సారు... ఎండుతోంది నోరు
పట్టణాల్లో మొదలైన తాగునీటి కష్టాలు
నీరున్నా.. నిర్వహణపైదృష్టి పెట్టని అధికారులు
ప్రైవేటు ట్యాంకర్లే దిక్కు
జిల్లాలోని పట్టణాలు, నగరాలను తాగునీటి సమస్య వేధిస్తోంది. అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వనరులను సక్రమంగా వినియోగించుకోకపోవడంతో నీరున్నా.. నిర్వహణ సరిగా లేక ప్రజలు అష్టకష్టాలుపడుతున్నారు. నీటి ట్యాంకర్లు వచ్చే వరకు రాత్రనకా.. పగలనకా గంటల తరబడి జనం ఎదురు చూస్తున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పలమనేరు,పుంగనూరు పట్టణాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. సారూ.. ఎండుతోంది నోరు.. అంటూ జనం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
తిరుపతి: ‘‘ జిల్లావాసులకు ఇకపై నీటి క ష్టాలు ఉండువు.. ముఖ్యంగా తిరుపతి నగరప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తాం’’ ఇదీ.. గతేడాది వర్షాలకు కల్యాణీ డ్యామ్ గేట్లు ఎత్తివేసే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ. అయితే నెలలు గడుస్తున్నా.. జిల్లా ప్రజల తాగునీటి అవస్థలు ఏమాత్రం తీరడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యం కారణంగా పుష్కలంగా నీరున్నా.. సక్రమ నిర్వహణ లేక ప్రజల గొంతు తడారిపోతోంది. ప్రధానంగా తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో నీటికష్టాలు తప్పడం లేదు. కొన్ని కాలనీల్లో అంతర్గత పైపులైన్లు, ఎలివేటర్ సర్వీస్ రిజర్వాయర్‌లు లేకపోవడంతో నీటిని రెండు, మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. తిరుపతి నగర పరిధిలోని, ఎంఆర్‌పల్లి, రాజీవ్‌నగర్, తిమ్మాయనల్లె ప్రాంతాలకు మూడు రోజులకొక సారి కూడా నీరు రావడంలేదు. నీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుంటే వేసవిలో సమస్య తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తిరుపతిలో..
మొత్తం జనాభా 4,19,000
నగరానికి రోజు వచ్చి పోయే జనాభా సగటున 50,000
మొత్తం జనాభా 4,69,000
ప్రతిరోజూ అవసరమ్యే నీరు 63.32 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ ఫర్‌డే)
ప్రస్తుతం రోజు విడుదల చేస్తున్న నీరు 42-46 ఎంఎల్‌డీ
అన్ని రకాల జలాశయాల నుంచి రోజుకు అందుబాటులో ఉండే నీరు 88 ఎంఎల్‌డీ
మదనపల్లెలో..
జనాభా 1.75 లక్షలు
ప్రతిరోజూ సరఫరా కోసం అవసరమయ్యే నీరు 18.3 ఎంఎల్‌డీ
ప్రస్తుతం రోజూకు సరఫరా అవుతున్న నీరు 6.5 ఎంఎల్‌డీ
మదనపల్లెలోని 35 వార్డుల్లో ఇప్పటికీ మూడు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. అది కూడా కేవలం 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో మదనపల్లె వాసుల దాహార్తి తీరడం లేదు. ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. ప్రయివేటు వ్యాపారుల నీటి విక్రయాలు రూ. కోట్లలో సాగుతోంది.
పలమనేరులో...
జనాభా 50,000
రోజూ సరఫరా కోసం అవసరమయ్యే నీరు 4.25 ఎంఎల్‌డీ
ప్రస్తుతం సరఫరా అవుతున్న నీరు 3.75 ఎంఎల్‌డీ
కొన్ని ప్రాంతాలకు మూడు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. చాలాచోట్ల ట్యాంకర్లే దిక్కు అవుతున్నాయి. కౌండిన్య జలాశయంలో పట్టణానికి సరిపడా నీరు ఉన్నప్పటికీ అవి కలుషితం కావడంతో ఉవయోగించుకోక పోవడం వల్లే నీటి సమస్య తలెత్తుతోంది.