
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు.
గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ
గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు.
అందించే కోర్సులు
ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు.
వీటితో పాటు స్కిల్ డెవలప్‌మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment