
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో అసహనం పెరిగిపోయిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడులో అసంతృప్తి పెరిగిపోయిందని, అందుకే బీజేపీ నేతలపై దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని ఆరోపించారు.
పార్లమెంట్ లాబీలో ఆ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ స్పష్టమైన వైఖరిని అవలంభిస్తోందని, ఉక్కు పరిశ్రమ ఇస్తున్నారని తెలిసికూడా రాజకీయాలకు పాల్పడుతున్నారని మాధవ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఉద్యోగాల పేరుతో మంత్రలు కోట్లు దండుకుంటున్నారని, మంత్రుల ఇళ్లలోనే నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
పదవులకు రాజీనామా చేయొచ్చు కదా! : తెలుగదేశం పార్టీ దీక్షలన్నీ రాజకీయం, మైలేజే కోసమేనని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. నాలుగేళ్లు పనులు చేయకుండా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు ఎందుకు దీక్ష చేస్తున్నారో ప్రజలకు తెలుసునని.. దీక్షలకు బదులు రాజీనామా చేసి పోరాడాలంటూ డిమాండ్ చేశారు. దొంగ దీక్షల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment