ప్రాజెక్టులపై చెరగని సంతకం.. వైఎస్
♦ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా,
♦ కోయల్‌సాగర్ ప్రాజెక్టుల పనుల్లో
♦ చాలా భాగం ఆయన హయాంలోనే...
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి బీళ్లుగా ఉండిపోయిన పాలమూరు జిల్లా భూములకు నీరందించి, సస్యశ్యామలం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలు ఇప్పుడు ఆ జిల్లా వాసులకు అందుతున్నాయి. కరువు రక్కసితో అల్లాడుతూ వలసబాట పట్టిన ఆ జిల్లా రైతుల ముఖంపై చిరునవ్వు వెల్లివిరియాలన్న వైఎస్ కలలు నేడు నిజాలవుతున్నాయి. జలయజ్ఞంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు) ప్రాజెక్టులను ఆయన హయాంలో చేపట్టారు. 7.8 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు.
వీటితోపాటు 3.9 టీఎంసీల సామర్థ్యంతో 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా కోయల్‌సాగర్ ప్రాజెక్టును చేపట్టారు. నిర్మాణం వేగంగా జరగాలన్న ఉద్దేశంతో భారీగా నిధులు ఇవ్వడంతో శరవేగంగా ఆ ప్రాజెక్టుల పనులు జరిగాయి. సుమారు రూ.5 వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం కొన్ని అవాంతరాలు వచ్చినా... ప్రస్తుత ఏడాదిలో ఆ పనులన్నీ కొలిక్కి వచ్చాయి. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల ఎకరాలు వృద్ధిలోకి రాగా.. ఈ ఏడాది పాత ఆయకట్టు కలుపుకొని 4.6 లక్షల ఎకరాలకు నీరందనుంది. ప్రస్తుతం కృష్ణా నుంచి జూరాలను చేరుతున్న వరద మరికొంత కాలం కొనసాగితే నెట్టెంపాడు కింద 1.5 లక్షల ఎకరాలు, కోయల్‌సాగర్ కింద 20 వేల ఎకరాలు, భీమా కింద 1.40 లక్షల ఎకరాలకు నీరందనుండగా... కృష్ణా నీరు శ్రీశైలాన్ని చేరితే కల్వకుర్తి కింద 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. ఇన్నాళ్లూ బీడుగా ఉన్న భూములకు వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులతో జలాభిషేకం జరుగుతోంది.