rural water supply scheme
-
‘వాటర్ గ్రిడ్’తో నీటి కష్టాలకు చెక్!
యాచారం: జిల్లాలో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వాటర్ గ్రిడ్ల ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వాట ర్ గ్రిడ్ అమలులో భాగంగా మొదట గ్రామా ల్లో జనాభాపై అధికారులు సర్వే చేస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం జనాభాతో పాటు 2050 వరకు వృద్ధిచెందే జనాభాకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ సర్వే చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ విజయలక్ష్మి ఆధ్వర్యంలో యాచారం, ఇబ్రహీంపట్నం, మంచా ల, హయత్‌నగర్ మండలాల ఏఈలు సర్వేలో నిమగ్నమయ్యారు. ప్రస్తుత జనాభా ఎంత.. 2050 వరకు ఏ మేరకు పెరుగుతుంది.. దీనికనుగుణంగా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తే నీటి సమస్య తీరుతుందనే విషయంలో ఏఈలు సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి నిత్యం 100 లీటర్లు.. ఆర్డబ్ల్యూఎస్ లెక్కల ప్రకారం పట్టణాల్లోని ఒక్కో వ్యక్తికి నిత్యం 135 లీటర్లు, గ్రామాల్లోని వ్యక్తికి 40 లీటర్ల నీరు అందించాలనే నింబంధన ఉంది. కానీ ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇందులో భాగంగానే గ్రామాల్లోని ప్రజలకు నిత్యం 100 లీటర్లు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం మనుషులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మూగజీవాల నీటి అవసరాలు, విద్యాలయాలు, పరిశ్రమలకు అవసరమయ్యే నీటి వినియోగంపైనా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 2011 లెక్కల ప్రకారం 4 లక్షల వరకు జనాభా ఉంటుందని లెక్కలు కట్టారు. ప్రస్తుతమున్న జనాభా మరో 30 ఏళ్లలో ఏ మేరకు పెరుగుతుందో.. అప్పుడు కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. ఏయే గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి...వాటికి ఏమేరకు నీటి కేటాయింపులు అవసరమనే అంశంపై సమగ్ర సర్వే జరుపుతున్నారు. సంపులు, ట్యాంకుల నిర్మాణాలపై దృష్టి.. ప్రస్తుతం గ్రామాల్లో లక్ష నుంచి రెండు లక్షల లీటర్ల మధ్యనే నీటి నిల్వ చేసుకునేలా ట్యాంకులు, సంపులు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి నిత్యం వంద లీటర్లు ఇవ్వడంతోపాటు ఇతర అవసరాల కోసం కూడా నీటి కేటాయింపులు జరపాల్సి ఉండడంతో కొత్తగా ఎక్కువ పరిమాణంలో ఉండే ట్యాంకులు, సంపుల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి సరఫరా అయ్యే కృష్ణాజలాలను గునుగల్ రిజర్వాయర్ నుంచి డివిజన్ ప్రజలకు అందిస్తున్నారు. జిల్లాలో నీటి అవసరాల దృష్ట్యా అక్కంపల్లి నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటిని తరలించేలా ఆలోచనలు చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా గ్రిడ్ల వల్ల ప్రజలకు సరిపడా తాగునీరు అందుతుంది వాస్తవమే కాని నీటి కేటాయింపులు ఎలాగా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాగర్‌లో నీటి నిల్వ తగ్గిపోతే.. ఎలాగా అనే విషయంలోనూ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. -
మళ్లీ వస్తా.. పనులు చూస్తా..
మోమిన్‌పేట: ఇంటింటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలి.. దీనికోసం ఎంత డబ్బు అవసరమవుతుందో చెప్పండి.. నిధులు విడుదల చేస్తాం.. కానీ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) ఏఈని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రశ్నించారు. నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఏఈ సమాధానమివ్వడంతో.. మళ్లీ వస్తానని.. పనులను చూస్తానని కలెక్టర్ అన్నారు. సోమవారం మండలంలోని వెల్చాల్ గ్రామంలో నిర్వహించిన ‘మన ఊరు- మన గ్రామం’ గ్రామసభలో అధికారులతో శాఖలవారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటి కీ కుళాయి ద్వారా తాగునీటిని అందించేందుకు అదనంగా రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. చెత్తను సేకరించి గ్రామం బయట వేసేందుకు డంపింగ్‌యార్డును గుర్తించాలని తహసీల్దార్ రవీందర్‌ను ఆయన ఆదేశించారు. ప్రతీ కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వం అందుకు తగిన నిధులు ఇస్తుందన్నారు. ఉన్నత పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదుల కోసం స్థలం, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రాధానోపాధ్యాయుడు ప్రభు కోరగా... మౌలిక వసతులు కల్పిస్తాం.. కానీ 10వ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. నిరుద్యోగ యువకులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణనిప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐకేపీ ఏపీఎం రాజును కలెక్టర్ ఆదేశించారు. మహిళా సంఘాలు బ్యాంకులో తీసుకొంటున్న రుణాలతో యూనిట్లు పెట్టుకొవాలని ఆయన సూచించారు. గ్రామంలోని గర్భిణులు ఆస్పత్రుల్లోనే కాన్పులు చేసుకునేలా ఏఎన్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ నిఖిత, వైస్ ఎంపీపీ అమరేందర్‌రెడ్డి, సబ్ కలెక్టరు ఆమ్రపాలి, మండల ప్రత్యేకాధికారి రమణారెడ్డి, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు బిపాషా, ఎంపీడీఓ కె.సువిధ, వ్యసాయాధికారి నీరజ, డిప్యూటీ తహసీల్దార్ దీపక్, ఏపీఓ అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లయ్య, మాజీ సర్పంచులు విఠల్, ఇబ్రహీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘కోయిల్‌సాగర్’ పనులు వేగవంతం
గండేడ్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్ నుంచిపరిగి నియోజకవర్గానికి తాగునీటిని తీసుకువచ్చేందుకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు, పీసీసీ కార్యదర్శి టి. రామ్మోహన్‌రెడ్డి రూట్ సర్వే చేశారు. పరిగి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.150 కోట్లతో పనులు చేపట్టేందుకు జీఓను విడుదల చేసింది. మొదటి విడతగా రూ.50 లక్షలతో అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. సోమవారం గండేడ్ మండలం పగిడ్యాల్ ప్రాంతం నుంచి కోయిల్ సాగర్ వరకు లిఫ్ట్ పద్ధతిన పైపులైన్ ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేపట్టారు. పనులు చేసేందుకు టెండర్లు తీసుకున్న జేసీఏ కంపెనీ అధికారులు కూడా సర్వే కోసం వచ్చారు. కోయిల్‌సాగర్ నుంచి తాగునీటిని పరిగికి తీసుకురావడంలో పీసీసీ కార్యదర్శి టీఆర్ఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత అధికారులతో సర్వే సనులు చేయిస్తున్నారు. కోయిల్ సాగర్ నుంచి పగిడ్యాల్ వరకు సుమారు 38 కిలోమీటర్ల దూరం పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నారు. పగిడ్యాల్ ప్రాంతంలో నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి పరిగి నియోజకవర్గంలోని గండేడ్, కుల్కచర్ల, దోమ, పరిగి, పూడూరు మండలాలకు 3 ప్రత్యేక పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు ఏడాదిలోగా పూర్తి కావచ్చని ఆయన తెలిపారు. అధికారులు కోయిల్ సాగర్ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న తాగునీటి పంపింగ్‌ను పరిశీలించారు. ఇక ప్రజల దాహార్తి సమస్య తీరినట్లే.. పరిగి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యను తీర్చేందుకే 2007 నుంచీ.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖరరెడ్డి ద్వారా ప్రయత్నం కొనసాగించినట్లు పీసీసీ కార్యదర్శి టీఆర్ఆర్ గుర్తు చేశారు. పరిగి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కోయిల్ సాగర్ జలాలతో ఇక ఈ సమస్య తీరినట్లేనని టీఆర్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాగునీరే కాకుండా పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు, రైల్వేలైన్, చేవెళ్ల ప్రాణహిత వంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ నర్సింలు గౌడ్, గండేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, కార్యదర్శి జితేందర్‌రెడ్డి, నర్సింహారావు, గండేడ్, వెన్నాచేడ్ సర్పంచ్‌లు వెంకటయ్యగౌడ్, బోయిని గోపాల్, నాయకులు బాల్‌రెడ్డి, ఆశిరెడ్డి ఉన్నారు.