సీమలో నీటి సమస్యే లేకుండా చేస్తా: సీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నదుల అనుసంధానంతో రాయలసీమలో నీటి సమస్యే లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కల్యాణి డ్యాంను ఆయన శుక్రవారం సందర్శించారు. డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత కల్యాణి డ్యాంలోకి పూర్తి స్థాయిలో నీరు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో భూగర్భజలాలు భారీగా పెరిగాయన్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో శుక్రవారం సాయంత్రం సీఎం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. రానున్న ఐదురోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి విపత్తును ఎదుర్కోవాలని సూచించారు.
కష్టపడి పనిచేస్తేనే ఆత్మగౌరవం..
కష్టపడి పనిచే స్తేనే ఆత్మగౌరవం కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన నారావారిపల్లెలో ప్రజలతో సమావేశమయ్యారు. ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచేందుకు ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
విజయవాడలో 30న మంత్రివర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 30న విజయవాడలో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.