Kalyani Dam
-
సారు... ఎండుతోంది నోరు
పట్టణాల్లో మొదలైన తాగునీటి కష్టాలు నీరున్నా.. నిర్వహణపైదృష్టి పెట్టని అధికారులు ప్రైవేటు ట్యాంకర్లే దిక్కు జిల్లాలోని పట్టణాలు, నగరాలను తాగునీటి సమస్య వేధిస్తోంది. అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వనరులను సక్రమంగా వినియోగించుకోకపోవడంతో నీరున్నా.. నిర్వహణ సరిగా లేక ప్రజలు అష్టకష్టాలుపడుతున్నారు. నీటి ట్యాంకర్లు వచ్చే వరకు రాత్రనకా.. పగలనకా గంటల తరబడి జనం ఎదురు చూస్తున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పలమనేరు,పుంగనూరు పట్టణాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. సారూ.. ఎండుతోంది నోరు.. అంటూ జనం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తిరుపతి: ‘‘ జిల్లావాసులకు ఇకపై నీటి క ష్టాలు ఉండువు.. ముఖ్యంగా తిరుపతి నగరప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తాం’’ ఇదీ.. గతేడాది వర్షాలకు కల్యాణీ డ్యామ్ గేట్లు ఎత్తివేసే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ. అయితే నెలలు గడుస్తున్నా.. జిల్లా ప్రజల తాగునీటి అవస్థలు ఏమాత్రం తీరడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యం కారణంగా పుష్కలంగా నీరున్నా.. సక్రమ నిర్వహణ లేక ప్రజల గొంతు తడారిపోతోంది. ప్రధానంగా తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో నీటికష్టాలు తప్పడం లేదు. కొన్ని కాలనీల్లో అంతర్గత పైపులైన్లు, ఎలివేటర్ సర్వీస్ రిజర్వాయర్లు లేకపోవడంతో నీటిని రెండు, మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. తిరుపతి నగర పరిధిలోని, ఎంఆర్‌పల్లి, రాజీవ్‌నగర్, తిమ్మాయనల్లె ప్రాంతాలకు మూడు రోజులకొక సారి కూడా నీరు రావడంలేదు. నీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుంటే వేసవిలో సమస్య తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతిలో.. మొత్తం జనాభా 4,19,000 నగరానికి రోజు వచ్చి పోయే జనాభా సగటున 50,000 మొత్తం జనాభా 4,69,000 ప్రతిరోజూ అవసరమ్యే నీరు 63.32 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్డే) ప్రస్తుతం రోజు విడుదల చేస్తున్న నీరు 42-46 ఎంఎల్డీ అన్ని రకాల జలాశయాల నుంచి రోజుకు అందుబాటులో ఉండే నీరు 88 ఎంఎల్డీ మదనపల్లెలో.. జనాభా 1.75 లక్షలు ప్రతిరోజూ సరఫరా కోసం అవసరమయ్యే నీరు 18.3 ఎంఎల్డీ ప్రస్తుతం రోజూకు సరఫరా అవుతున్న నీరు 6.5 ఎంఎల్డీ మదనపల్లెలోని 35 వార్డుల్లో ఇప్పటికీ మూడు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. అది కూడా కేవలం 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో మదనపల్లె వాసుల దాహార్తి తీరడం లేదు. ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. ప్రయివేటు వ్యాపారుల నీటి విక్రయాలు రూ. కోట్లలో సాగుతోంది. పలమనేరులో... జనాభా 50,000 రోజూ సరఫరా కోసం అవసరమయ్యే నీరు 4.25 ఎంఎల్డీ ప్రస్తుతం సరఫరా అవుతున్న నీరు 3.75 ఎంఎల్డీ కొన్ని ప్రాంతాలకు మూడు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. చాలాచోట్ల ట్యాంకర్లే దిక్కు అవుతున్నాయి. కౌండిన్య జలాశయంలో పట్టణానికి సరిపడా నీరు ఉన్నప్పటికీ అవి కలుషితం కావడంతో ఉవయోగించుకోక పోవడం వల్లే నీటి సమస్య తలెత్తుతోంది. -
సీమలో నీటి సమస్యే లేకుండా చేస్తా: సీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నదుల అనుసంధానంతో రాయలసీమలో నీటి సమస్యే లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కల్యాణి డ్యాంను ఆయన శుక్రవారం సందర్శించారు. డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత కల్యాణి డ్యాంలోకి పూర్తి స్థాయిలో నీరు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో భూగర్భజలాలు భారీగా పెరిగాయన్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో శుక్రవారం సాయంత్రం సీఎం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. రానున్న ఐదురోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి విపత్తును ఎదుర్కోవాలని సూచించారు. కష్టపడి పనిచేస్తేనే ఆత్మగౌరవం.. కష్టపడి పనిచే స్తేనే ఆత్మగౌరవం కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన నారావారిపల్లెలో ప్రజలతో సమావేశమయ్యారు. ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచేందుకు ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. విజయవాడలో 30న మంత్రివర్గ సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 30న విజయవాడలో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకన్నారు. మండల పరిధిలోని కళ్యాణి డ్యాం సమీపంలోని పెద్దగుండు వద్ద రెండున్నర టన్నుల ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు స్కార్పియో, స్విఫ్ట్, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 90 దుంగల విలువ సుమారూ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనావేశారు. -
రంగంపేటకు స్మార్ట్ కిరీటం?
తిరుపతి నగరం స్మార్ట్ సిటీ కిరీటం దక్కించుకోవడం దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు ఇందుకు కావాల్సిన భూమిని సైతం సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు చంద్రగిరి మండలం ఏ.రంగంపేట అటవీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు ఎస్వీ జూ పార్క్ దాటిన తరువాత కల్యాణి డ్యాం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ నిర్మాణం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తుడా, రెవెన్యూ విభాగాల్లోని కీలక అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు. - అన్ని అర్హతలతో నివేదికలు రెడీ 50 బ్లాకులు.. - 500 ఎకరాల భూముల గుర్తింపు తిరుపతి తుడా : తిరుపతి నగరం ఎస్వీ జూ పార్కు వరకు విస్తరించడం, అక్కడి నుంచి కల్యాణి డ్యాం వరకు ప్రభుత్వ, అటవీ భూములు పుష్కలంగా ఉండటం స్మార్ట్ సిటీకి అనుకూలం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్మార్ట్ సిటీకి రంగంపేట పరిసర ప్రాంతం అన్ని విధాల అనుకూలంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ క్రమంలో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ధికి కావాల్సిన 500 ఎకరాల భూమితో పాటు అదనంగా మరో 2 వేల ఎకరాల వరకు ఇక్కడ అటవీ భూమి ఉంది. నీటి వనరులకు కల్యాణి డ్యాం, మరో పక్క గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఎస్వీ జూ పార్కు వరకు వస్తుంది. దీంతో నీటి వనరు సమస్య ఉండదు. అటవీ ప్రాంతం కావడంతో భూములన్నీ ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు వాలుగా ఉంటాయి. డ్రైనేజీ వ్యవస్థకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అనంతపురం- నాయుడుపేట రహదారికి ఇదే మార్గం మీదుగా వెళతాయి. మరో పక్క ఎస్వీ జూ పార్కు మీదుగా అలిపిరి బైపాస్ రోడ్డు ఇలా ఏ రంగ ంపేట పరిసర ప్రాంతం స్మార్ట్ సిటీకి అర్హతలు ఉన్నాయని రెవెన్యూ, తుడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. సొంత మండలానికి ఏమి చేయలేదని అపవాదు నుంచి బయటపడేందుకు ఇక్కడే స్మార్ట్ సిటీ నిర్మించాలనేది సీఎం చంద్రబాబు కోరికగా కనిపిస్తోంది. ఆ మేరకు అనధికారికంగా ఆయన ఇక్కడే స్మార్ట్ సిటీ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిలా ఉన్నతాధికారికి చెప్పినట్టు మరో అధికారి చెప్పారు. భూముల గుర్తింపు స్మార్ట్ సిటీకి అవసరమయ్యే భూముల వివరాలను రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు. రంగంపేట, ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో బ్లాకులుగా భూములను గుర్తించి నివేదికను అందజేశారు. అయితే ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలు కేంద్రం విధించిన నిబంధనలకు విరుద్ధంగా నగరానికి చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పటికే ఐఐటీ ఇతర ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతాలకే రాబోతున్నాయి. దీంతో ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలు స్మార్ట్‌కు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు. ఇక రేణిగుంట మండలం విషయానికి వస్తే తాత్కాలికంగా అభివృద్ధికి భూములు ఉన్నా భవిష్యత్ అవసరాలకు ఇక్కడ భూములు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక మిగిలింది ఏ.రంగంపేట మాత్రమే కావడం ఇక్కడ కలిసివచ్చే అంశం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఎస్వీ జూ పార్కుకు ఆనుకుని సుమారుగా కల్యాణి డ్యాం వరకు ప్రభుత్వ, ఫారెస్టు, డీకేటీ భూములను గుర్తించారు. 50 ఎకరాలను ఒక బ్లాకుగా విభజించారు. ఇలా మొత్తం 50 బ్లాకులను సిద్ధం చేశారు. ఒక్కో బ్లాకులో ఎలాంటి మౌలిక వసతులు లభ్యమవుతున్నాయో నివేదికలో పొందుపరిచారు. స్మార్ట్ సిటీకి అర్హత సాధించేం దుకు పక్కా ప్రణాళికతో కలెక్టర్ నివేదికను సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పరిశీలిస్తే... స్మార్ట్ సిటీకి నగరాన్ని ఎంపిక చేయాలంటే ఆ నగరానికి దరిదాపుల్లో 500 ఎకరాల భూములు ఉండాలి. ఆ భూముల్లో అవసరమయ్యే మౌలిక వసతు లు, బ్లాక్‌లుగా విభజించి అభివృద్ధి చేయడానికి అనువైన పరిస్థితులు ఉండాలి. స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేయడం కోసం ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉండటంతోపాటు వాటిల్లో పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉండాలి. స్మార్ట సిటీగా ఎంపికైన ప్రాంతంలో విద్యుత్, డ్రైనే జీ, టెలిఫోన్, నీరు తదితర సౌకర్యాలు భూగర్భ విధానంతో కల్పిస్తారు. ఇందుకు అనుగుణంగా ఆప్రాంతం ఉండాలి. నీటి వసతి ఉండే ప్రాంతంగా ఉంటేనే స్మార్ట్ సిటీ ఎంపికకు అర్హత పొందుతుంది.