జిల్లాకు జలకళ
{పాజెక్టులు, రిజర్వాయర్లు, నదుల అనుసంధానం
తాగునీటికి 18 టీఎంసీల నీరు
రూ.8 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌కు తాజా ప్రతిపాదనలు
జిల్లాకు తాగునీటి కష్టాలు తీరనున్నాయా? నదులు, రిజర్వాయర్లు అనుసంధానం చేస్తున్నారా? పడమటి మండలాలకు కూడా తాగునీరు అందించే దిశగా అడుగులేస్తున్నారా? తాగునీటితోపాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన 18 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందా?.. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలో నీటి సమస్య తీర్చేందుకు అధికారులు క సరత్తు చేస్తున్నారు. కిరణ్ ప్రభుత్వ హయాంలో 7,200 కోట్లతో ఈ పథకానికి శంకుస్థాపన చేస్తే ప్రస్తుతం ఈ వ్యయం రూ.8 వేల కోట్లకు చేరింది.
తిరుపతి సిటీ: చిత్తూరు జిల్లాలో శాశ్వత మంచినీటి పథకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజర్వాయర్లు, నదులు, చెరువులు అనుసంధానం చేసేం దుకు తెలుగుగంగ, ఇరిగేషన్ అధికారులతో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా దాహార్తికి, ఇతర అవసరాలకు కావాల్సిన నీళ్లను ఎలా సమకూర్చుకోవాలనే దానిపై అభిప్రాయసేకరణ చేస్తున్నారు. జిల్లాలోని తెలుగుగంగ, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను ఒకే వేదికమీదకు తీసుకురావడంతో పాటు జిల్లాలోని కల్యాణి రిజర్వాయర్, కాళంగి రిజర్వాయర్, అరణియార్, బహుదా ప్రాజక్టు, పింఛా ప్రాజెక్టు, పెద్దేరు, ఉబ్బలమడుగు, మల్లిమడుగు ప్రాజెక్టులను కూడా ఇందు లో చేర్చుతున్నారు. వీటితో పాటు అతిపెద్ద ఆయకట్టు ఉన్న తొండమనాడు, కందుకూరు వ్యాసరాయ చెరువులను కూడా అనుసంధానంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. త ద్వారా జిల్లాకు అవసరమైన నీటిని అందించాలనే లక్ష్యంతోనే ఈపథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. నీటిని ఈ రిజర్వాయర్లకు తీసుకొచ్చి పైపుల ద్వారా అన్ని గ్రామాలకు పంపింగ్ చేయాలని భావిస్తున్నారు.
తాగేందుకు గుక్కెడు నీరూ కరువే..
మూడేళ్లుగా జిల్లాలో సరైన వర్షపాతం నమోదు కావ డం లేదు. ముఖ్యంగా వేసవిలో అయితే పరిస్థితి దా రుణంగా ఉంటోంది. పడమటి మండలాల్లో కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. ఇక తిరుపతి విషయానికి వస్తే కల్యాణి డ్యాంలో నీరు ఎప్పుడూ డెడ్ స్టోరేజీలోనే ఉంది. తిరుపతి తాగునీటి అవసరాలకు ఎక్కువ భాగం తెలుగుగంగ మీదనే ఆధారపడాల్సి వస్తోంది. ఎన్‌టీఆర్ జలాశయానికి నీటిని పంపింగ్ చేసి చిత్తూరు ప్రాంతానికి నీటిని ఇవ్వాలని ప్రతిపాదించారు.
సాగుకూ కష్టమే..
ఇక వ్యవసాయ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తూర్పు మండలాల్లో కాస్తోకూస్తో భూగ ర్భ జలాలు ఉన్నాయి. పడమటి మండలాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ప్రజలు ఊళ్లు వదిలి పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చే పనిలో పడింది. అందుకోసం ఇరిగేషన్, ప్రాజెక్టుల అధికారులను ప్రణాళికలు తయారుచేసేందుకు పురమాయిం చింది. జిల్లాకు తాగునీరుతో పాటు, సాగుకు, పరిశ్రమలకు సంవత్సరానికి ఎంత నీరు అవసరమవుతుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావ్, జిల్లామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా యుద్ధప్రాతిపదికన పనులు డిజైన్స్ తయారు చేయాలని అదేశించినట్లు అధికారులు చెప్పారు.
పెరుగుతున్న అంచనా వ్యయం
కిరణ్ హయాంలోనే జిల్లా తాగునీటి శాశ్వత పరిష్కానికి పురుడు పోసుకుంది. అన్ని ప్రాంతాలకు తాగునీటి అవసరాల నిమిత్తం రూ.7,200 కోట్లు కేటాయించారు. అయితే ఆ ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను తెరపైకి తెచ్చింది. కండలేరు నుంచి డెరైక్టుగా నీళ్లను ప్రాజెక్టుల్లోకి తీసుకొచ్చి తద్వారా పట్టణాలకు, గ్రామాలకు అందించాలనే లక్ష్యంతో ఉంది. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.8 వేలకోట్లు ఖర్చవుతాయని భావి స్తోంది. గతంతో పోల్చితే దాదాపు రూ.800 కోట్లు అంచనా వ్యయం పెరిగినట్లు తెలుస్తోంది.
నివేదికలు ఇచ్చాం..
జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన నివేదికలు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుగుగంగ ఎస్‌సీ సుబ్బారావు మంగళవారం ‘సాక్షి’కి వివరించారు. వాటర్‌గ్రిడ్ రాష్ట్ర కన్సల్టెంట్ కొండలరావ్ దీనిపై పూర్తి నివేదిక తీసుకొన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తరువాత ప్రాజెక్టు వివరాలు ప్రకటిస్తామని అన్నారు.