యాచారం: జిల్లాలో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వాటర్ గ్రిడ్‌ల ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వాట ర్ గ్రిడ్ అమలులో భాగంగా మొదట గ్రామా ల్లో జనాభాపై అధికారులు సర్వే చేస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం జనాభాతో పాటు 2050 వరకు వృద్ధిచెందే జనాభాకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు ఈ సర్వే చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం డివిజన్ ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ విజయలక్ష్మి ఆధ్వర్యంలో యాచారం, ఇబ్రహీంపట్నం, మంచా ల, హయత్‌నగర్ మండలాల ఏఈలు సర్వేలో నిమగ్నమయ్యారు. ప్రస్తుత జనాభా ఎంత.. 2050 వరకు ఏ మేరకు పెరుగుతుంది.. దీనికనుగుణంగా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తే నీటి సమస్య తీరుతుందనే విషయంలో ఏఈలు సమాచారం సేకరిస్తున్నారు.
ఒక్కో వ్యక్తికి నిత్యం 100 లీటర్లు..
ఆర్‌డబ్ల్యూఎస్ లెక్కల ప్రకారం పట్టణాల్లోని ఒక్కో వ్యక్తికి నిత్యం 135 లీటర్లు, గ్రామాల్లోని వ్యక్తికి 40 లీటర్ల నీరు అందించాలనే నింబంధన ఉంది. కానీ ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇందులో భాగంగానే గ్రామాల్లోని ప్రజలకు నిత్యం 100 లీటర్లు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం మనుషులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మూగజీవాల నీటి అవసరాలు, విద్యాలయాలు, పరిశ్రమలకు అవసరమయ్యే నీటి వినియోగంపైనా దృష్టి సారించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 2011 లెక్కల ప్రకారం 4 లక్షల వరకు జనాభా ఉంటుందని లెక్కలు కట్టారు. ప్రస్తుతమున్న జనాభా మరో 30 ఏళ్లలో ఏ మేరకు పెరుగుతుందో.. అప్పుడు కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. ఏయే గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి...వాటికి ఏమేరకు నీటి కేటాయింపులు అవసరమనే అంశంపై సమగ్ర సర్వే జరుపుతున్నారు.
సంపులు, ట్యాంకుల నిర్మాణాలపై దృష్టి..
ప్రస్తుతం గ్రామాల్లో లక్ష నుంచి రెండు లక్షల లీటర్ల మధ్యనే నీటి నిల్వ చేసుకునేలా ట్యాంకులు, సంపులు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి నిత్యం వంద లీటర్లు ఇవ్వడంతోపాటు ఇతర అవసరాల కోసం కూడా నీటి కేటాయింపులు జరపాల్సి ఉండడంతో కొత్తగా ఎక్కువ పరిమాణంలో ఉండే ట్యాంకులు, సంపుల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి సరఫరా అయ్యే కృష్ణాజలాలను గునుగల్ రిజర్వాయర్ నుంచి డివిజన్ ప్రజలకు అందిస్తున్నారు. జిల్లాలో నీటి అవసరాల దృష్ట్యా అక్కంపల్లి నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటిని తరలించేలా ఆలోచనలు చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా గ్రిడ్‌ల వల్ల ప్రజలకు సరిపడా తాగునీరు అందుతుంది వాస్తవమే కాని నీటి కేటాయింపులు ఎలాగా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాగర్‌లో నీటి నిల్వ తగ్గిపోతే.. ఎలాగా అనే విషయంలోనూ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
‘వాటర్ గ్రిడ్’తో నీటి కష్టాలకు చెక్!
Published Tue, Sep 16 2014 11:58 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement