‘కోయిల్‌సాగర్’ పనులు వేగవంతం | Public problem of drinking water may be solved in parigi constituency | Sakshi
Sakshi News home page

‘కోయిల్‌సాగర్’ పనులు వేగవంతం

Published Mon, Jan 27 2014 11:31 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Public problem of drinking water may be solved in parigi constituency

గండేడ్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్ నుంచిపరిగి నియోజకవర్గానికి తాగునీటిని తీసుకువచ్చేందుకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు, పీసీసీ కార్యదర్శి టి. రామ్మోహన్‌రెడ్డి రూట్ సర్వే చేశారు. పరిగి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.150 కోట్లతో పనులు చేపట్టేందుకు జీఓను విడుదల చేసింది. మొదటి  విడతగా రూ.50 లక్షలతో అధికారులు సర్వే పనులు ప్రారంభించారు.

 సోమవారం గండేడ్ మండలం పగిడ్యాల్ ప్రాంతం నుంచి కోయిల్ సాగర్ వరకు లిఫ్ట్ పద్ధతిన పైపులైన్ ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేపట్టారు. పనులు చేసేందుకు టెండర్లు తీసుకున్న జేసీఏ కంపెనీ అధికారులు కూడా సర్వే కోసం వచ్చారు. కోయిల్‌సాగర్ నుంచి తాగునీటిని పరిగికి తీసుకురావడంలో పీసీసీ కార్యదర్శి టీఆర్‌ఆర్  ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత అధికారులతో సర్వే సనులు చేయిస్తున్నారు.

 కోయిల్ సాగర్ నుంచి పగిడ్యాల్ వరకు సుమారు 38 కిలోమీటర్ల దూరం పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నారు. పగిడ్యాల్ ప్రాంతంలో నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి పరిగి నియోజకవర్గంలోని గండేడ్, కుల్కచర్ల, దోమ, పరిగి, పూడూరు మండలాలకు 3 ప్రత్యేక పైపులైన్‌ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు ఏడాదిలోగా పూర్తి కావచ్చని ఆయన తెలిపారు. అధికారులు కోయిల్ సాగర్ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న తాగునీటి పంపింగ్‌ను పరిశీలించారు.

 ఇక ప్రజల దాహార్తి సమస్య తీరినట్లే..
 పరిగి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యను తీర్చేందుకే 2007 నుంచీ.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖరరెడ్డి ద్వారా ప్రయత్నం కొనసాగించినట్లు పీసీసీ కార్యదర్శి టీఆర్‌ఆర్ గుర్తు చేశారు. పరిగి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కోయిల్ సాగర్ జలాలతో ఇక ఈ సమస్య తీరినట్లేనని టీఆర్‌ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 తాగునీరే కాకుండా పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు, రైల్వేలైన్, చేవెళ్ల ప్రాణహిత వంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ నర్సింలు గౌడ్, గండేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, కార్యదర్శి జితేందర్‌రెడ్డి,  నర్సింహారావు, గండేడ్, వెన్నాచేడ్ సర్పంచ్‌లు వెంకటయ్యగౌడ్, బోయిని గోపాల్, నాయకులు బాల్‌రెడ్డి, ఆశిరెడ్డి ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement