Difficulties in drinking water
-
సుంకేసుల నుంచి నిలిచిన నీటి విడుదల
నంద్యాలకు తప్పని తాగునీటి కష్టాలు నంద్యాల: సుంకేసుల రిజర్వాయర్ నుంచి నంద్యాలకు నీటి విడుదల నిలిచిపోయింది. గత వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నెల 9వ తేదీన సుంకేసుల డ్యాం వద్ద 500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ నీటితో పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు గట్టెక్కుతాయని చైర్పర్సన్ దేశం సులోచన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. నీటిని విడుదల చేసిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే 9వ తేదీ విడుదల చేసిన నీరు 13వ తేదీ సాయంత్రం నంద్యాలకు చేరింది. ఈ నీటిలో చిన్న చెరువును సగం నింపారు. పాత, కొత్త ఎస్ఎస్ ట్యాంకులను నింపడానికి అధికారులు ఏర్పాటు చేస్తుండగా.. సుంకేసుల నుంచి నీటి సరఫరాను నిలిపి వేశారు. సుంకేసులకు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో నీటి విడుదలను నిలిపి వేశారని డీఈ షాకీర్ హుసేన్ తెలిపారు. ప్రస్తుత ం నంద్యాలలోని పాత, కొత్త ఎస్ఎస్ ట్యాంకుల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరింది. వీటికి నీరు చేరకుంటే నంద్యాల ప్రజలు దాహం తో అల్లాడాల్సిందే. విభేదాల కారణంగా స్థానిక టీడీపీ నేతలు ప్ర‘జల’ కష్టాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
డెడ్ స్టోరేజీ !
అడుగంటిన జలాశయాలు రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు తక్కువ వర్షపాతంతో తగ్గిన భూగర్భ జలాలు బెంగళూరు: రాష్ట్రంలో జలాశయాలు అడుగంటాయి. ఎప్పుడూ లేనంతగా కృష్ణ, కావేరి నది పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో డెడ్ స్టోరేజీ కంటే నీటి మట్టం కిందకు పడిపోయింది. దీంతో ఈసారి బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటిని ఎలా సరఫరా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధానంగా పదమూడు జలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారానే రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలకు తాగు, సాగునీటిని వదలుతారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో రెండు వ్యవసాయ సీజన్లు అయిన ఖరీఫ్, రబీలో 17 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. అంతేకాకుండా రాష్ట్రంలో అంతకు ముందు గత రెండేళ్లు కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో రాష్ట్రంలోని నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. కృష్ణ నదీపరివాహక జలాశయాలైన భద్ర, ఘటప్రభ, మలప్రభ, అల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయమై కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ (కేఎస్‌ఎన్‌డీఎంసీ) డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కావేరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కేఆర్ఎస్ వంటి జలాశయాల్లో డెడ్ స్టోరేజీ కంటే తక్కువకు నీటి మట్టం పడిపోవడం గమనించాం. అయితే కృష్ణ పరివాహక ప్రాంతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఈ ఏడాది మాత్రం కావేరితో పాటు కృష్ణ నదీపరివాహక ప్రాంతంలోని జలాశయాలు కూడా డెడ్‌స్టోరేజీ కంటే దిగువన నీటి మట్టాన్ని కలిగి ఉన్నాయి.’ అని పేర్కొన్నారు. ఇక బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చే కే.ఆర్.ఎస్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 49.45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.31 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి (ఏప్రిల్-11) కేఆర్‌ఎస్‌లో 11.59 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దీంతో ఈ వేసవిలో తాగు నీటి కోసం ఎప్పుడూ లేనంతగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. -
గ్రేటర్‌కు నీళ్ల గండం
అడుగంటుతున్న జలాశయాలు మేల్కొనకపోతే తిప్పలే {పజా ప్రతినిధులపైనే బాధ్యత వరంగల్ : వరంగల్ నగర ప్రజలకు తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ముందుచూపు లేని ప్రజాప్రతినిధులు, దీర్ఘకాలిక ప్రణాళికలు లేని అధికార యంత్రాంగం వైఖరితో గ్రేటర్ వరంగల్ ప్రజలు వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. ఫిబ్రవరిలోనే మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇదే స్థాయిలో ఎండలు పెరిగితే మే, జూన్ నెలల్లో నీటి సరఫరా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనచెందుతున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌కు నీటి సరఫరా చేసే జలాశయాలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు జూలై వరకు వర్షాలు కురిసే పరిస్థితి లేదని వాతావరణ అంచనా నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చే వరకు గ్రేటర్ వరంగల్ ప్రజల నీటి అవసరాలు తీర్చే విషయంలో ప్రజాప్రతినిధులు ఆశించిన మేరకు చొరవ తీసుకోవడం లేదు. మహా నగరర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియడం లేదు. గ్రేటర్ వరంగల్ జనాభా తొమ్మిది లక్షలు కాగా, ప్రతిరోజూ నగరానికి వచ్చిపోయే వారితో కలిపితే సగటున పది లక్షల జనాభా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 160 లీటర్ల నీరు అవసరం. హైదరాబాద్ మహానగరంలో ఇదే తరహాలో నీటి సరఫరా చేస్తున్నారు. వరంగల్ నగరంలో మూడు రోజులకోసారి 90 లీటర్లే సరఫరా చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 75,446 నల్లా కనెక్షన్లు, 2067 చేతిపంపులు, 34 వాటర్ ట్యాంకర్లు ఉన్నా యి. నగర ప్రజలకు 365 రోజులు తాగునీరు ఇవ్వాలంటే నాలుగు టీఎంసీల నీరు అవసరం. వేసవిలో వరంగల్ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ధర్మసాగర్, వడ్డేపల్లి, భధ్రకాళి జలాశయాల నుంచి ఒకటిన్నర టీఎంసీల నీరే లభ్యమవుతోంది. మరో రెండున్నర టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉండాల్సిన అవసరం ఉంది. వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు దేవాదుల, లోయర్ మానేరు ప్రాజెక్టు(ఎల్ఎండీ)లే ప్రధాన వనరులుగా ఉన్నాయి. వర్షాభావంతో దేవాదులలో నీటిని పంపింగ్ చేసే పరిస్థితి లేకపోగా, కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలోనూ నీటి నిల్వ లేదు. ప్రత్యామ్నాయంగా చలివాగు, భీం ఘన్పూర్ జలాశయాల నుంచి నీటిని వరంగల్‌కు తరలించాలని జీడబ్ల్యూఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇదే చేస్తే రెండు జలాశయాల కింద ఆయకట్టు రైతులు ఆందోళనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులను గట్టిక్కించే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మసాగర్, వడ్డేపల్లి, భద్రకాళి జలాశయాల్లో 430 మిలియన్ క్యూబిక్ ఫీట్(ఎంసీఎఫ్‌టీ)ల నీటి నిల్వలున్నాయి. తాగునీటి సరఫరా ప్రక్రియలో భాగంగా మూడు ఫిల్టర్ బెడ్లతో ప్రస్తుతం 3.5 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి శుద్ధి జరుగుతోంది. 123 రోజుల వరకు అంటే జూన్ 13వరకు నీటి సరఫరా చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరిగి తే ఆలోపే నీళ్లు పూర్తిగా అయిపోతాయి. అధికారులు చెప్పిన గడువు వరకు వ ర్షాలు రాకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఈ కష్టాలను అధిగంచేం దుకు భీంఘన్‌పూర్, చలివాగు జలాశయాలను వినియోగించుకోవాలని అధికారు లు సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలు చేయడం సవాల్‌గా మారనుంది. అదృశ్యమైన బాలిక తల్లికి అప్పగింత గూడూరు : ఈనెల 4న అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని బోడ సరితను గురువారం తహశీల్దార్ లక్ష్మి ముందు హాజరుపరిచి, తల్లి జమ్కు అప్పగించినట్లు ఎస్సై వై. సతీష్ తెలిపారు. మండలంలోని చిన్నఎల్లాపురం శివారు కోబల్తండాకు చెందిన సరిత ఇంటి నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. సంగెం మండలం తీగరాజ్పల్లికి చెందిన బాలిక పెద్దమ్మ అమ్కు గురువారం సరితతో పీఎస్‌కు వచ్చింది. తన ఇం టికి వచ్చిన సరిత ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నందున ఇక్కడే ఉంటానని చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను తల్లికి అప్పగించారు. -
సారు... ఎండుతోంది నోరు
పట్టణాల్లో మొదలైన తాగునీటి కష్టాలు నీరున్నా.. నిర్వహణపైదృష్టి పెట్టని అధికారులు ప్రైవేటు ట్యాంకర్లే దిక్కు జిల్లాలోని పట్టణాలు, నగరాలను తాగునీటి సమస్య వేధిస్తోంది. అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వనరులను సక్రమంగా వినియోగించుకోకపోవడంతో నీరున్నా.. నిర్వహణ సరిగా లేక ప్రజలు అష్టకష్టాలుపడుతున్నారు. నీటి ట్యాంకర్లు వచ్చే వరకు రాత్రనకా.. పగలనకా గంటల తరబడి జనం ఎదురు చూస్తున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పలమనేరు,పుంగనూరు పట్టణాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. సారూ.. ఎండుతోంది నోరు.. అంటూ జనం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తిరుపతి: ‘‘ జిల్లావాసులకు ఇకపై నీటి క ష్టాలు ఉండువు.. ముఖ్యంగా తిరుపతి నగరప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తాం’’ ఇదీ.. గతేడాది వర్షాలకు కల్యాణీ డ్యామ్ గేట్లు ఎత్తివేసే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ. అయితే నెలలు గడుస్తున్నా.. జిల్లా ప్రజల తాగునీటి అవస్థలు ఏమాత్రం తీరడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యం కారణంగా పుష్కలంగా నీరున్నా.. సక్రమ నిర్వహణ లేక ప్రజల గొంతు తడారిపోతోంది. ప్రధానంగా తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో నీటికష్టాలు తప్పడం లేదు. కొన్ని కాలనీల్లో అంతర్గత పైపులైన్లు, ఎలివేటర్ సర్వీస్ రిజర్వాయర్లు లేకపోవడంతో నీటిని రెండు, మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. తిరుపతి నగర పరిధిలోని, ఎంఆర్‌పల్లి, రాజీవ్‌నగర్, తిమ్మాయనల్లె ప్రాంతాలకు మూడు రోజులకొక సారి కూడా నీరు రావడంలేదు. నీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుంటే వేసవిలో సమస్య తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతిలో.. మొత్తం జనాభా 4,19,000 నగరానికి రోజు వచ్చి పోయే జనాభా సగటున 50,000 మొత్తం జనాభా 4,69,000 ప్రతిరోజూ అవసరమ్యే నీరు 63.32 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్డే) ప్రస్తుతం రోజు విడుదల చేస్తున్న నీరు 42-46 ఎంఎల్డీ అన్ని రకాల జలాశయాల నుంచి రోజుకు అందుబాటులో ఉండే నీరు 88 ఎంఎల్డీ మదనపల్లెలో.. జనాభా 1.75 లక్షలు ప్రతిరోజూ సరఫరా కోసం అవసరమయ్యే నీరు 18.3 ఎంఎల్డీ ప్రస్తుతం రోజూకు సరఫరా అవుతున్న నీరు 6.5 ఎంఎల్డీ మదనపల్లెలోని 35 వార్డుల్లో ఇప్పటికీ మూడు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. అది కూడా కేవలం 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో మదనపల్లె వాసుల దాహార్తి తీరడం లేదు. ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. ప్రయివేటు వ్యాపారుల నీటి విక్రయాలు రూ. కోట్లలో సాగుతోంది. పలమనేరులో... జనాభా 50,000 రోజూ సరఫరా కోసం అవసరమయ్యే నీరు 4.25 ఎంఎల్డీ ప్రస్తుతం సరఫరా అవుతున్న నీరు 3.75 ఎంఎల్డీ కొన్ని ప్రాంతాలకు మూడు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. చాలాచోట్ల ట్యాంకర్లే దిక్కు అవుతున్నాయి. కౌండిన్య జలాశయంలో పట్టణానికి సరిపడా నీరు ఉన్నప్పటికీ అవి కలుషితం కావడంతో ఉవయోగించుకోక పోవడం వల్లే నీటి సమస్య తలెత్తుతోంది. -
నిధులూ తాగేస్తున్నారు
- తమ్ముళ్ల కోసమే తాగునీటి సరఫరా - వర్షాలొచ్చినా ఆగని వైనం - మేలో తాగునీటి సరఫరాకు రూ.6.57 కోట్ల ఖర్చు - నోరుమెదపని అధికారులు నీళ్లులేక నోళ్లు ఎండుతున్నా పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు వర్షాలు పడుతున్నా తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకు తెగ ఆరాటపడిపోతున్నారు. రికార్డుల్లో ట్యాంకర్ల మీద..ట్యాంకర్లు రాసేస్తూ.. వచ్చిన నిధుల్ని వారి జేబులకే మళ్లించేస్తున్నారు. ఇదే అదునుగా అధికార పార్టీ నాయకులు కొందరు తాగునీటి నిధుల్నీ గడగడా తాగేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వ నీటిసరఫరా పేరుతో జనం నోర్లు కొట్టి పచ్చచొక్కానేతల జేబులు నింపుతున్నారు. ఇదే అదనుగా కొందరు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా దండుకుంటున్నారు. ప్రశ్నించే ద మ్ము.. ఎదురు తిరిగే అధికారులు లేకపోగా కొందరు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. వర్షాలొచ్చినా నీళ్ల సరఫరా ఆగదే వర్షాకాలం వచ్చింది.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు కొంత పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తగ్గు ముఖం పట్టింది. అయినా సరే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వపరంగా తాగునీటి సరఫరా రోజురోజుకూ పెరుగుతోంది. ఖర్చూ తడిసిమోపుడవుతోంది. గ్రామాలకు మొక్కుబడిగా నీళ్లు తోలుతూ తమ్ముళ్లు తాగునీటి నిధుల్ని తాగేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గ్రామాలకు నీళ్లు తోలకనే అధికారులతో లాలూచీపడి నిధులు బొక్కేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎంత ఖర్చుచేశారంటే జనవరి నుంచి ఇప్పటివరకు తాగునీటి సరఫరాకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే జనం నీళ్లు తాగాల్సిందే. జనవరిలో 1,317 గ్రామాలకు నీటిసరఫరా కోసం రూ.2,48,16,432 కోట్లు, ఫిబ్రవరిలో 1,697 గ్రామాలకు రూ.2,64,78,963 కోట్లు, మార్చిలో 2,096 గ్రామాలకు రూ.6,17,53,239 కోట్లు, ఏప్రిల్‌లో 2,560 గ్రామాలకు రూ.6.52 కోట్లు, మేలో 2610 గ్రామాలకు రూ.6.57 కోట్లు ఖర్చుచేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా జనవరి నుంచి మే వరకు రూ.23,21,48,334 ఖర్చుచేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌తో కలుపుకుంటే దాదాపు ఆరు నెలల్లో రూ.30 కోట్లు వెచ్చించినట్లు అధికారులు చెబుతున్నారు. అంతా నీళ్ల మాయే? జీపీఎస్ ద్వారా నీటిసరఫరా చేస్తున్నామని అధికారులు మసిపూసి మరేడుకాయ చేస్తున్నట్లు తెలుస్తోంది. నీళ్లు తోలకుండానే తెలుగుతమ్ముళ్లు నిధులు బొక్కుతున్నార ని తేటతెల్లమవుతోంది. ఈమేరకు జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు పలుమార్లు ధ్వజమెత్తడం ఈ అవినీతి భాగోతానికి నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా వర్షాలు కురుస్తున్నా నీటి సరఫరా తగ్గకపోవడం వారి వాదనలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. చాలినంత వర్షం కురిసినా.. నాలుగేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జిల్లాలో మార్చి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. మార్చిలో సాధారణ వర్షపాతం 7.7 మి.మీ కాగా 25.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏప్రిల్‌లో సాధారణ వర్షపాతం 17.6 మి.మీకాగా 90.3 మి.మీ కురిసింది. మే నెలలో 61.7కు గాను 55.9 మి.మీ, జూన్‌లో 78.7కు గాను ఇప్పటి వరకు 73.9 మి.మీ వర్షం కురిసింది. మొత్తంగా నాలుగు నెలల్లో 165.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 245.4 మి.మీ వర్షం కురిసింది. తాగునీటి సరఫరా విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా వారి నుంచి సమాధానం కరువైంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వరదలా ప్రవహిస్తున్న తాగునీటి సరఫరా అక్రమాలకు తెరదించాలని పలువురు కోరుతున్నారు. -
బిరబిరా కృష్ణమ్మ..
గ్రేటర్ లో తాగునీటి కష్టాలకు చెక్ మూడు పథకాలకు సీఎం పచ్చజెండా పాలమూరు, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచితరలింపు జంట జలాశయాలకు కొత్త కళ సిటీబ్యూరో: గ్రేటర్ నగరాన్నితాగునీటి కష్టాల నుంచి ఒడ్డున పడేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. భవిష్యత్‌లో తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు మరో మూడు కీలక మంచినీటి పథకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, శ్రీశైలం బ్యాక్‌వాటర్ ప్రాజెక్టుల నుంచి 20 టీఎంసీల వంతున దశల వారీగా రప్పించి... నగర దాహార్తిని సమూలంగా తీర్చేందుకు చర్యలు చేపట్టాలని జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. నగరానికి అదనంగా తరలించనున్న నీటితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు ఏడాది పొడవునా కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఇక సుంకిశాల (నల్లగొండ జిల్లా) వద్ద కృష్ణా హెడ్‌వర్క్స్ పనుల్లో భాగంగా మూడు భారీ జాక్‌వెల్స్‌ను నిర్మించి... 16.5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. తద్వారా నాగార్జున సాగర్ జలాశయంలో వేసవిలో డెడ్‌స్టోరేజికి నీటిమట్టం చేరుకున్నప్పటికీ నగర తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మూడు పథకాలకు అంచనాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, సాధ్యాసాధ్యాలపై వేర్వేరుగా నివేదికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. శివారు కష్టాలకు స్వస్తి ఈ మూడు పథకాలు పూర్తయిన పక్షంలో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల దాహార్తి సమూలంగా తీరే అవకాశాలుంటాయని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో జలమండలి నిత్యం 385 ఎంజీడీల జలాలను సరఫరా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరుకుపూర్తి కానున్న గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ద్వారా 172 ఎంజీడీలు, కృష్ణా మూడో దశ- ఫేజ్-2 ద్వారా మరో 45 ఎంజీడీలు సిటీకి తరలిరానున్న విషయం విదితమే. నగరానికి తరలించనున్న అదనపు నీటిని సిటీ నలుమూలలకు, శివారు ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అవసరమైన పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లను రూ.4000 కోట్ల అంచనాతో యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
తాగునీటి కోసం విలవిల
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు మందమర్రి రూరల్ : కాలం ఏదైనా వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీవాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వేసవికాలం రాగానే ఇక్కడి పరిస్థితి మరింత జటిలంగా మారుతుంది. గోంతు తడుపుకునేందుకు గుక్కేడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కాలనీలో మొత్తం 500 జనాభా ఉండగా, మంచినీటి పథకం కింద ఒక్క బోరు, నాలుగు చేతిపంపులు ఉన్నాయి. బోరు మోటారు కాలిపోయి ఇప్పటికీ 10 రోజులు గడస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాలుగు చేతిపంపుల్లో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. దీనితో తాగునీటికి కాలనీవాసులు విలవిలలాడుతున్నారు. మం డు టెండలో బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవ డం నరకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మరో వారం రోజులు గడిస్తే ఉన్న ఆ రెం డు చేతి పంపులు కూడా పని చేయని పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికే వచ్చే చిన్నదారతో కడువేడు నీరు నిండక చేతిపంపుల వద్ద పడిగాపులు కాయూల్సి వస్తుందని ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సమీపంలో చెరువుగానీ, చెలిమలు గానీ లేకపోవడంతో నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామన్నారు. అధికారుల నిర్లక్ష్యమే తాగునీటి ఎద్దడికి ప్రధాన కారణం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, విద్యుత్ అధికారుల సమన్వయలోపంతో వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీవాసులు నీటికష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది తాగునీటి ఎద్దడిని నివారించేందుకు వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ నిధులతో 30 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న మూడు నీటి ట్యాంక్‌లను నిర్మించారు. ఒక్కోక్క ట్యాంక్‌కు రూ 18.50 లక్షలు ఖర్చు చేశారు. అవి ఇప్పటీకి వినియోగంలోకి రాలేదు. ట్యాంక్‌ల నిర్మాణం పూర్తరుుంది. భూగర్భపైపు లైన్లు వేశారు. కేవలం విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో నూతనంగా నిర్మించిన నీటి ట్యాంక్‌లు నిరుపయోగంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుగానే ఆదేశాలు జారీ చేసినా అవి ఫలించకపోవడం దురదుష్టకరం. ఇలా జరిగింది... ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఫిబ్రవరి 27, 2015 తేదీన విద్యుత్ శాఖకు రూ3,69 లక్షలు చెల్లించారు. కాగా వీరు డెలప్మెంట్ సెక్యూరిటీ పేరా చెల్లించాల్సిన బిల్లులను విద్యుత్ సర్వీస్ చార్జీల కింద చెల్లించారు. అప్పటీకే ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు విద్యుత్ బకాయిలు ఉండడంతో విద్యుత్ అధికారులు సర్వీస్ చార్జీల కింద బిల్లులు జమకట్టుకున్నారు. దీంతో ఈ మూడు ట్యాంక్‌లకు కరెంటు కనెక్షన్లు నిలిచిపోయాయి. ఇప్పుడు రూ. 3.69 లక్షలు తిరిగి చెల్లిస్తే తప్ప కరెంటు కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. సర్వీస్ బిల్లుల నుంచి కనెక్షన్ బిల్లులోకి మార్చుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దరఖాస్తు చేసినా, విద్యుత్ అధికారులు దానికి ససేమిరా అంటున్నారు. ఈ రెండుశాఖల సమన్వయలోపంతో ఎండాకాలం వెంకటాపూర్ ప్రజల గొంతు తడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరమైన నీటి సమస్య తీరుతుందనుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో నీటి కటకట తప్పడం లేదు. వెంటనే ట్యాంకర్లకు కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని, కాలిపోయిన బోరు, చేతిపంపులను మరమ్మతును వేగవంతగా చేసి తాగునీటి సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. -
జిల్లాకు జలకళ
{పాజెక్టులు, రిజర్వాయర్లు, నదుల అనుసంధానం తాగునీటికి 18 టీఎంసీల నీరు రూ.8 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌కు తాజా ప్రతిపాదనలు జిల్లాకు తాగునీటి కష్టాలు తీరనున్నాయా? నదులు, రిజర్వాయర్లు అనుసంధానం చేస్తున్నారా? పడమటి మండలాలకు కూడా తాగునీరు అందించే దిశగా అడుగులేస్తున్నారా? తాగునీటితోపాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన 18 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందా?.. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలో నీటి సమస్య తీర్చేందుకు అధికారులు క సరత్తు చేస్తున్నారు. కిరణ్ ప్రభుత్వ హయాంలో 7,200 కోట్లతో ఈ పథకానికి శంకుస్థాపన చేస్తే ప్రస్తుతం ఈ వ్యయం రూ.8 వేల కోట్లకు చేరింది. తిరుపతి సిటీ: చిత్తూరు జిల్లాలో శాశ్వత మంచినీటి పథకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజర్వాయర్లు, నదులు, చెరువులు అనుసంధానం చేసేం దుకు తెలుగుగంగ, ఇరిగేషన్ అధికారులతో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా దాహార్తికి, ఇతర అవసరాలకు కావాల్సిన నీళ్లను ఎలా సమకూర్చుకోవాలనే దానిపై అభిప్రాయసేకరణ చేస్తున్నారు. జిల్లాలోని తెలుగుగంగ, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను ఒకే వేదికమీదకు తీసుకురావడంతో పాటు జిల్లాలోని కల్యాణి రిజర్వాయర్, కాళంగి రిజర్వాయర్, అరణియార్, బహుదా ప్రాజక్టు, పింఛా ప్రాజెక్టు, పెద్దేరు, ఉబ్బలమడుగు, మల్లిమడుగు ప్రాజెక్టులను కూడా ఇందు లో చేర్చుతున్నారు. వీటితో పాటు అతిపెద్ద ఆయకట్టు ఉన్న తొండమనాడు, కందుకూరు వ్యాసరాయ చెరువులను కూడా అనుసంధానంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. త ద్వారా జిల్లాకు అవసరమైన నీటిని అందించాలనే లక్ష్యంతోనే ఈపథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. నీటిని ఈ రిజర్వాయర్లకు తీసుకొచ్చి పైపుల ద్వారా అన్ని గ్రామాలకు పంపింగ్ చేయాలని భావిస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీరూ కరువే.. మూడేళ్లుగా జిల్లాలో సరైన వర్షపాతం నమోదు కావ డం లేదు. ముఖ్యంగా వేసవిలో అయితే పరిస్థితి దా రుణంగా ఉంటోంది. పడమటి మండలాల్లో కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. ఇక తిరుపతి విషయానికి వస్తే కల్యాణి డ్యాంలో నీరు ఎప్పుడూ డెడ్ స్టోరేజీలోనే ఉంది. తిరుపతి తాగునీటి అవసరాలకు ఎక్కువ భాగం తెలుగుగంగ మీదనే ఆధారపడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ జలాశయానికి నీటిని పంపింగ్ చేసి చిత్తూరు ప్రాంతానికి నీటిని ఇవ్వాలని ప్రతిపాదించారు. సాగుకూ కష్టమే.. ఇక వ్యవసాయ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తూర్పు మండలాల్లో కాస్తోకూస్తో భూగ ర్భ జలాలు ఉన్నాయి. పడమటి మండలాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ప్రజలు ఊళ్లు వదిలి పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చే పనిలో పడింది. అందుకోసం ఇరిగేషన్, ప్రాజెక్టుల అధికారులను ప్రణాళికలు తయారుచేసేందుకు పురమాయిం చింది. జిల్లాకు తాగునీరుతో పాటు, సాగుకు, పరిశ్రమలకు సంవత్సరానికి ఎంత నీరు అవసరమవుతుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావ్, జిల్లామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా యుద్ధప్రాతిపదికన పనులు డిజైన్స్ తయారు చేయాలని అదేశించినట్లు అధికారులు చెప్పారు. పెరుగుతున్న అంచనా వ్యయం కిరణ్ హయాంలోనే జిల్లా తాగునీటి శాశ్వత పరిష్కానికి పురుడు పోసుకుంది. అన్ని ప్రాంతాలకు తాగునీటి అవసరాల నిమిత్తం రూ.7,200 కోట్లు కేటాయించారు. అయితే ఆ ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను తెరపైకి తెచ్చింది. కండలేరు నుంచి డెరైక్టుగా నీళ్లను ప్రాజెక్టుల్లోకి తీసుకొచ్చి తద్వారా పట్టణాలకు, గ్రామాలకు అందించాలనే లక్ష్యంతో ఉంది. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.8 వేలకోట్లు ఖర్చవుతాయని భావి స్తోంది. గతంతో పోల్చితే దాదాపు రూ.800 కోట్లు అంచనా వ్యయం పెరిగినట్లు తెలుస్తోంది. నివేదికలు ఇచ్చాం.. జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన నివేదికలు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుగుగంగ ఎస్సీ సుబ్బారావు మంగళవారం ‘సాక్షి’కి వివరించారు. వాటర్‌గ్రిడ్ రాష్ట్ర కన్సల్టెంట్ కొండలరావ్ దీనిపై పూర్తి నివేదిక తీసుకొన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తరువాత ప్రాజెక్టు వివరాలు ప్రకటిస్తామని అన్నారు. -
తీరనున్న తాగునీటి కష్టాలు !
శంషాబాద్: గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించిన వాటర్ గ్రిడ్ పథకంతో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. ఈ పథకంతో మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. సర్కారు ఆదేశాలతో గ్రామీణ నీటి సరఫరా విభాగం వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన సర్వేను పూర్తి చేసి నివేదికను పంపేందుకు సిద్ధమైంది. మండలంలో మొత్తం మూడు పాయింట్లుగా నీటి సరఫరా చేయడానికి ఇందులో ప్రతిపాదించారు. నాగార్జునసాగర్ నుంచి కల్వకుర్తి, ఆమన్‌గల్ మీదుగా వచ్చే నీటి సరఫరాకు మహేశ్వరం మండలం హర్షగూడలో ప్రధాన పంపింగ్పాయింట్గా నిర్ణయించారు. శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ, రాళ్లగూడ, సరూర్‌నగర్ మండలంలోని పహడిషరీఫ్ పాయింట్లుగా నీటి సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రణాళిక వ్యయం సుమారు రూ.51 కోట్లు కావచ్చనే అంచనాలను కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రూపొందించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేయాల్సిన ఒవర్‌హెడ్ ట్యాంకులు, సంపులకు మరో రూ.10 కోట్ల అంచనాను ఇందులో పొందుపర్చారు. శంషాబాద్ మండలానికి ప్రతిరోజు 15 లక్షల 80 వేల లీటర్ల నీటి సరఫరా అవసరాన్ని గుర్తించి ఈ అంచనాను సిద్ధం చేసినట్లు సమాచారం. మెట్రోవాటర్ ఇక అంతే.. వాటర్ గ్రిడ్ పథకాన్ని పట్టాలెక్కించే యోచనలో ఉన్న సర్కారు జలమండలితో శంషాబాద్‌కు కృష్ణా నీటిని సరఫరా చేయాలనే ప్రతిపాదనలను దాదాపు విరమించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. శంషాబాద్ పట్టణానికి రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి రిజర్వాయర్ నుంచి సరఫరా చేయడానికి పైప్‌లైన్ పనులు పూర్తి చేసి కృష్ణా నీటిని సరఫరా చేసినా అది మూన్నాళ్లముచ్చటగానే మారింది. వన్‌టైమ్ కనెక్షన్ డిపాజిట్ కింద జలమండలికి చెల్లించాల్సిన రూ.13 కోట్లు ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడంతో నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం వాటర్‌గ్రిడ్ పథకంలో జల్లపల్లి మీదుగా వచ్చే పైప్‌లైన్‌కు పహడిషరీఫ్ పాయింట్‌గా నీటి సరఫరా చేయాలనే యోచనలో అధికారులున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో జలమండలి నుంచి శంషాబాద్‌కు నీటి సరఫరా అయ్యే అవకాశాలు దాదాపు ముగిసినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. -
‘వాటర్ గ్రిడ్’తో నీటి కష్టాలకు చెక్!
యాచారం: జిల్లాలో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వాటర్ గ్రిడ్ల ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వాట ర్ గ్రిడ్ అమలులో భాగంగా మొదట గ్రామా ల్లో జనాభాపై అధికారులు సర్వే చేస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం జనాభాతో పాటు 2050 వరకు వృద్ధిచెందే జనాభాకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ సర్వే చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ విజయలక్ష్మి ఆధ్వర్యంలో యాచారం, ఇబ్రహీంపట్నం, మంచా ల, హయత్‌నగర్ మండలాల ఏఈలు సర్వేలో నిమగ్నమయ్యారు. ప్రస్తుత జనాభా ఎంత.. 2050 వరకు ఏ మేరకు పెరుగుతుంది.. దీనికనుగుణంగా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తే నీటి సమస్య తీరుతుందనే విషయంలో ఏఈలు సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి నిత్యం 100 లీటర్లు.. ఆర్డబ్ల్యూఎస్ లెక్కల ప్రకారం పట్టణాల్లోని ఒక్కో వ్యక్తికి నిత్యం 135 లీటర్లు, గ్రామాల్లోని వ్యక్తికి 40 లీటర్ల నీరు అందించాలనే నింబంధన ఉంది. కానీ ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇందులో భాగంగానే గ్రామాల్లోని ప్రజలకు నిత్యం 100 లీటర్లు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం మనుషులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మూగజీవాల నీటి అవసరాలు, విద్యాలయాలు, పరిశ్రమలకు అవసరమయ్యే నీటి వినియోగంపైనా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 2011 లెక్కల ప్రకారం 4 లక్షల వరకు జనాభా ఉంటుందని లెక్కలు కట్టారు. ప్రస్తుతమున్న జనాభా మరో 30 ఏళ్లలో ఏ మేరకు పెరుగుతుందో.. అప్పుడు కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. ఏయే గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి...వాటికి ఏమేరకు నీటి కేటాయింపులు అవసరమనే అంశంపై సమగ్ర సర్వే జరుపుతున్నారు. సంపులు, ట్యాంకుల నిర్మాణాలపై దృష్టి.. ప్రస్తుతం గ్రామాల్లో లక్ష నుంచి రెండు లక్షల లీటర్ల మధ్యనే నీటి నిల్వ చేసుకునేలా ట్యాంకులు, సంపులు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి నిత్యం వంద లీటర్లు ఇవ్వడంతోపాటు ఇతర అవసరాల కోసం కూడా నీటి కేటాయింపులు జరపాల్సి ఉండడంతో కొత్తగా ఎక్కువ పరిమాణంలో ఉండే ట్యాంకులు, సంపుల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి సరఫరా అయ్యే కృష్ణాజలాలను గునుగల్ రిజర్వాయర్ నుంచి డివిజన్ ప్రజలకు అందిస్తున్నారు. జిల్లాలో నీటి అవసరాల దృష్ట్యా అక్కంపల్లి నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటిని తరలించేలా ఆలోచనలు చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా గ్రిడ్ల వల్ల ప్రజలకు సరిపడా తాగునీరు అందుతుంది వాస్తవమే కాని నీటి కేటాయింపులు ఎలాగా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాగర్‌లో నీటి నిల్వ తగ్గిపోతే.. ఎలాగా అనే విషయంలోనూ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. -
భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి ఆరుగురు మృతి
-
భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి ఆరుగురు మృతి
కడప: నిన్న రాత్రి ఎడితెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మైలవరం మండలం నవాబుపేటలో విషాదం అలుముకుంది. సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో మట్టి మిద్దె కూలి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా భారీ పంట నష్టం కూడా వాటిల్లింది. మూడు రోజులుగా పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గాలి బీభత్సానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. ఉద్యాన పంటలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, టవర్లు నేల కొరిగాయి. దీంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి అన్నదాతపై కక్ష కట్టడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సుడిగాలుల నేపథ్యంలో విద్యుత్‌స్తంభాలు విరిగిపడుతుండటంతో రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. -
పెనుగాలుల ధాటికి అతలాకుతలం..
పెనుగాలుల ధాటికి జిల్లా వణికిపోతోంది. పచ్చని చెట్లు నిలువునా నేల కూలుతున్నాయి. చేతికందాల్సిన కాయలు నేలపాలవుతున్నాయి. ఆరుగాలం కష్టించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన అరటి, మామిడి, బొప్పాయి తోటలు కళ్లముందే వాలిపోతుంటే రైతన్నకు కన్నీరు మిగులుతోంది. సోమవారం సాయంత్రం ప్రకృతి సృష్టించిన బీభత్సం జన జీవితాలను అతలాకుతలం చేసింది. పంటలు నష్టపోయిన రైతులు ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. సాక్షి, కడప: మూడు రోజులుగా పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గాలి బీభత్సానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. ఉద్యాన పంటలు నేలమట్టం అవుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, టవర్లు నేల కొరుగుతున్నాయి. దీంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి అన్నదాతపై కక్ష కట్టడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సుడిగాలుల నేపథ్యంలో విద్యుత్‌స్తంభాలు విరిగిపడుతుండటంతో రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. దీంతో అక్కడ ప్రజలు తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర ఉన్న చేతి బోర్ల వద్దనే జనాలు బారులు తీరుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనూహ్యంగా గాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతూనే ఉంది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడుతుండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. పంట నష్టం జరిగిన ప్రాంతాలివే! ముఖ్యంగా అరటి, బొప్పాయిపంటలకు సంబంధించి మైదుకూరు మండలంలోని భూమాయపల్లె, కేశిలింగాయపల్లె, విశ్వనాథపురం, బండివారిపల్లె, పోచిరెడ్డిపల్లె, వనిపెంట, ఆదిరెడ్డిపల్లె, కాశినాయన మండలం బసనపల్లె, గొంటువారిపల్లె, ఆకుల నారాయణపల్లెతోపాటు తొండూరు, వేంపల్లె, ముద్దనూరు, వేముల, వీరపునాయునిపల్లె, కమలాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాల్లో మామిడి రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం రైల్వేకోడూరుతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెనుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. -
పుణేకు జల గండం!
పింప్రి, న్యూస్‌లైన్: పుణే వాసులకు నీటి గండం రాబోతుంది. నగర పరిధిలోని జలాశయాలు అడుగంటుతుండడంతో రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణే విభాగంలో 57 తాలూకాలలో 27 తాలూకాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ తాలూకాలలో తాగునీటి కష్టాలు ఎదురవనున్నాయి. భూ జలాల పరిశోధన, అభివృద్ధి విభాగం జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘పుణే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, కొల్హాపూర్ ప్రాంతాల్లోని 57 తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పుణే జిల్లాలో 192 బావుల నీటి మట్టం పరిశీలించాం. అందులో 100 బావులలో భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లాలోని 13 తాలూకాలలోని దౌండ్, పురంధర్, ఇందాపూర్, బారామతి తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సతారా జిల్లాలో 106 బావులలో భూగర్భ జలాలను పరిశీలిస్తే 45 బావులలో జలాలు అడుగంటాయి. 11 తాలూకాలలో సతారా, కోరేగావ్, మహాబలేశ్వర్, పాటణ్, తాలూకాలలో భూగర్భ జలాలు అడుగంటాయి. సాంగ్లీ జిల్లాలో 86 బావులలోని నీటి మట్టాలు పరిశీలించాం. 41 బావుల నీటి మట్టాలు అడుగంటిపోయాయి. పలుస్, కడేగావ్, ఖనాపూర్, శిరాళా, తాలూకాలలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. షోలాపూర్ జిల్లాలో 166 బావుల నీటి మట్టాలను పరీక్షించాం. 68 బావుల జలాలు అడుగంటాయని తేలింద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర సోలాపూర్, కరమాళా తాలూకాలలో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొల్హాపూర్ జిల్లాలో 58 బావులలో నీటి జలాలు అడుగంటాయి. జిల్లాలోని పన్హాళా, రాధనగరి, గడహింగ్లాజ్, కాగల్, ఆజరా, చంద్గడ్, హతకణంగలే తాలూకాలలో నీటి సమస్య అధికంగా ఉందని, వర్షాలు ఎంత తొందరగా కురిస్తే సమస్య తీరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. -
విద్యార్థినుల తాగునీటి కష్టాలకు తెర
నందిగాం, న్యూస్‌లైన్: ఖమ్మం నగరానికి చెందిన వైద్యుడు జి.రఘుకిషోర్ దాతృత్వంతో నందిగాంలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల తాగునీటి కష్టాలు తీరాయి. తన మాతృమూర్తి తోటకూర రజని స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘నేను సైతం’ ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.1.75 లక్షల వ్యయంతో పాఠశాలలో తాగునీటి పథకం నిర్మించారు. ఆదివారం ఈ పథకాన్ని స్వయంగా ఆయన ప్రారంభించారు. ఈ సత్కార్యానికి ఫిబ్రవరి 4న సాక్షి ప్రధాన సంచికలో ‘నీటి కోసం కోటి కష్టాలు’ శీర్షికన వచ్చిన కథనం కారణమవటం విశేషం. విద్యార్థినులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకున్న రఘుకిషోర్ చలించిపోయారు. వెంటనే స్పందించి పాఠశాల ఆవరణలో రెండు బోర్లు, మోటారు, పైపులైను, ట్యాంకు నిర్మింపజేశారు. సాయం చేయడంలో ఎంతో ఆనందం.. పాఠశాలలో నిర్మించిన తాగునీటి పథకాన్ని భగత్‌సింగ్ వర్థంతి సందర్భంగా ఆదివారం డాక్టర్ రఘుకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సమాజం మనకేమిచ్చిందనేది ముఖ్యం కాదు.. సమాజానికి మనమేం చేశామన్నదే ముఖ్యం. ఉన్నంతలో ఇతరులకు సాయం చేయడంలో ఎంతో ఆనందం ఉంది’ అని చెప్పారు. మనం బాగుండాలి.. ఇతరులు బాగుండాలని తలచిననాడే ఎదుటివారికి సాయం చేయగలమన్నారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం చదివాక విద్యార్థినుల సమస్య తీర్చాలని సంకల్పించానని వివరించారు. అందుకే ఇంతదూరం వచ్చి పథకాన్ని ప్రారంభించానని తెలిపారు. విద్య, వైద్యం, పరిశుభ్రత కార్యక్రమాలకు సహాయమందిస్తుంటానని, ఏడాది కాలంగా విశాఖ, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే సేవాగుణం అలవర్చుకోవాలని కోరారు. టెక్కలి ఆర్డీవో ఎ.శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలో తను పనిచేసినపుడు డాక్టర్ రఘుకిషోర్తో పరిచయముందని, ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందం కలిగిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల ఉపకార్యదర్శి(విశాఖ) టి.సరోజ, జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ బి.చంద్రావతి, ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి, వైస్‌ప్రిన్సిపాల్ కె.వైకుంఠరావు పాల్గొన్నారు.