Parigi constituency
-
పరిగి నియోజకవర్గానికి పరిపాలించే పాలకుడు ఎవరు?
పరిగి నియోజకవర్గం పరిగి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన కొప్పుల మహేష్ రెడ్డి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి కుమారుడు. హరీశ్వర్ రెడ్డి గతంలో ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన వారసుడుగా రంగంలోకి వచ్చిన మహేష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డిపై 16400 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహేశ్వర్‌రెడ్డికి 82941 ఓట్లు రాగా, రామ్మోహన్ రెడ్డికి 66541 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ నుంచి పోటీచేసిన ఎఫ్ ఎస్ బి అభ్యర్ది కె.మల్లేశంకు దాదాపు తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో ఐదుసార్లు గెలుపొందిన సీనియర్ నేత హరీశ్వర్ రెడ్డి 2014లో టిఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోవడం విశేషం. 2009 ఎన్నికల వరకు టిడిపి తరపున గెలుస్తూ వచ్చిన హరీశ్వర్ రెడ్డి తెలంగాణ సాధనలో భాగంగా ఆయన టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరారు. అయినా2014లో పరిగిలో ఓడిపోయారు. కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో హరీశ్వర్ రెడ్డి 5163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉండి, బిజెపిలో చేరి టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన కమతం రామిరెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. రామిరెడ్డికి 13355 ఓట్లు మాత్రమే వచ్చాయి. పరిగిలో పన్నెండు సార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు ముస్లింలు గెలుపొందారు. హరీశ్వరరెడ్డి తొలిసారి 1985లో గెలుపొందారు. ఆ తరువాత 1994 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఈయన కొంతకాలం డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ నాయకుడు కమతం రామిరెడ్డి 1967లో ఇండ పిెండెంటుగాను, 72,89లలో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఈయన కొంతకాలం జలగం క్యాబినెట్‌లోను, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఎ.షరీఫ్ 1978 తరువాత చెన్నారెడ్డి, అంజయ్య క్యాబినెట్లో పనిచేసారు. 1952లో ఇక్కడ నుంచి ఎస్.జె.బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరిగి నియోజకవర్గానికి 15సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. 2009లో పరిగి ఇండిపెండెంటుగా పోటీచేసిన టి.రామ్మోహన్‌రెడ్డి 38వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో ఉంటే, కాంగ్రెస్ అభ్యర్ధి కమతం రామిరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 2014లో రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా విజయం సాధించడం విశేషం. పరిగి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
పరిగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి
కుల్కచర్ల: పరిగి నియెజవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని ఎర్రగోవింద్‌తండాలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి రూ. 20 కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. గిరిజన ,ఆశ్రమ పాఠశాల భవనాలు, కళాశాల భవనాలు,సీసీ రోడ్లకు నిధులు ఖర్చుచేయడం జరుగుతుందన్నారు. నియోజవర్గంలో ఎస్సీ,ఎస్టీ అవాస ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుంచి మూడు కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఏడు కోట్ల మంజూరు చేయించడం జరిగిందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, అసైన్మెంట్ కమిటీ సభ్యుడు భరత్‌కుమార్, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్,కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటయ్యగౌడ్, కనకం మొగులయ్య, విఠల్ నాయక్ పాల్గొన్నారు. -
కమలం చేతిలోకి ‘దేశం’ కోట పరిగి
పరిగి, న్యూస్‌లైన్ : పరిగి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ సీటు బీజేపీకి పోవడంతో వీరిలో నైరాశ్యం అలుముకుంది. ఈ సారి ఎన్నికల్లో బ్యాలెట్లో ‘సైకిల్’ గుర్తే ఉండకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నా రు. ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసి, అనేక సమస్యలపై పోరాడి ఓటు బ్యాంకును కూడగట్టుకున్నామని, ఇప్పుడదంతా నిష్ర్పయోజనమైందని వారంతా మధన పడుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం క్యాడర్ చెల్లాచెదురవుతోంది. తమ్ముళ్లంతా తలోదారి చూసుకుంటున్నారు. గతంలోనూ అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నా పరిగి స్థానాన్ని మాత్రం వేరే పార్టీలకు ఇవ్వలేదు. దశాబ్దాలుగా టీడీపీకి ఇక్కడ స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ మధ్య ముఖ్యమైన నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో పార్టీకి పెద్దదిక్కు కరువైంది. నాయకులు పార్టీ వీడినా కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు చతకిల పడ్డారు. బీజేపీ అభ్యర్థులకు సహకరించాలంటూ అధిష్టానం చేస్తున్న విన్నపాలను స్థానిక నాయకులు ఎంతవరకు పాటిస్తారో చూడాల్సి ఉంది. కాసాని, ఆర్.కృష్ణయ్య వంటి పెద్దనాయకుల్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారని, వాళ్లొస్తే పార్టీ పరిస్థితి మెరుగవుతుందని కార్యకర్తలు భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోగా అధిస్టానం మరో పార్టీకి ఈ స్థానాన్ని అప్పగించేసింది. అయితే బీజేపీ అభ్యర్థిగా స్థానిక, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న కమతం రాంరెడ్డిని ఎంపిక చేయడం కాస్త ఊరటనిచ్చే అంశమే. టీడీపీ ట్రాక్ రికార్డుకు బ్రేక్ 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి 2009 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ రికార్డు స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంది. 2010లో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయం నుంచి పార్టీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఆ పార్టీని వీడటం పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఆ వెంటనే పార్టీ పగ్గాలు అందుకున్న ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్థం తీసుకోవడం పార్టీ మరో దెబ్బ. తెలుగుదేశం పార్టీ 1985 ఎన్నికల్లో 53,920 ఓట్లు, 1989లో 48,179 ఓట్లు, 1994లో 67,433ఓట్లు, 1999లో 60,360 ఓట్లు, 2004లో 59,809 ఓట్లు, 2009లో 53,099ఓట్లు సాధించింది. 1985 మొదలుకుని 2009 వరకు 1989లో 4,189 ఓట్లతో ఓటమి మినహా అన్ని సార్లు ఆ పార్టీయే విజయఢంకా మోగించింది. ‘కమలం’ వికసిస్తుందా? పొత్తుల్లో భాగంగా పరిగి స్థానాన్ని దక్కించుకున్న కమలనాథులు ఎంతవరకు నెట్టుకొస్తారన్న విషయంపై అనుమానాలున్నాయి. టీడీపీ ఓట్లను ఎంతవరకు తమకు వేయించుకుంటార్నదే ఇప్పుడు చర్చనీయాంశం. గతంలో పరిగిలో పోటీచేసిన కమలనాథులకు పలుసార్లు 10వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. బీజేపీ ఓ మోస్తరు నాయకుడిని నిలబెడితే టీడీపీ ఓటు బ్యాంకును హరీశ్వర్‌రెడ్డి ఎక్కువ మొత్తం లాగేసుకుంటారని అందరూ భావించారు. కానీ కమతం రంగంలోకి దిగడంతో సీను కాస్త మారినట్టు కన్పిస్తోంది. కమతం రాంరెడ్డి టీడీపీ శ్రేణులతోపాటు కాంగ్రెస్‌లో తన వర్గం నాయకులను వెంట తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. మొత్తం గా పరిగి ఎన్నికల బరిలో టీడీపీ లేకున్నా పోటీ మాత్రం రసవత్తరం కానుంది. -
సారథి లేని సైకిల్..!
పరిగి, న్యూస్‌లైన్: పరిగి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగవ్యుగోచరంగా తయూరైంది. గత రెండేళ్లుగా పార్టీ పరిగి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. నరేందర్‌రెడ్డి పార్టీని వీడాక రెండుసార్లు పరిగి టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమైనప్పటికీ నియోజకవర్గానికి ఇన్చార్జిని కూడా నియుమించలేదు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అదునుగా భావించిన ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి వర్గం టీడీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయా మండలాలకు చెందిన పలువురు నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా చేసిన దోమ మండలానికి చెం దిన పలువురు కీలక నేతలు సైకిల్‌దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఒకటిరెండు రోజుల్లో కారులో వారికి బెర్తులు ఖాయువువనున్నట్లు తెలుస్తోంది. నానాటికి తీసికట్టుగా.. గత 20 సంవత్సరాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పార్టీ వీడటంతో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత నరేందర్‌రెడ్డికి పార్టీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. దీంతో ఆయున పార్టీకి కొత్త ఊపిరి పోస్తారని కార్యకర్తలు ఆశించారు. కాని ఆయన ఆ దిశగా పార్టీని నడిపించలేక పోయారు. నియోజకవర్గంలో నానాటికి టీడీపీ పరిస్థితి ఘోరంగా తయూరవుతుండటంతో ఆయనే పార్టీని వీడారు. దీంతో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అయోమయంలో పార్టీ శ్రేణులు ఎన్నికల ముంగిట పార్టీ ఇన్చార్జి నరేందర్‌రెడ్డి టీడీపీని వీడటం.. 15 రోజులు దాటినా పార్టీకి ఇన్చార్జిని నియమించకపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. స్థానిక సమరం సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీకి ఇన్చార్జి లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు తమతోనే ఉన్నారని ఆ పార్టీ అధినాయకత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులకు కూడా ఎవరిని సంప్రదించాలో అర్థంకావడంలేదు. పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు చేపట్టేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. -
‘కోయిల్‌సాగర్’ పనులు వేగవంతం
గండేడ్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్ నుంచిపరిగి నియోజకవర్గానికి తాగునీటిని తీసుకువచ్చేందుకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు, పీసీసీ కార్యదర్శి టి. రామ్మోహన్‌రెడ్డి రూట్ సర్వే చేశారు. పరిగి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.150 కోట్లతో పనులు చేపట్టేందుకు జీఓను విడుదల చేసింది. మొదటి విడతగా రూ.50 లక్షలతో అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. సోమవారం గండేడ్ మండలం పగిడ్యాల్ ప్రాంతం నుంచి కోయిల్ సాగర్ వరకు లిఫ్ట్ పద్ధతిన పైపులైన్ ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేపట్టారు. పనులు చేసేందుకు టెండర్లు తీసుకున్న జేసీఏ కంపెనీ అధికారులు కూడా సర్వే కోసం వచ్చారు. కోయిల్‌సాగర్ నుంచి తాగునీటిని పరిగికి తీసుకురావడంలో పీసీసీ కార్యదర్శి టీఆర్ఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత అధికారులతో సర్వే సనులు చేయిస్తున్నారు. కోయిల్ సాగర్ నుంచి పగిడ్యాల్ వరకు సుమారు 38 కిలోమీటర్ల దూరం పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నారు. పగిడ్యాల్ ప్రాంతంలో నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి పరిగి నియోజకవర్గంలోని గండేడ్, కుల్కచర్ల, దోమ, పరిగి, పూడూరు మండలాలకు 3 ప్రత్యేక పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు ఏడాదిలోగా పూర్తి కావచ్చని ఆయన తెలిపారు. అధికారులు కోయిల్ సాగర్ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న తాగునీటి పంపింగ్‌ను పరిశీలించారు. ఇక ప్రజల దాహార్తి సమస్య తీరినట్లే.. పరిగి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యను తీర్చేందుకే 2007 నుంచీ.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖరరెడ్డి ద్వారా ప్రయత్నం కొనసాగించినట్లు పీసీసీ కార్యదర్శి టీఆర్ఆర్ గుర్తు చేశారు. పరిగి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కోయిల్ సాగర్ జలాలతో ఇక ఈ సమస్య తీరినట్లేనని టీఆర్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాగునీరే కాకుండా పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు, రైల్వేలైన్, చేవెళ్ల ప్రాణహిత వంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ నర్సింలు గౌడ్, గండేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, కార్యదర్శి జితేందర్‌రెడ్డి, నర్సింహారావు, గండేడ్, వెన్నాచేడ్ సర్పంచ్‌లు వెంకటయ్యగౌడ్, బోయిని గోపాల్, నాయకులు బాల్‌రెడ్డి, ఆశిరెడ్డి ఉన్నారు.