నిధులూ తాగేస్తున్నారు | Leaders makes money with peoples drinking water | Sakshi
Sakshi News home page

నిధులూ తాగేస్తున్నారు

Published Sun, Jun 28 2015 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

నిధులూ తాగేస్తున్నారు

నిధులూ తాగేస్తున్నారు

- తమ్ముళ్ల కోసమే తాగునీటి  సరఫరా
- వర్షాలొచ్చినా ఆగని వైనం
- మేలో తాగునీటి సరఫరాకు రూ.6.57 కోట్ల ఖర్చు
- నోరుమెదపని అధికారులు
 
నీళ్లులేక నోళ్లు ఎండుతున్నా పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు వర్షాలు పడుతున్నా తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకు  తెగ ఆరాటపడిపోతున్నారు. రికార్డుల్లో ట్యాంకర్ల మీద..ట్యాంకర్లు రాసేస్తూ.. వచ్చిన నిధుల్ని వారి జేబులకే మళ్లించేస్తున్నారు. ఇదే అదునుగా అధికార పార్టీ నాయకులు కొందరు తాగునీటి నిధుల్నీ గడగడా తాగేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు.
సాక్షి, చిత్తూరు:
జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వ నీటిసరఫరా పేరుతో జనం నోర్లు కొట్టి పచ్చచొక్కానేతల జేబులు నింపుతున్నారు. ఇదే అదనుగా కొందరు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా దండుకుంటున్నారు. ప్రశ్నించే ద మ్ము.. ఎదురు తిరిగే అధికారులు లేకపోగా కొందరు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి.
 
వర్షాలొచ్చినా నీళ్ల సరఫరా ఆగదే
వర్షాకాలం వచ్చింది.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు కొంత పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తగ్గు ముఖం పట్టింది. అయినా సరే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వపరంగా తాగునీటి సరఫరా రోజురోజుకూ పెరుగుతోంది. ఖర్చూ తడిసిమోపుడవుతోంది. గ్రామాలకు మొక్కుబడిగా నీళ్లు తోలుతూ తమ్ముళ్లు తాగునీటి నిధుల్ని తాగేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గ్రామాలకు నీళ్లు తోలకనే అధికారులతో లాలూచీపడి నిధులు బొక్కేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
 
ఎంత ఖర్చుచేశారంటే
జనవరి నుంచి ఇప్పటివరకు తాగునీటి సరఫరాకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే జనం నీళ్లు తాగాల్సిందే. జనవరిలో 1,317 గ్రామాలకు నీటిసరఫరా కోసం రూ.2,48,16,432 కోట్లు, ఫిబ్రవరిలో 1,697 గ్రామాలకు రూ.2,64,78,963 కోట్లు, మార్చిలో 2,096 గ్రామాలకు రూ.6,17,53,239 కోట్లు, ఏప్రిల్‌లో 2,560 గ్రామాలకు రూ.6.52 కోట్లు, మేలో  2610 గ్రామాలకు రూ.6.57 కోట్లు ఖర్చుచేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా జనవరి నుంచి మే వరకు రూ.23,21,48,334 ఖర్చుచేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌తో కలుపుకుంటే దాదాపు ఆరు నెలల్లో రూ.30 కోట్లు వెచ్చించినట్లు అధికారులు చెబుతున్నారు.
 
అంతా నీళ్ల మాయే?
జీపీఎస్ ద్వారా నీటిసరఫరా చేస్తున్నామని అధికారులు మసిపూసి మరేడుకాయ చేస్తున్నట్లు తెలుస్తోంది. నీళ్లు తోలకుండానే తెలుగుతమ్ముళ్లు నిధులు బొక్కుతున్నార ని తేటతెల్లమవుతోంది. ఈమేరకు జిల్లా పరిషత్ సమావేశాల్లో  ప్రతిపక్ష పార్టీ నేతలు పలుమార్లు ధ్వజమెత్తడం ఈ అవినీతి భాగోతానికి నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా వర్షాలు కురుస్తున్నా నీటి సరఫరా తగ్గకపోవడం వారి వాదనలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది.
 
చాలినంత వర్షం కురిసినా..
నాలుగేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జిల్లాలో మార్చి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. మార్చిలో సాధారణ వర్షపాతం 7.7 మి.మీ కాగా 25.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏప్రిల్‌లో సాధారణ వర్షపాతం 17.6 మి.మీకాగా 90.3 మి.మీ కురిసింది. మే నెలలో 61.7కు గాను 55.9 మి.మీ, జూన్‌లో 78.7కు గాను ఇప్పటి వరకు 73.9 మి.మీ వర్షం కురిసింది. మొత్తంగా నాలుగు నెలల్లో 165.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 245.4 మి.మీ వర్షం కురిసింది. తాగునీటి సరఫరా విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా వారి నుంచి సమాధానం కరువైంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వరదలా ప్రవహిస్తున్న తాగునీటి సరఫరా అక్రమాలకు తెరదించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement