామ్మోహనరావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు బయటకు పొక్కడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌కు సోదరుడైన రామ్మోహనరావు బీజీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుండడం టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. టీడీపీలో ఉండగా తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, ఓసారి ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి చివరి నిమిషంలో ప్లేటు మార్చిన విషయాన్ని రామ్మోహనరావు చాలా రోజుల నుంచి జీర్ణించుకోలేకపోయారు.
అప్పటి నుంచి సీఎం చంద్రబాబును, జిల్లాకు చెందిన మంత్రిని బాహాటంగానే విమర్శిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 22న జిల్లా కేంద్రానికి రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలసి ఆయన సమక్షంలో చేరనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే శనివారం స్థానిక బీజేపీ నేతలు డొంకాడ సాయిపార్ధసారధి, పట్లాసింగ్ రవికుమార్, పాలూరి భారతి తదితరులు రామ్మోహనరావును మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు. దీనిపై రామ్మోహనరావును వివరణ కోరగా తాను ఎప్పటి నుంచో బీజేపీలోనే ఉన్నానని చెప్పారు. దీంతో ద్వారపురెడ్డి కుటుంబంలో వేరుకుంపటి తప్పదన్న చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment